కంభం రూరల్, న్యూస్‌లైన్: కంభం మండలంలో శనివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకొరగడంతో పాటు సుమారు 30కిపైగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఉదయం నుంచి ప్రచండభానుడి దెబ్బకు విలవిల్లాడిన కంభం ప్రజలకు ఊరటనిస్తూ సాయంత్రం వర్షం మొదలైంది. దీనికితోడు ఒక్కసారిగా పెనుగాలులు వీచడంతో కంభం నుంచి గిద్దలూరు వెళ్లే రోడ్డుపై ఉన్న చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్‌వైర్లు, స్తంభాలపై పడటంతో కంభం నుంచి బేస్తవారిపేట, హెచ్‌గూడెం గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసే 11 కేవీ తీగలు తెగిపడ్డాయి.
దీంతో ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాఫిక్‌కు కూడా కొద్దిసేపు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న విద్యుత్ ఏఈ ఖాసీంవలి సిబ్బందితో అక్కడకు చేరుకుని రోడ్డుపై అడ్డంగా పడివున్న స్తంభాలు, తీగలను తొలగించారు. ఏఈ మాట్లాడుతూ ఈదురు గాలులకు కంభం పట్టణంలో 10 స్తంభాలు, సూరేపల్లిలో 2, లింగోజిపల్లిలో 4, ఎల్.కోటలో 5, జంగంగుంట్ల నుంచి సూరేపల్లికి వెళ్లే రహదారిలో 11, జంగంగుంట్ల ఎస్సీపాలెంలో 2, జంగంగుంట్లలో 2 విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు ఆయన తెలిపారు. యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నామని పేర్కొన్నారు.
బేస్తవారిపేట మండలంలో...
బేస్తవారిపేట, న్యూస్‌లైన్ : ఈదురుగాలులతో కూడిన వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. భారీ చెట్లు సైతం నేలవాలాయి. మండలంలోని గొట్టమిండ్లులో పొట్టిపాటి జాన్‌పాల్‌కు చెందిన రేకుల షెడ్డు కుప్పకూలింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న జాన్‌పాల్, మరియమ్మలపై రేకులు, ఇటుకలు పడటంతో వారికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు స్పందించి ఆటోలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు వారిని తరలించారు.
చింతలపాలెం గ్రామానికి చెందిన ఉదయగిరి నరసింహులు, దేవరపల్లి సుబ్బరాయుడు, గువ్వా చిన్నదస్తగిరి, గువ్వా పెద్దదస్తగిరి, పొట్టేల్ల చిన్నకాశయ్య, మాజీ సర్పంచ్ మాబు, దేవరపల్లి చిన్నసుబ్బరాయుడు, సయ్యద్ మహబూబ్‌బాషా, ఎస్సీకాలనీకి చెందిన కృపయ్య, మల్లయ్య, మరో ఐదుగురి ఇళ్లపై రేకులు ఎగిరి కిందపడ్డాయి. గ్రామంలోని మసీదు గోడతో పాటు పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు చుట్టూ ఉన్న ప్రహరీ కుప్పకూలింది. మహబూబ్‌బాషాకు చెందిన గేదెల రేకుల షెడ్డు పూర్తిగా పడిపోయింది. దీంతో రెండు గేదెలకు గాయాలయ్యాయి. అదే షెడ్డులోని 100 బస్తాల సిమెంట్ తడిసిపోయింది. చింతలపాలెం వెలిగొండ ప్రాజెక్టు సమీపంలో హైవేపై చెట్లు విరిగి 11 కేవీ విద్యుత్ లై న్‌పై పడటంతో తీగలు తెగిపడ్డాయి. దీనివల్ల నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగి హైవేపై పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గొట్టమిండ్లు, చింతలపాలెం, బేస్తవారిపేట గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఈదురుగాలుల బీభత్సం
Published Sun, May 25 2014 2:26 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement