భారత మహిళల గోల్స్ వర్షం
గువాహటి: దక్షిణాసియా క్రీడల్లో భారత మహిళా హాకీ జట్టు బ్రహ్మాండమైన విజయంతో టోర్నీని ఆరంభించింది. ఆదివారం నేపాల్ తో జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో భారత్ గోల్స్ వర్షం కురిపించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 గోల్స్ సాధించి నేపాల్ కు చుక్కలు చూపించింది. అదే క్రమంలో నేపాల్కు ఒక్క గోల్ కూడా సమర్పించుకోని భారత్ పరిపూర్ణ విజయాన్ని నమోదు చేసింది. భారత అటాకింగ్ కు ఏ దశలోనూ పోటీనివ్వని నేపాల్ పూర్తిగా తేలిపోయి ఘోర ఓటమిని చవిచూసింది.
భారత మహిళల్లో సౌందర్య యెండాల(15వ 52వ, 62వ, 64వ నిమిషాల్లో), పూనమ్ బర్లా(7వ, 42వ, 43వ, 51వ నిమిషాల్లో) నాలుగేసి గోల్స్ తో రాణించగా, రాణి(2వ, 46వ, 48వ నిమిషాల్లో), జస్పరిత్ కౌర్ (4వ, 35వ, 56వ నిమిషాల్లో) , నేహా గోయల్(14వ,22వ, 70వ నిమిషాల్లో), దీపిక(53వ, 62వ, 67వ నిమిషాల్లో) మూడేసి గోల్స్ చొప్పున నమోదు చేశారు. మరోవైపు గుర్జిత్ కౌర్(21వ 41వ నిమిషాల్లో), ప్రీతి దుబే(23వ, 29వ నిమిషాల్లో)లు చెరో రెండు గోల్స్ సాధించి విజయంలో భారీ విజయంలో పాలు పంచుకున్నారు. భారత హాకీ జట్టు తమ తదుపరి మ్యాచ్ ను సోమవారం శ్రీలంకతో ఆడనుంది.