
కకమిగహర (జపాన్): ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసిన భారత హాకీ జట్టు 9 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–0తో మలేసియాపై విజయం సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు జాగ్రత్తగా ఆడటంతో తొలి మూడు క్వార్టర్స్‌లోనూ ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.
నాలుగో క్వార్టర్‌లో అప్రమత్తమైన భారత్ 54వ నిమిషంలో వందన కటారియా ఫీల్డ్ గోల్‌తో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వెంటనే నిమిషం వ్యవధిలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గుర్జీత్ కౌర్ గోల్‌గా మలచడంతో భారత్ 2–0తో పటిష్ట స్థితిలో నిలిచింది. చివరి నిమిషాల్లో మలేసియా పోరాడినప్పటికీ భారత్ వారిని సమర్థంగా నిలువరించింది.