Women hockey
-
క్వార్టర్ ఫైనల్ బెర్త్ కోసం స్పెయిన్‌తో భారత్ పోరు
ప్రపంచకప్ మహిళల హాకీ టోర్నీలో ఆదివారం జరిగే ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో స్పెయిన్‌తో భారత్ ఆడుతుంది. గెలిచిన జట్టు క్వార్టర్ ఫైనల్ చేరుతుంది. న్యూజిలాండ్‌తో జరిగిన పూల్ ‘బి’ మ్యాచ్‌లో సవితా పూనియా కెప్టెన్సీలోని టీమిండియా 3–4తో ఓడిపోయింది. అయితే ఇంగ్లండ్ జట్టు చేతిలో చైనా కూడా ఓడిపోవడం భారత్‌కు కలిసొచ్చింది. భారత్, చైనా రెండు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలువగా... మెరుగైన గోల్స్ అంతరంతో భారత్ మూడో స్థానంలో నిలిచి ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌కు అర్హత సాధించింది. -
వస్తూ.. వస్తూ కొంచెం బంగారం తీసుకురండి!
దేశంలో కోలాహలంగా ఉంది. ఒలింపిక్స్‌లో ఇండియన్ విమెన్ హాకీ టీమ్ ఆస్ట్రేలియాను ఓడించి సెమీ ఫైనల్స్‌కు వెళ్లి చరిత్ర సృష్టించింది. ఆగస్టు 4న అర్జంటీనాతో సెమిస్లో గెలిస్తే అది మరో చరిత్ర. కాని ఇదంతా జరగక ముందే ఇలాంటిది ఒకటి సినిమాలో జరిగింది. ‘చక్ దే ఇండియా’లో రీల్ విమెన్ టీమ్ ఆస్ట్రేలియా మీద గెలిచి వరల్డ్ కప్ సాధిస్తుంది. ఇప్పుడు ఆ రీల్ టీమ్ తారలు రియల్ టీమ్‌ను అభినందిస్తున్నారు. అంతేనా? రీల్ టీమ్ కోచ్ షారూక్ ఖాన్ రియల్ కోచ్‌ను ‘సరే సరే.. వస్తూ వస్తూ కాసింత బంగారం తెండి’ అని ‘మాజీ కోచ్’ హోదాలో కోరాడు. అసలు ఇదంతా ఎంత సందడో కదా. మొత్తం 16 మంది ప్లేయర్లు. ఒక ప్రాంతం కాదు. ఒక భాష కాదు. ఒక భౌతిక, మానసిక స్థితి కాదు. ఒకే రకమైన ఆట కాదు. కదలికా కాదు. కాని ఒలింపిక్స్ కోసం టోక్యోలో క్వార్టర్ ఫైనల్స్‌లో నిన్న (ఆగస్టు 2న) శక్తిమంతమైన (ప్రపంచ 3వ ర్యాంకు) ఆస్ట్రేలియా జట్టు పై పోటీకి దిగినప్పుడు వాళ్లందరి కళ్ల ముందు ఒకే దృశ్యం కనపడుతూ వచ్చింది. అది దేశ జాతీయ పతాకం భారత క్రీడా ఆకాంక్ష భారత ప్రజలు ఆశిస్తున్న విశ్వ క్రీడా గుర్తింపు. అందుకే విమెన్ హాకీ టీమ్ పట్టుదలగా, అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించింది. 