మేరీకోమ్ 'పంచ్'అదిరింది!
షిల్లాంగ్:దక్షిణాసియా క్రీడల్లో భారత మహిళా స్టార్ బాక్సర్ , లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీకోమ్ పదునైన పంచ్లతో అదరగొట్టింది. మంగళవారం అనుషా దిల్రుక్షి (శ్రీలంక)తో జరిగిన పోరులో మేరీకోమ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంది. 51 కేజీల విభాగంలో పవర్ పంచ్లతో విరుచుకుపడిన మేరీకోమ్ నాకౌట్ విజయం సాధించి పసిడిని దక్కించుకుంది. కేవలం 90 నిమిషాల్లో ముగిసిన పోరులో మేరీకోమ్ ఆద్యంతం ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
ఓ దశలో మేరీకోమ్ కురిపించిన బలమైన పంచ్లకు అనుషా వద్ద సమాధానమే లేకుండా పోయింది. మేరీకోమ్ పంచ్లకు అదుపు తప్పి కిందిపడిపోయిన అనుషా కుడి మోకాలుకు గాయం అయ్యింది. దీంతో అనుషా రెండు నుంచి మూడు నెలల పాటు బాక్సింగ్ కు దూరమయ్యే అవకాశం ఉందని శ్రీలంక టీమ్ డాక్టరు తెలిపారు. ఇదిలా ఉండగా, మరో భారత బాక్సర్ పూజా రాణి కూడా స్వర్ణ పతాకాన్ని కైవసం చేసుకుంది. 75 కేజీల విభాగంలో శ్రీలంక దేశానికే చెందిన నిలాన్తిపై టెక్నికల్ నాకౌట్ విజయం సాధించిన పూజారాణి పసిడిని దక్కించుకుంది.
అయితే ఏడాది నిషేధం తరువాత బాక్సింగ్ రింగ్లోకి వచ్చిన భారత బాక్సర్ సరితాదేవి పోరాడి గెలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. సరితా దేవి 39-36 తేడాతో శ్రీలంక మహిళా బాక్సర్ విదుషికా ప్రభాదిపై విజయం సాధించి పసిడి పతకాన్ని చేజిక్కించుకుంది. తద్వారా అందుబాటులో ఉన్న మూడు స్వర్ణపతకాలను కైవసం చేసుకున్న భారత మహిళా బాక్సర్లు క్లీన్స్వీప్ చేశారు. దీంతో బాక్సింగ్ ఈవెంట్ లో మొత్తంగా 10 స్వర్ణాలను భారత్ తన ఖాతాలో వేసుకుని టోర్నీని ఘనంగా ముగించింది. సోమవారం పురుషుల బాక్సింగ్‌లో భారత్ క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఏడింటికి ఏడు స్వర్ణాలను భారత బాక్సర్లు సొంతం చేసుకున్నారు.