308 పతకాలతో భారత్ అగ్రస్థానం
గువాహటి:గత కొన్ని రోజులుగా ఎంతో అట్టహాసంగా జరిగిన దక్షిణాసియా క్రీడలు ఇక్కడ ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో మంగళవారం ముగిశాయి.ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ దక్షిణాసియా క్రీడలు ముగిసినట్లు ప్రకటించారు. మరోవైపు ముగింపు కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి తరుణ్ గోగాయ్ తో పాటు మేఘాలయ క్రీడా మంత్రి జనిత్ ఎమ్ సంగ్మాలు పాల్గొన్నారు. ఈసారి దక్షిణాసియా క్రీడలను అసోం-మేఘాలయాలు సంయుక్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ పోటీలకు మూడోసారి ఆతిథ్యమిచ్చిన భారత్.. అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్రవేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆది నుంచి ఆధిపత్యం కొనసాగించిన భారత్ అదే ఊపును చివరి రోజు కూడా కనబరించింది. తద్వారా 308 పతకాలను తన ఖాతాలో వేసుకున్న భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులో 188 స్వర్ణపతకాలు, 90 రజత పతకాలు, 30 కాంస్య పతకాలను భారత్ సాధించింది. కాగా, 186(25 స్వర్ణాలు, 63 రజతాలు, 98 కాంస్యాలు) పతకాలతో శ్రీలంక రెండో స్థానంలో నిలవగా, పాకిస్తాన్ 106 (12 స్వర్ణాలు, 37 రజతాలు, 57 కాంస్యాలు) పతకాలతో మూడో స్థానం సాధించింది. 12 రోజుల పాటు జరిగిన దక్షిణాసియా క్రీడల్లో ఎనిమిది దేశాలు పాల్గొన్నాయి. దాదాపు 2,500 పైగా అథ్లెటిక్స్ ఈ పోటీల్లో పాల్గొన్నారు.