19 ఏళ్ల నుంచి 31 ఏళ్ల వరకూ రకరకాల వయసుల్లో ఉన్న ఈ మహిళా ప్లేయర్లు తమ చురుకుదనాన్ని, అనుభవాన్ని సంయమనం చేసుకుంటూ 160 గ్రాముల హాకీ బాల్ మీద 130 కోట్ల మంది భారతీయులు పెట్టిన భారాన్ని ఒడుపుగా బ్యాట్‌తో నెడుతూ విజయం అనే లక్ష్యానికి చేర్చారు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 1980 ఒలిపింక్స్‌లో మన మహిళా జట్టు విశ్వ వేదిక మీద అలాంటి ప్రదర్శన ఇచ్చింది. ఇన్నాళ్లకు మళ్లీ ఇప్పుడు. క్రీడలంటే పురుషుల గుత్త సొత్తు కాదు... మాది... క్రీడాకాశంలో మేము సగం అని మన మహిళా క్రీడాకారులు ఎలుగెత్తి చాటిన సందర్భం ఇది. చరిత్రాత్మక సందర్భం. పతకాల కంటే కూడా ప్రయత్నమే గొప్పగా వీరు మనసుల్ని గెలుచుకున్నారు. అయితే ఇదంతా ‘డెజావూ’గా ఉంది కొందరికి. కారణం ఇలాంటి విజయాన్ని ఇదివరకే భారతీయులు చూడటం వల్లే. కాకుంటే వెండితెర మీద. ‘చక్ దే ఇండియా’ సినిమాలో. అందుకే ఆ సినిమాలో పని చేసినవారూ, చూసిన వారూ ఇప్పుడా సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. చక్ దే ఇండియా 2007లో ‘చక్ దే ఇండియా’ వచ్చింది. అంతవరకూ క్రికెట్‌దే రాజ్యంగా, క్రికెట్ నేపథ్య సినిమాలే ప్రధానంగా వస్తుంటే చక్ దే.. వచ్చి హాకీని తెర మీదకు తెచ్చింది. అదీ మహిళా హాకీని. ‘ఎందుకు మహిళా హాకీని ఇంత చిన్న చూపు చూస్తారు. వారి గొప్పతనం తెలిపే సినిమా తీయాలి’ అని దర్శకుడు షిమిత్ అమిన్ అనుకోవడంతో ఈ సినిమా సాధ్యమైంది. 2002 కామన్వెల్త్ క్రీడల్లో, 2004 ఆసియా కప్‌లో భారత మహిళా హాకీ అద్భుతమైన ప్రతిభ చూపడమే ఇందుకు కారణం. అదీ కాక మన ప్రేక్షకులకు క్రికెట్ తెలిసినంతగా హాకీ తెలియదు. హాకీ ఆటలో ఉండే మెళకువలు, కఠోర సాధన, సాటి వారి నుంచి ఎదురయ్యే సవాళ్లు ముఖ్యంగా మహిళా ప్లేయర్లకు ఎలా ఉంటాయో చూపుతూ ఈ సినిమా తీయాలని నిశ్చయించుకున్నారు. ఇందులో కోచ్‌గా షారూక్ ఖాన్ నటించడానికి అంగీకరించడంతో గ్లామర్ యాడ్ అయ్యింది. నిజ జీవిత పాత్రలతో మహిళా హాకీకి కోచ్‌గా ఉన్న మహరాజ్ క్రిషన్ కౌశిక్‌ను కలిసిన దర్శకుడు షిమిత్ ఆటను సినిమాగా రాసుకోవడమే కాదు మరో హాకీ కోచ్ మిర్ రంజన్ నెగి గురించి తెలుసుకున్నాడు. 1982 ఆసియన్ గేమ్స్‌లో పాకిస్తాన్‌తో ఆడిన మేచ్‌లో ఇండియా ఘోరంగా ఓడిపోయింది. ఆ మేచ్‌కు గోల్ కీపర్‌గా వ్యవహరించిన నేగి మొహం చెల్లక అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు అజ్ఞాతం వీడి మహిళా జుట్టుకు గోల్కీపింగ్లో శిక్షణ ఇచ్చి విజయబాటలో నడిపాడు. ఇతని పాత్రే షారుక్‌ఖాన్ పాత్రకు ఇన్స్పిరేషన్. అదొక్కటే కాదు క్రీడాకారుల్లో ఉండే ఇగో, భాషాభేదం, ప్రాంతీయభేదం... వీటన్నింటిని దాటి కోచ్‌లు ఆ టీమ్‌ని ఏకతాటిపై ఎలా తీసుకువస్తాడో కూడా సినిమాలో చూపడం వల్ల ప్రేక్షకులకు నచ్చింది. రీల్ టీమ్ తబ్బిబ్బు సినిమాలో ఆస్ట్రేలియా టీమ్‌పై గెలిచినట్టే ఇప్పుడు ఒలింపిక్స్‌లో మన జట్టు ఆస్ట్రేలియా జట్టుపై గెలవడంతో చక్ దే..