
న్యూజిలాండ్ పై భారత్ గెలుపు
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్ తో శుక్రవారం జరిగిన మూడో టెస్టులో సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత్ 3-2 తేడాతో విజయం సాధించింది. దాంతో నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యం సంపాదించింది. ఆట మొదలైన పదో నిమిషంలో రూపేందర్ సింగ్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచి భారత్ ను ఆధిక్యంలోకి తీసుకువెళ్లాడు.
భారత తొలి గోల్ ఆధిక్యం 52వ నిమిషం వరకూ కొనసాగగా, న్యూజిలాండ్ ఆటగాడు స్టీవ్ ఎడ్వర్డ్స్ అద్భుతమైన గోల్ ను వేసి స్కోరును సమం చేశాడు. ఆ తరువాత రమన్ దీప్ సింగ్ గోల్ సాధించి జట్టును తిరిగి ఆధిక్యంలోకి తీసుకువెళ్లాడు. మ్యాచ్ మరో 40 నిమిషాల్లో ముగుస్తుందనగా భారత ఆటగాడు ధర్మవీర్ సింగ్ మరో గోల్ ను నమోదు చేశాడు. దీంతో న్యూజిలాండ్ ఇక తిరిగి తేరుకోలేక పోవడంతో భారత్ కు విజయం దక్కింది. తొలి టెస్టులో న్యూజిలాండ్ గెలవగా, రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది.చివరిదైన నాల్గో టెస్టు ఆదివారం జరుగనుంది.