SAG
-
308 పతకాలతో భారత్ అగ్రస్థానం
గువాహటి:గత కొన్ని రోజులుగా ఎంతో అట్టహాసంగా జరిగిన దక్షిణాసియా క్రీడలు ఇక్కడ ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో మంగళవారం ముగిశాయి.ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ దక్షిణాసియా క్రీడలు ముగిసినట్లు ప్రకటించారు. మరోవైపు ముగింపు కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి తరుణ్ గోగాయ్ తో పాటు మేఘాలయ క్రీడా మంత్రి జనిత్ ఎమ్ సంగ్మాలు పాల్గొన్నారు. ఈసారి దక్షిణాసియా క్రీడలను అసోం-మేఘాలయాలు సంయుక్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పోటీలకు మూడోసారి ఆతిథ్యమిచ్చిన భారత్.. అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్రవేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆది నుంచి ఆధిపత్యం కొనసాగించిన భారత్ అదే ఊపును చివరి రోజు కూడా కనబరించింది. తద్వారా 308 పతకాలను తన ఖాతాలో వేసుకున్న భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులో 188 స్వర్ణపతకాలు, 90 రజత పతకాలు, 30 కాంస్య పతకాలను భారత్ సాధించింది. కాగా, 186(25 స్వర్ణాలు, 63 రజతాలు, 98 కాంస్యాలు) పతకాలతో శ్రీలంక రెండో స్థానంలో నిలవగా, పాకిస్తాన్ 106 (12 స్వర్ణాలు, 37 రజతాలు, 57 కాంస్యాలు) పతకాలతో మూడో స్థానం సాధించింది. 12 రోజుల పాటు జరిగిన దక్షిణాసియా క్రీడల్లో ఎనిమిది దేశాలు పాల్గొన్నాయి. దాదాపు 2,500 పైగా అథ్లెటిక్స్ ఈ పోటీల్లో పాల్గొన్నారు. -
మేరీకోమ్ 'పంచ్'అదిరింది!
షిల్లాంగ్:దక్షిణాసియా క్రీడల్లో భారత మహిళా స్టార్ బాక్సర్ , లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీకోమ్ పదునైన పంచ్‌లతో అదరగొట్టింది. మంగళవారం అనుషా దిల్రుక్షి (శ్రీలంక)తో జరిగిన పోరులో మేరీకోమ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంది. 51 కేజీల విభాగంలో పవర్ పంచ్‌లతో విరుచుకుపడిన మేరీకోమ్ నాకౌట్ విజయం సాధించి పసిడిని దక్కించుకుంది. కేవలం 90 నిమిషాల్లో ముగిసిన పోరులో మేరీకోమ్ ఆద్యంతం ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఓ దశలో మేరీకోమ్ కురిపించిన బలమైన పంచ్‌లకు అనుషా వద్ద సమాధానమే లేకుండా పోయింది. మేరీకోమ్ పంచ్‌లకు అదుపు తప్పి కిందిపడిపోయిన అనుషా కుడి మోకాలుకు గాయం అయ్యింది. దీంతో అనుషా రెండు నుంచి మూడు నెలల పాటు బాక్సింగ్ కు దూరమయ్యే అవకాశం ఉందని శ్రీలంక టీమ్ డాక్టరు తెలిపారు. ఇదిలా ఉండగా, మరో భారత బాక్సర్ పూజా రాణి కూడా స్వర్ణ పతాకాన్ని కైవసం చేసుకుంది. 75 కేజీల విభాగంలో శ్రీలంక దేశానికే చెందిన నిలాన్తిపై టెక్నికల్ నాకౌట్ విజయం సాధించిన పూజారాణి పసిడిని దక్కించుకుంది. అయితే ఏడాది నిషేధం తరువాత బాక్సింగ్ రింగ్‌లోకి వచ్చిన భారత బాక్సర్ సరితాదేవి పోరాడి గెలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. సరితా దేవి 39-36 తేడాతో శ్రీలంక మహిళా బాక్సర్ విదుషికా ప్రభాదిపై విజయం సాధించి పసిడి పతకాన్ని చేజిక్కించుకుంది. తద్వారా అందుబాటులో ఉన్న మూడు స్వర్ణపతకాలను కైవసం చేసుకున్న భారత మహిళా బాక్సర్లు క్లీన్‌స్వీప్ చేశారు. దీంతో బాక్సింగ్ ఈవెంట్ లో మొత్తంగా 10 స్వర్ణాలను భారత్ తన ఖాతాలో వేసుకుని టోర్నీని ఘనంగా ముగించింది. సోమవారం పురుషుల బాక్సింగ్‌లో భారత్ క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఏడింటికి ఏడు స్వర్ణాలను భారత బాక్సర్లు సొంతం చేసుకున్నారు. -
భారత్ పసిడి 'పట్టు'
గువాహటి: దక్షిణాసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ప్రత్యేకంగా సోమవారం ముగిసిన రెజ్లింగ్ పోరులో భారత్ ఆరు పతకాలను సాధించి తన సత్తాను మరోసారి నిరూపించుకుంది. ఇందులో ఐదు స్వర్ణ పతకాలను భారత రెజ్లర్లు సాధించగా, ఒక రజతాన్ని దక్కించుకున్నారు. దీంతో మొత్తంగా రెజ్లింగ్ లో 14 పసిడి పతకాలను, రెండు రజతాలను భారత్ తన ఖాతాలో వేసుకుంది. వీటిలో భారత పురుషులు ఆరు స్వర్ణ పతకాలను, రెండు రజత పతకాలను సాధించగా, మహిళా రెజ్లర్లు ఎనిమిది స్వర్ణపతాకాలను కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన రెజ్లింగ్ పోరులో భారత మహిళా రెజ్లర్ షిల్పి షీరాన్ స్వర్ణంతో బోణి చేసింది. 63కేజీల విభాగంలో బంగ్లాదేశ్ క్రీడాకారిణి ఫర్జానా షర్మిన్ ను ఓడించి షీరాన్ పసిడిని సాధించింది. అనంతరం రజని(69 కేజీల విభాగం), నిక్కీ(75 కేజీల విభాగం)లు పసిడి పతకాలు సాధించారు. ఆపై పురుషుల పోరులో మౌసమ్ ఖత్రి(97 కేజీల విభాగం), ప్రదీప్(74కేజీల విభాగం)లు పసిడి పట్టు పట్టగా, మన్ దీప్(125 కేజీల విభాగం) రజతంతో సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం భారత్ 46 స్వర్ణాలు, 17 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 69 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
ఫుట్‌బాల్‌లో నేపాల్ కు రెండో విజయం
షిలాంగ్:దక్షిణాసియా క్రీడల్లో భాగంగా మహిళల ఫుట్ బాల్ లో నేపాల్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ఆదివారం మాల్దీవులతో జరిగిన మ్యాచ్ లో నేపాల్ 2-0తేడాతో విజయం సాధించింది. నేపాల్ కెప్టెన్ అను మాలిక్ , నిరూ థాపాలు చెరో గోల్ చేసి విజయంలో తోడ్పడ్డారు. మ్యాచ్ ఆరంభమైన తొలి నిమిషంలోనే పటిష్ట నేపాల్ కు గోల్ చేసే అవకాశం వచ్చినా మాల్దీవ్ గోల్ కీపర్ అబ్దుల్ రజాక్ అడ్డుకున్నాడు. కాగా, ఆట 36 వ నిమిషంలో సబితా పాస్ ను అందిపుచ్చుకున్నఅను గోల్ గా మలచి నేపాల్ ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. ఆ తరువాత మాల్దీవులు స్కోరును సమం చేద్దామని ప్రయత్నించినా ఫలితం రాలేదు. అయితే 89వ నిమిషంలో నేపాల్ మరో గోల్ చేసి 2-0 తేడాతో విజయం సొంతం చేసుకుంది. -
భారత మహిళల గోల్స్ వర్షం
గువాహటి: దక్షిణాసియా క్రీడల్లో భారత మహిళా హాకీ జట్టు బ్రహ్మాండమైన విజయంతో టోర్నీని ఆరంభించింది. ఆదివారం నేపాల్ తో జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో భారత్ గోల్స్ వర్షం కురిపించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 గోల్స్ సాధించి నేపాల్ కు చుక్కలు చూపించింది. అదే క్రమంలో నేపాల్‌కు ఒక్క గోల్ కూడా సమర్పించుకోని భారత్ పరిపూర్ణ విజయాన్ని నమోదు చేసింది. భారత అటాకింగ్ కు ఏ దశలోనూ పోటీనివ్వని నేపాల్ పూర్తిగా తేలిపోయి ఘోర ఓటమిని చవిచూసింది. భారత మహిళల్లో సౌందర్య యెండాల(15వ 52వ, 62వ, 64వ నిమిషాల్లో), పూనమ్ బర్లా(7వ, 42వ, 43వ, 51వ నిమిషాల్లో) నాలుగేసి గోల్స్ తో రాణించగా, రాణి(2వ, 46వ, 48వ నిమిషాల్లో), జస్పరిత్ కౌర్ (4వ, 35వ, 56వ నిమిషాల్లో) , నేహా గోయల్(14వ,22వ, 70వ నిమిషాల్లో), దీపిక(53వ, 62వ, 67వ నిమిషాల్లో) మూడేసి గోల్స్ చొప్పున నమోదు చేశారు. మరోవైపు గుర్జిత్ కౌర్(21వ 41వ నిమిషాల్లో), ప్రీతి దుబే(23వ, 29వ నిమిషాల్లో)లు చెరో రెండు గోల్స్ సాధించి విజయంలో భారీ విజయంలో పాలు పంచుకున్నారు. భారత హాకీ జట్టు తమ తదుపరి మ్యాచ్ ను సోమవారం శ్రీలంకతో ఆడనుంది.