లో పని చేసిన తారలు సంతోషంతో ట్వీట్లు చేస్తున్నారు. చక్దేలో కెప్టెన్‌గా నటించిన విద్య మలవడె ‘ఉదయం నించి నా ఫోన్ మోగుతూనే ఉంది. నేను తెర మీదే గెలిచాను. వీరు నిజంగా గెలిచారు. చరిత్ర సృష్టించారు’ అని ఇన్‌స్టాలో రాసింది. మరోనటి సాగరిక ఘాటే కూడా ఇలాగే సంతోషం పంచుకుంది. ఇక షారూక్ ఖాన్ ఏకంగా ‘మాజీ కోచ్’నంటూ రంగంలో దిగి సంతోషం పంచుకున్నాడు. ‘సరే సరే.. వస్తూ వస్తూ కొంచెం బంగారం తీసుకురండి. ధన్తేరస్ కూడా ముందుంది. – మాజీ కోచ్ కబీర్‌ఖాన్’ అని ట్వీట్ చేశాడు. దానికి రియల్ కోచ్ మరిజ్నే స్పందిస్తూ ‘మీ సపోర్ట్‌కు కృతజ్ఞతలు. మేము మా సర్వస్వాన్ని ఒడ్డుతాము. ఇట్లు రియల్ కోచ్’ అని సమాధానం ఇచ్చాడు. ఈ దేశం మర్యాదను నిలబెట్టే పని మహిళా ప్లేయర్లే చేస్తున్నారు. అలాగని మగవారి శ్రమ తక్కువది కాదు. స్త్రీ, పురుషులు కలిసి భారత క్రీడా పతాకాన్ని రెపరెపలాడించడమేగా కావలసింది. -
ఏషియన్ గేమ్స్: ఫైనల్లో టీమిండియా
జకర్తా: భారత మహిళల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో అదరగొడుతున్నారు. వరుస విజయాలతో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 1-0తేడాతో చైనాపై గెలిచి స్వర్ణపోరుకు సిద్దమైంది. సెమీఫైనల్లో నమోదైన ఏకైక గోల్ టీమిండియా స్టార్ ప్లేయర్ గుర్జీత్ కౌర్(52వ నిమిషంలో) సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడో సారి కాగా, 1998 తర్వాత ఇదే తొలి సారి కావడం విశేషం. భారత జట్టు ఫైనల్ పోరులో ఈ నెల 31న (శుక్రవారం) జపాన్‌తో తలపడనుంది. నేడు జరిగిన సెమీఫైనల్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇరుజట్ల ఢిపెన్స్ బలంగా ఉండటంతో గోల్ నమోదు కావడానికి చాలా సమయమే పట్టింది. దీంతో మూడు క్వార్టర్స్ ముగిసే సరికి ఒక్క గోల్ నమోదుకాలేదు. మరో ఎనిమిది నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా పెనాల్టీ కార్నర్ రూపంలో భారత జట్టుకు అదృష్టం వరించింది. వచ్చిన అవకాశాన్ని మిస్ చేయకుండా భారత స్టార్ ప్లేయర్ గుర్జీత్ కౌర్ చైనా గోల్కీపర్ను బోల్తా కొట్టించి గోల్ సాధించారు. ఇక ఆట ముగిసే సమయానికి మరో గోల్ నమోదు కాకపోవడంతో టీమిండియా విజయం సాధించింది. -
