సిటీ నెత్తిన హోర్డింగ్ పిడుగు! | hording frobloms in city | Sakshi
Sakshi News home page

సిటీ నెత్తిన హోర్డింగ్ పిడుగు!

Published Sun, May 22 2016 2:26 AM | Last Updated on Wed, Sep 5 2018 2:25 PM

సిటీ నెత్తిన హోర్డింగ్ పిడుగు! - Sakshi

సిటీ నెత్తిన హోర్డింగ్ పిడుగు!

నగరంలో ఇష్టారాజ్యంగా హోర్డింగ్‌లు, యూనిపోల్స్
నిబంధనలు బేఖాతరు..
ప్రమాదాలు జరిగినప్పుడే స్పందిస్తున్న యంత్రాంగం
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు ఘటనతో చర్యలకు దిగిన వైనం
కొత్తపాలసీ రూపకల్పనకు నిర్ణయం

 సాక్షి, సిటీబ్యూరో : వానొచ్చినా...గట్టిగా గాలి వీచినా నగర వాసి ఉలిక్కి పడుతున్నాడు. ఏ వైపు నుంచి ఏ ముప్పు వస్తుందోనని ఆందోళన చెందుతున్నాడు. భారీ హోర్డింగులు, చెట్లు, విద్యుత్ స్తంభాలు ఎక్కడ పడితే అక్కడ కూలుతుండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వస్తోంది. అస్తవ్యస్తంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు, యూనిపోల్స్ మరీ ప్రమాదకరంగా మారడం ఆందోళన కలిగిస్తోంది.  నగరంలో భవనాలు కూలితే అనుమతులున్నాయో లేదో పరిశీలించడం, అగ్నిప్రమాదాలు జరిగితే ఫైర్ సేఫ్టీ

హోర్డింగ్ పిడుగులు!
ఏర్పాట్లున్నాయో లేవో చూడటం, హోర్డింగులు కూలితే స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఇతరత్రా అంశాలు చర్చకు రావడం పరిపాటిగా మారింది. ప్రమాదాలు జరిగినప్పుడు తప్ప సాధారణ సమయాల్లో వీటిపై శ్రద్ధచూపని యంత్రాంగం...తాజాగా శుక్రవారం గాలివాన బీభత్సానికి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలోని యూనిపోల్ కుప్పకూలి పలు కార్లు ధ్వంసం కావడంతో కళ్లు తెరిచింది. ఈ మేరకు అధికారులు శనివారం హోర్డింగుల అంశంపై అత్యవసర సమావేశం నిర్వహించారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అదే జనంపై పడితే జరిగి ఉండే ప్రాణ నష్టాన్ని అంచనా వేసి పటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. వాస్తవానికి నగరంలో అక్రమంగా వెలిసిన హోర్డింగులు, యూనిపోల్స్‌పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు.

అసలు ఎన్ని అక్రమంగా ఉన్నాయో, ఎన్నింటికి ఫీజులు చెల్లిస్తున్నారో కూడా తెలియదు. ఓవైపు చాలినంత యంత్రాంగం లేక, మరోవైపు ఉన్న యంత్రాంగాన్ని సైతం వివిధ ఇతర పనులకు వినియోగిస్తుండటంతో వీటిపై శ్రద్ధ చూపిన వారు లేరు. అరకొర సిబ్బందితో ఏ క్ష ణాన ఏ హోర్డింగ్ కుప్పకూలుతుందో కూడా తెలియని దుస్థితి. 2007లో బంజారాహిల్స్‌లో ఒక యూనిపోల్ కూలి ఒకరు మృతి చెందడంతోపాటు పలువురు గాయాలపాలైనప్పుడు భవిష్యత్‌లో తిరిగి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకని, తగిన విధివిధానాలు రూపొందించారు. కానీ, వాటిని ఆచరణలో పాటించడం లేదు.

కొద్ది కాలం వరకు మాత్రం నిబంధనలు పాటించినప్పటికీ, అనంతరం విస్మరించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు అడపా దడపా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం స్ట్రక్చరల్ స్టెబిలిటీ అంశం ప్రస్తావనకొస్తోంది. ప్రతి ఏటా లేదా రెండేళ్లకోమారు స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ తప్పనిసరి అనే ప్రకటనలు తప్ప అమలు కావడం లేవు. తాజా ఘటన నేపథ్యంలో తిరిగి వీటిపై దృష్టి సారించారు. నగరంలో జీహెచ్‌ఎంసీ అధికారిక సమాచారం మేరకు 2600లకు పైగా  హోర్డింగ్‌లుండగా, అనుమతిలేకుండా వెలసినవి రెట్టింపు సంఖ్యలో ఉంటాయని అధికారులు సైతం అంచనా  వేశారు.

హోర్డింగుల ఏర్పాటుకు సంబంధించి న్యాయస్థానాల సూచనలు, వివిధ కమిటీల సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ఆయా నగరాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి వీటి ఏర్పాటుకు సంబంధించి నిపుణులతో తగిన పాలసీని రూపొందించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి అన్ని హోర్డింగులను, వినైల్స్‌ను,  తొలగించి వాటి స్ట్రక్చరల్ స్టెబిలిటీని నిర్ధారించాకే, కొత్త పాలసీకనగుణంగా హోర్డింగుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు.

 దాదాపు 60 కి.మీల వేగంతో కూడిన గాలులను మాత్రం పరిగణనలోకి తీసుకొని గతంలో పాలసీని రూపొందించగా, తాజా ఘటనతో 100 నుంచి 150 కి.మీ. వేగానికి తగిన విధంగా రూపొందించాలని భావించారు. హోర్డింగ్ డిస్‌ప్లే సైజు సైతం 40 అడుగులకు మించి ఉండరాదని నిర్ణయించారు. జోన్‌కు ఇద్దరు చొప్పున  జీహెచ్‌ఎంసీలో పదిమంది స్ట్రక్చరల్ ఇంజినీర్లు, నిపుణులతో హోర్డింగ్‌ల సామర్ధ్యంపై అంచనా వేయనున్నారు. ప్రైవేటు ఏజెన్సీలు వాటంతటవే అసెస్ చేసుకునేందుకు సైతం అనుమతిచ్చారు. పదిరోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి, కొత్త పాలసీని రూపొందించి అందుకనుగుణంగా మాత్రమే హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా హోర్డింగులను తొలగించని పక్షంలో క్రిమినల్ చర్యలు చేపట్టనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ హెచ్చరించారు.

 గతంలోని నిబంధనల మేరకు..
హోర్డింగ్ ఏర్పాటుచేసే భవన యజమాని అనుమతి పొందాలి.
ఫుట్‌పాత్‌లు, క్యారేజ్‌వేలపై ఎలాంటి హోర్డింగ్‌లు, యూనిపోల్స్ ఉండరాదు.
నిర్ణీత వ్యవధుల్లో స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్స్ అందజేయాలి.
స్ట్రక్చరల్ డిజైన్లు, స్టెబిలిటీ సర్టిఫికెట్లను గుర్తింపుపొందిన స్ట్రక్చరల్ ఇంజినీర్ల నుంచి తీసుకోవాలి.
హోర్డింగ్ ఏర్పాటులోనూ పటిష్టమైన ఏర్పాట్లుండాలి.
అదనపు వినైల్ షీట్లను వినియోగించరాదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement