ఫామ్‌హౌస్‌లో ప్రణయం
‘‘నాకో మంచి హిట్ రావాలనే ఆశయంతో అందరూ కష్టపడి ఈ సినిమా చేశారు. కొంతమందైతే పారితోషికం కూడా తీసుకోలేదు. అందరూ మనసు పెట్టి సినిమా చేస్తే తెలుగు పరిశ్రమ బాగుంటుంది. లేకపోతే రాబోయే రోజుల్లో పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది’’ అని శివాజీ చెప్పారు. ఆయన హీరోగా శ్రేయాస్ మీడియా సమర్పణలో స్నేహ మీడియా, హెజెన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మించిన చిత్రం ‘బూచమ్మా బూచోడు’.
రేవన్ యాదు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఆడియో సీడీని మధుర శ్రీధర్ ఆవిష్కరించి మల్టీ డైమన్షన్ వాసుకి ఇచ్చారు. బిగ్ సీడీని మారుతి విడుదల చేశారు. వినోద ప్రధానంగా సాగే హారర్ మూవీ ఇదని, ఈ నెల 18 లేక 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఓ యువజంట ఫామ్‌హౌస్‌లోకి అడుగుపెట్టాక ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేదే ఈ చిత్రం ప్రధానాంశం అని దర్శకుడు తెలిపారు. ఇది కొత్త జానర్‌లో సాగే సినిమా అని చిత్రసంగీతదర్శకుడు శేఖర్ చంద్ర చెప్పారు.