హాకీలో దుమ్మురేపిన క్రికెటర్
డబ్లిన్ : మహిళల హాకీ ప్రపంచకప్‌లో ఐర్లాండ్ మహిళా క్రికెటర్ ఎలినా టైస్ అదరగొట్టింది. ఫైనల్లో నెదర్లాండ్ చేతిలో ఐర్లాండ్ ఓడినప్పటికీ ఆ మహిళా క్రికెటర్ తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకుంది. ఇటీవల ముగిసిన ఈ టోర్నీలో రజతం సాధించి ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. అయితే ఎలినా టైస్లా రెండు క్రీడల్లో రాణించే మహిళా క్రికెటర్లు ఉన్నప్పటికి ఆమె ప్రత్యేకం. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్, న్యూజిలాండ్ కెప్టెన్ సుజీ బేట్స్(బాస్కెట్ బాల్), ఆల్‌రౌండర్ సోఫీ డివిన్ (హాకీ)లు తమ దేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. లెగ్‌స్పిన్నర్ కమ్ బ్యాట్స్‌మన్ అయిన ఎలినా మాత్రం వీరందరికీ భిన్నంగా 13 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి మూడో పిన్నవయస్కురాలిగా రికార్డు నమోదు చేసింది. అనూహ్యంగా ఎలీనా డచ్‌పై తన అరంగేట్ర మ్యాచ్ ఆడింది. ఇక 18 ఏళ్ల వయసులో ఐర్లాండ్ సీనియర్ హాకీ జట్టులో చోటు సంపాదించిన ఎలినా.. రెండళ్లకే ప్రపంచకప్ టోర్నీలో పాల్గొని రజత పతాక విజేతగా నిలిచింది. హాంప్‌షైర్‌లో జన్మించిన ఎలినా.. తన నాలుగేళ్ల వయసులోనే వారి కుటుంబం అమెరికాలోని ఇండియానాపొలిస్‌కు వలస వచ్చింది. అక్కడ తొలుత బేస్‌బాల్ క్రీడను ఎంచుకుంది. అయితే మరోసారి వారి కుటుంబం అక్కడి నుంచి వియన్నాకు తరలిరావడంతో ఆమె అడుగులు క్రికెట్‌వైపు పడ్డాయి. అనంతరం ఆమె ఆస్ట్రేలియా క్రికెట్ క్లబ్ తరపున ఆడింది. స్కూల్ క్రికెట్ ఆడుతున్న తరుణంలో వారి కుటుంబం తిరిగి ఐర్లాండ్ చేరింది. సరిగ్గా అప్పుడే ఆమె హాకీని కూడా ఆడటం ప్రారంభించింది. సోదరులు.. ఆటగాళ్లే.. ఇక ఆమె చిన్నతనంలో క్రికెట్, హాకీలు కాకుండా ఫుట్‌బాల్, రగ్భీలను ఆడేది. తన కుటుంబంలో చిన్నదైన ఎలినా.. సోదరులు సైతం క్రీడాకారులే కావడం విశేషం. ఒక సోదరుడు వికెట్ కీపర్ కాగా.. మరొకరు రగ్భీ ఆటగాడు. పిన్న వయసులో అదరగొట్టిన ఎలినా టైస్పై ఐర్లాండ్ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రజత పతకంతో తిరిగి వచ్చిన ఐర్లాండ్ జట్టుకు ఘనస్వాగతం పలకగా.. రెండు క్రీడల్లో రాణిస్తున్న ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. చదవండి: భారత మహిళల కల చెదిరె... -
భారత మహిళల కల చెదిరె...
లండన్: ప్రపంచకప్‌లో భారత మహిళల ఆట క్వార్టర్ ఫైనల్‌కే పరిమితమైంది. సెమీస్ ఆశలతో బరిలోకి దిగిన మన జట్టు చివరకు షూటౌట్లో చేతులెత్తేసింది. గురువారం హోరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ పెనాల్టీ షూటౌట్లో 1–3 గోల్స్ తేడాతో ఐర్లాండ్ చేతిలో పరాజయం చవిచూసింది. భారత్ తరఫున ఏకంగా ముగ్గురు క్రీడాకారిణులు వరుసగా విఫలమయ్యారు. లీగ్‌లో ఐర్లాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం... అలాగే ప్రపంచకప్‌లో 44 ఏళ్ల సెమీస్ నిరీక్షణకు తెరదించాలనుకున్న భారత మహిళల జట్టు ఆశలు ఆవిరయ్యాయి. నాలుగు క్వార్టర్లలోనూ ప్రత్యర్థి జట్టుకు దీటుగా బదులిచ్చిన భారత అమ్మాయిలకు ‘పెనాల్టీ షూటౌట్’ శరాఘాతమైంది. షూటౌట్లో ప్రత్యర్థి గోల్‌కీపర్ మెక్ఫెర్రాన్ను బోల్తా కొట్టించడంలో రాణి రాంపాల్, మోనిక, నవజ్యోత్ వరుసగా విఫలమయ్యారు. ఇదే సమయంలో నికొల డెలి, ఫ్లానగన్ అన్నా షాట్లను భారత గోల్ కీపర్ సవిత అడ్డుకుంది. అయితే తర్వాత రొయిసిన్ అప్టన్, అలిసన్ మికీ, క్లోయ్ వాట్కిన్స్ షాట్లు లక్ష్యాన్ని చేరడంతో భారత్ కథ ముగిసింది. భారత్ తరఫున రీనా మాత్రమే ఒక గోల్ చేయగలిగింది. అంతకుముందు ఇరు జట్ల క్రీడాకారిణులు కదంతొక్కడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ప్రతీ క్వార్టర్లోనూ పైచేయి సాధించేందుకు రెండు జట్ల ప్లేయర్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో నాలుగు క్వార్టర్లు ముగిసినా ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. నిర్ణీత సమయానికి 0–0గా మ్యాచ్ ముగిసింది. దీంతో ఫలితం తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. -
భారత్ ఆశలు సజీవం
లండన్: ప్రపంచకప్ మహిళల హాకీ టోర్నీలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా నిలిచాయి. పూల్ ‘బి’లో భాగంగా అమెరికా జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌ను భారత్ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. అమెరికా తరఫున మార్గాక్స్ (11వ ని.లో), భారత్ తరఫున కెప్టెన్ రాణి రాంపాల్ (31వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రస్తుతం పూల్ ‘బి’లో రెండు పాయింట్లతో భారత్, అమెరికా సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. అయితే మెరుగైన గోల్స్ సగటులో భారత్ (–1) ముందంజలో ఉండగా... అమెరికా (–2) నాలుగో స్థానంలో ఉంది. పూల్ ‘బి’లో ఇంగ్లండ్, ఐర్లాండ్ జట్ల మధ్య చివరి లీగ్ మ్యాచ్ ముగిశాకే మంగళవారం జరిగే క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో భారత ప్రత్యర్థి (ఇటలీ లేదా కొరియా) ఎవరో తేలుతుంది. -
ఇది ఆరంభమే...
హరేంద్ర సింగ్... భారత హాకీలో మేటి కోచ్. బాధ్యతలు తీసుకుంటే పట్టుదలతో పని చేస్తారు. ఫలితాల్ని అందిస్తారు. ఆయన కోచింగ్‌లోనే జూనియర్ ప్రపంచకప్‌లో భారత్ చాంపియన్ అయింది. తాజాగా ఆయన పర్యవేక్షణలోనే ఆసియా కప్ మహిళల ఈవెంట్లో ట్రోఫీని గెలుచుకుంది. ప్రపంచకప్ బెర్త్‌ను సాధించింది. న్యూఢిల్లీ: అవకాశమిచ్చినప్పుడల్లా అద్భుతాలు చేయడం హరేంద్ర సింగ్‌కు అలవాటే. కోచింగ్‌లో విశేష అనుభవజ్ఞుడైన హరేంద్ర ఇప్పుడు కూడా సరిగ్గా అదే పని చేశారు. 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల జట్టుకు ఆసియా కప్‌ను అందించారు. కుర్రాళ్లకు జూనియర్ ప్రపంచకప్, అమ్మాయిలకు ఆసియా ట్రోఫీని అందించిన హరేంద్రకు విజయాల దాహం ఇంకా తీరనట్లుంది. ‘ఆసియా’ కేవలం పునాదేనని మరిన్ని విజయాలు ముందున్నాయని తన లక్ష్యాల్ని చెప్పకనే చెబుతున్నారు. మెగా ఈవెంట్లపై దృష్టి... భారత హాకీకి వచ్చే ఏడాది చాలా కీలకం. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్, ప్రపంచకప్‌లాంటి మెగా ఈవెంట్లున్నాయి. ఈ మూడింటిలో కనీసం రెండు పతకాలైనా సాధించాలనేదే నా లక్ష్యం. క్రీడల్లో అసాధ్యమనేదే లేదు. సుదీర్ఘ కాలం పురుషుల జట్టుకు సేవలందించిన నాకు మహిళల టీమ్‌ను మేటి జట్టుగా మలచడం కూడా తెలుసు. మహిళల జట్టులో ప్రతిభకు కొదవలేదు. ఏదైనా సాధించగలరనేది ఇప్పుడు చేతల్లో చూపారు. వేటికవే భిన్నం... ఓ కోచ్‌గా నాకు ప్రతీ టోర్నీ ముఖ్యమైనదే. కుర్రాళ్ల జూనియర్ ప్రపంచకప్ టైటిల్, అమ్మాయిల ఆసియా కప్ విజయం... ఈ రెండు భిన్నమై నవి. వీటిని పోల్చడం తగదు. ప్రపంచకప్ కోసం కుర్రాళ్లతో మూడేళ్లు పనిచేశాను. అదే ‘ఆసియా’ కోసం 23, 24 రోజులు శ్రమించా. ఈ రెండు సంతృప్తినిచ్చినప్పటికీ... ఈ విజయాలతో ఆగిపోను. మెరిట్‌తోనే బెర్త్... దయతో కాదు... మన అమ్మాయిలు ఫైనల్లో చైనాను ఓడించి టైటిల్‌ను గెలిచారు. మెరిట్‌తోనే ప్రపంచకప్ బెర్త్‌ను సాధించారు. ఇంకొకరి దయతోనూ, మరో జట్టు వైఫల్యంతోనూ అర్హత పొందలేదు. స్వతహాగా సాధించిన బెర్త్ ఇది. ఈ ఉత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని టైటిళ్లు గెలిచే ఆత్మవిశ్వాసం లభించినట్లయింది. ఏ పతకమైనా ఓకే... వచ్చే ఏడాది మూడు మేటి ఈవెంట్లలో (కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, వరల్డ్ కప్) మనం పతకం సాధించే అవకాశాల్ని కొట్టిపారేయలేం. ఏ పతకమొచ్చినా సంతోషమే. రంగు (పసిడి, రజతం, కాంస్యం) ఏదనేది బరిలోకి దిగాక అమ్మాయిలే నిర్ణయిస్తారు. ఏదైనా సాధించగలమని నిరూపిస్తారు. రూ లక్ష చొప్పున హెచ్ఐ నజరానా హాకీ ఇండియా (హెచ్ఐ) ఆసియా కప్ విజేతలకు నజరానా ప్రకటించింది. 18 మంది సభ్యులుగల మహిళల జట్టులో ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున, కోచ్ హరేంద్రకు రూ. లక్ష, ఇతర సహాయక సిబ్బందికి రూ. 50 వేల చొప్పున ఇవ్వనుంది. మొదటిసారి టాప్–10లోకి... భారత మహిళల జట్టు ర్యాంక్‌లోనూ రెండు స్థానాలు పురోగతి సాధించింది. ప్రపంచ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టీమిండియా తొలిసారి టాప్–10లోకి దూసుకొచ్చింది. పురుషుల జట్టు నిలకడగా ఆరో స్థానంలోనే ఉంది. -
క్వార్టర్స్‌లో భారత్
కకమిగహర (జపాన్): ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసిన భారత హాకీ జట్టు 9 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–0తో మలేసియాపై విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు జాగ్రత్తగా ఆడటంతో తొలి మూడు క్వార్టర్స్‌లోనూ ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. నాలుగో క్వార్టర్లో అప్రమత్తమైన భారత్ 54వ నిమిషంలో వందన కటారియా ఫీల్డ్ గోల్‌తో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వెంటనే నిమిషం వ్యవధిలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గుర్జీత్ కౌర్ గోల్‌గా మలచడంతో భారత్ 2–0తో పటిష్ట స్థితిలో నిలిచింది. చివరి నిమిషాల్లో మలేసియా పోరాడినప్పటికీ భారత్ వారిని సమర్థంగా నిలువరించింది. -
భారత మహిళల గోల్స్ వర్షం
గువాహటి: దక్షిణాసియా క్రీడల్లో భారత మహిళా హాకీ జట్టు బ్రహ్మాండమైన విజయంతో టోర్నీని ఆరంభించింది. ఆదివారం నేపాల్ తో జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో భారత్ గోల్స్ వర్షం కురిపించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 గోల్స్ సాధించి నేపాల్ కు చుక్కలు చూపించింది. అదే క్రమంలో నేపాల్‌కు ఒక్క గోల్ కూడా సమర్పించుకోని భారత్ పరిపూర్ణ విజయాన్ని నమోదు చేసింది. భారత అటాకింగ్ కు ఏ దశలోనూ పోటీనివ్వని నేపాల్ పూర్తిగా తేలిపోయి ఘోర ఓటమిని చవిచూసింది. భారత మహిళల్లో సౌందర్య యెండాల(15వ 52వ, 62వ, 64వ నిమిషాల్లో), పూనమ్ బర్లా(7వ, 42వ, 43వ, 51వ నిమిషాల్లో) నాలుగేసి గోల్స్ తో రాణించగా, రాణి(2వ, 46వ, 48వ నిమిషాల్లో), జస్పరిత్ కౌర్ (4వ, 35వ, 56వ నిమిషాల్లో) , నేహా గోయల్(14వ,22వ, 70వ నిమిషాల్లో), దీపిక(53వ, 62వ, 67వ నిమిషాల్లో) మూడేసి గోల్స్ చొప్పున నమోదు చేశారు. మరోవైపు గుర్జిత్ కౌర్(21వ 41వ నిమిషాల్లో), ప్రీతి దుబే(23వ, 29వ నిమిషాల్లో)లు చెరో రెండు గోల్స్ సాధించి విజయంలో భారీ విజయంలో పాలు పంచుకున్నారు. భారత హాకీ జట్టు తమ తదుపరి మ్యాచ్ ను సోమవారం శ్రీలంకతో ఆడనుంది. -
మనమ్మాయిలు సాధిస్తారా..!
భారత మహిళా హాకీ జట్టు రియో ఒలింపిక్స్ బెర్త్ సొంతం చేసుకుంది. అదే ఉత్సాహంలో మన అమ్మాయిలు పోడియం ఫినిష్ చేస్తామంటూ మాట కూడా ఇచ్చేశారు. గత ఒలింపిక్స్ రికార్డులు చూస్తే భారత జట్టుకు పతకం గెలిచే సత్తా ఉందా? అనే సందేహం కలగవచ్చు. అయితే జట్టు మాత్రం పతకం సాధించాలనే పట్టుదలతో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. 36ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత మహిళల జట్టు ఒలింపిక్స్ కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. గత రికార్డులను పరిశీలిస్తే భారత మహిళల జట్టు ఒలింపిక్స్‌లో ఒకే ఒక్కసారి పాల్గొంది. 1980 మాస్కో ఒలింపిక్స్ లో ఆడిన మన జట్టు నాలుగో స్ధానంతో ముగించింది. అమెరికా సహా 65 దేశాలు బాయ్ కాట్ చేసిన ఈ మెగా ఈవెంట్లో భారత్.. ఆస్ట్రియా, పోలాండ్ జట్లను ఓడించి.. చెకోస్లోవేకియా చేతిలో ఒక్క గోల్ తేడాతో పరాజయం పాలైంది. క్వార్టర్స్ మ్యాచ్‌లో జింబాబ్వేతో డ్రా చేసుకుంది. మూడో స్ధానం కోసం జరిగిన మ్యాచ్ లో అప్పటి సోవియట్ యూనియన్ (రష్యా) చేతిలో 1-3 తేడాతో పరాజయం పాలైంది. ఆరు జట్లు మాత్రమే పాల్గొన్న ఆ టోర్నీలో నాలుగో స్ధానంతో సరిపెట్టుకుంది. కానీ నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, జర్మనీ, కొరియా వంటి అగ్రశ్రేణి జట్లు గైర్హాజరైన ఈ మెగా ఈవెంట్లో భారత్ ప్రదర్శన గొప్పగా చెప్పుకోదగిందేమీ కాదు. ఇక ఇటీవల మన జట్టు ప్రదర్శన చూస్తే.. ప్రపంచ హాకీ సెమీస్ లీగ్ లో మంచి పోరాటమే కనబరిచింది. టాప్ టీమ్ లతో మ్యాచ్ ల్లో ఓడినా.. కీలక మ్యాచ్ ల్లో మనమ్మాయిలు సత్తా చాటారు. జపాన్ తో మ్యాచ్ టోర్నీకే హైలైట్. ఇక ఇతర టోర్నీల విషయానికి వస్తే.. 2013 జూనియర్ ఉమెన్స్ వరల్డ్ కప్ లో కాంస్య పతకం సాధించారు. ఇక గతేడాది జరిగిన ఆసియన్ గేమ్స్ లో సీనియర్ మహిళలు కూడా కాంస్యంతో సత్తా చాటారు. ఇక కెప్టెన్ రీతూరాణి సారధ్యంలో మన టీమ్ సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారు. వందనా కటారియా, పూనమ్ రాణి వంటి సీనియర్స్ తో ఫార్వర్డ్ లైన్ బలోపేతంగా ఉంది. మిడ్ ఫీల్డ్ లో రీతు రాణి, సుశీల చాను, నవనీత్ కౌర్, లిలిమా, లిల్లీ చానులు మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక ఒడిశా త్రయం గ్రేస్ ఎక్తా, నమిత, సునితాలక్రాల డిఫెన్స్ బలంగా ఉంది. గోల్ కీపర్ లు రజని, సవిత సత్తా చాటేందుకు సిద్దంగా ఉన్నారు. మాజీ క్రీడాకారుణులు సైతం మనమ్మాయిలపై నమ్మకంగా ఉన్నారు. ఒలింపిక్స్ మెడల్ కొట్టేందుకు ఇదే సరైన సమయమని మాజీ కెప్టెన్ సురీందర్ కౌర్ అభిప్రాయపడ్డారు. కఠోర సాధన తోనే మన చిరకాల స్వప్నం సాకారమౌతుందని చెప్పుకొచ్చింది.