ఫ్లెక్సీ, బ్యానర్, హోర్డింగ్‌ల సంస్కృతి మరోమారు రచ్చకెక్కింది. వీటిని అరికట్టడంలో పాలకుల వైఫల్యాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వమే ఈ ఫ్లెక్సీలతో హంగామా సృష్టిస్తుంటే, ఇక, ఎలా అడ్డుకట్ట వేస్తారని న్యాయమూర్తులు ప్రశ్నించారు. తిరుచ్చి వేదికగా హంగామా సాగడంపై మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రంలోగా ఒక్క ఫ్లెక్సీ, బ్యానర్ ఉండేందుకు వీలు లేదని తొలగించాల్సిందేనన్న ఆదేశాలు ఇచ్చారు.
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఫ్లెక్సీ, బ్యానర్, హోర్డింగ్ సంస్కృతి ఎక్కువేనన్న విషయం తెలిసిందే. రాజకీయ పక్షాలే కాదు, సంఘాలు, సంస్థలు, ఏ చిన్న వేడుకైనా సరే హంగామా చేయాల్సిందే. వీటికి అడ్డుకట్ట వేసే విధంగా ఏళ్ల తరబడి సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి పోరాడుతూనే వస్తున్నారు. ఇప్పటికే మద్రాసు హైకోర్టు వీటి తొలగింపు విషయంగా పలుసార్లు ఉత్తర్వులు, ఆదేశాలు జారీచేసినా ఫలితం శూన్యం. రెండేళ్ల క్రితం అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్ అయితే, తీవ్రంగానే స్పందించారు. ఫ్లెక్సీ, బ్యానర్లు, హోర్డింగ్‌ల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి చేశారు. అనేక రకాల ఆంక్షలు విధించడంతో పాటు, ఇష్టారాజ్యంగా ఏర్పాటుచేసే వాటిమీద పరిశీలించి, అందుకు తగ్గ చర్యలు తీసుకునేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృ త్వంలో ఓ కమిటీ నియమకానికి తగ్గ ఆదేశాలు ఇచ్చారు.
ఆదేశాలు ఖాతరు చేయని రాజకీయ పక్షాలు
ప్రైవేటు ఫ్లెక్సీ, హోర్డింగ్, బ్యానర్ల వ్యవహారంలో నిబంధనలు తప్పని సరిగా అమల్లో ఉన్నా, రాజకీయ పక్షాలు మాత్రం ఆదేశాలను ఖాతరు చేయడం లేదు. దీంతో ఎక్కడ ఫ్లెక్సీ, బ్యానర్ కనిపించినా, స్వయంగా వాటిని తొలగించే పనిలో సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి నిమగ్నం అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంజీఆర్ శత జయంతి పేరుతో సాగుతున్న వేడుకల్లో ప్రభుత్వ హంగామా మళ్లీ ఫ్లెక్సీ, బ్యానర్, హోర్డింగ్‌ల వ్యవహరాన్ని రచ్చకెక్కెలా చేశాయి. రెండు రోజుల క్రితం న్యాయమూర్తి వైద్యనాథన్ బెంచ్ అయితే, ఈ వ్యవహారంపై కీలక ఆదేశాలు ఇచ్చింది. ఫ్లెక్సీ, బ్యానర్, హోర్డింగ్‌లలో బతికే ఉన్న వాళ్ల ఫొటోల్ని పొందుపరిచేందుకు వీలు లేదని ఉత్తర్వులు జారీచేశారు. అయితే, తిరుచ్చి వేదికగా పాలకులు హంగామా సృష్టిస్తూ గత రెండు రోజులుగా చేసిన ఏర్పాట్లు ఇద్దరు న్యాయమూర్తుల నేతృత్వంలోని బెంచ్ ముందుకు గురువారం చేరింది.
తీవ్రంగా పరిగణన
గురువారం హైకోర్టులో ఫ్లెక్సీల వ్యవహారంగా రెండు బెంచ్‌ల ముందు విచారణలు సాగాయి. ఇందులో ఒకటి రెండు రోజుల క్రితం ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా. మరొకటి ప్రభుత్వమే హంగామా సృష్టించడం. బతికి ఉన్న వాళ్ల ఫొటోలను పొందు పరచవద్దని జారీచేసిన ఉత్తర్వులకు స్టే ఇవ్వాలని చెన్నై కార్పొరేషన్ తరఫున అత్యవసర పిటిషన్ దాఖలుకు కసరత్తులు సాగాయి. అయితే, హైకోర్టు నిరాకరించడమే కాకుండా, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి తప్పు లేదని ఏకీ భవిస్తున్నామని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఈ పిటిషన్ విచారణ ముగియగానే, సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన ప్రభుత్వం తరఫు హంగామా గురించిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఈసందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తిరుచ్చిలో అనుమతులతోనే ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎంజీఆర్ జయంతి వేడుకల నిమిత్తం ఏర్పాటు చేసినట్టు వివరించారు. ప్రభుత్వం తరఫున 200, బయటి వ్యక్తులు 20 ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి పొందినట్టు పేర్కొన్నారు. 220కు అనుమతి ఇచ్చినప్పుడు అక్కడ వందలాదిగా ఎలా ఏర్పాటు చేస్తారని న్యాయమూర్తులు సుందరేష్, సుందర్‌ల నేతృత్వంలోని బెంచ్ సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ఉక్కిరి బిక్కిరి కాక తప్పలేదు.
ప్రభుత్వ వేడుకలకు ఇంత అవసరమా?
ప్రభుత్వమే ఫ్లెక్సీలతో ఇలా హంగామా చేస్తుంటే, ఇక, బయటి వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు, సంఘాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించవా.?, అని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వేడుకలకు ఇంత హంగామా అవసరమా..? అన్న ప్రశ్నలు ఇరకాటంలో పడేశాయని చెప్పవచ్చు. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదన్న ప్రశ్నల వర్షంతో, చివరకు సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ విచారణకు నిర్ణయించడం గమనార్హం. దీంతో తిరుచ్చిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లను శుక్రవారం సాయంత్రంలోపు తొలగిస్తామని ప్రభుత్వం తరఫున కోర్టుకు న్యాయవాదులు హామీ ఇచ్చారు. తొలగించాల్సిందేనని ఆదేశిస్తూ, తదుపరి విచారణను సోమవారానికి వాయిదావేశారు. ఆరోజున సమగ్ర నివేదికను సమర్పించాలని న్యాయమూర్తులు సూచించారు. కాగా, ఇదివరకు న్యాయమూర్తి సుందరేష్, సుందర్ పలుమార్లు ఈ వ్యవహారాలపై ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. తాజాగా, సోమవారం ప్రధాన న్యాయమూర్తితో కలిసి విచారించనున్న దృష్ట్యా, కీలక ఆదేశాలు, తీవ్ర హెచ్చరికలు సంధించే అవకాశాలు ఎక్కువే.
Comments
Please login to add a commentAdd a comment