చైనా గడ్డపై భారత క్రీడాకారుల పతకాల వేట అప్రతిహతంగా కొనసాగుతోంది. పోటీల ఆరో రోజు భారత్ ఏకంగా ఎనిమిది పతకాలతో అదరగొట్టింది. ఇందులో రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి. పురుషుల డబుల్స్ టెన్నిస్‌లో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ జోడీ రజతం నెగ్గింది. మహిళల స్క్వాష్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు సెమీస్‌లో ఓడి కాంస్యం సాధించింది.
అథ్లెటిక్స్ మహిళల షాట్‌పుట్ ఈవెంట్‌లో కిరణ్ బలియాన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది. 1986 సియోల్ ఆసియా క్రీడల్లో ఐదో స్థానంలో నిలిచిన భారత్ ఆ తర్వాత మళ్లీ టాప్–5లోకి రావడం ఇదే తొలిసారి. తదుపరి అథ్లెటిక్స్, ఆర్చరీ, రెజ్లింగ్, హాకీ, బ్యాడ్మింటన్, వెయిట్‌లిఫ్టింగ్‌లోనూ మరిన్ని పతకాలు వచ్చే అవకాశముండటంతో భారత్ ఈసారి నాలుగో స్థానంతో ఆసియా క్రీడలను దిగి్వజయంగా ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
72 ఏళ్ల తర్వాత..
► మహిళల షాట్‌పుట్‌లో భారత్‌కు తొలి పతకం!
► కిరణ్ బలియాన్ ఘనత..
సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆసియా క్రీడల అథ్లెటిక్స్ మహిళల షాట్‌పుట్ ఈవెంట్‌లో భారత్‌కు 72 ఏళ్ల తర్వాత మళ్లీ పతకం లభించింది. శుక్రవారం జరిగిన షాట్‌పుట్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన 24 ఏళ్ల కిరణ్ బలియాన్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. కిరణ్ ఇనుప గుండును 17.36 మీటర్ల దూరం విసిరింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ప్రాంతానికి చెందిన ట్రాఫిక్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కూతురైన కిరణ్ తొమ్మిదేళ్ల క్రితం ఈ ఆటలో ప్రవేశించింది.
1951లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన తొలి ఆసియా క్రీడల్లో మహిళల షాట్‌పుట్ క్రీడాంశంలో ఆంగ్లో ఇండియన్ బార్బరా వెబ్‌స్టర్ కాంస్య పతకం గెల్చుకుంది. ఆ తర్వాత ఈ క్రీడాంశంలో కిరణ్ బలియాన్ రూపంలో భారత్‌కు రెండో పతకం లభించడం విశేషం. లిజియావో గాంగ్ (చైనా; 19.58 మీటర్లు) స్వర్ణం... జియాయువాన్ సాంగ్ (చైనా; 18.92 మీటర్లు) రజతం సాధించారు.
భారత్‌కే చెందిన మరో షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్ (16.25 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచింది. మహిళల హ్యామర్ త్రో ఈవెంట్‌లో భారత క్రీడాకారిణులు తాన్యా చౌధరీ (60.50 మీటర్లు) ఏడో స్థానంలో, రచనా కుమారి (58.13 మీటర్లు) తొమ్మిదో స్థానంలో నిలిచి నిరాశపరిచారు. మహిళల 20 కిలోమీటర్ల నడక రేసులో ప్రియాంక గోస్వామి (1గం:43ని:7 సెకన్లు)... పురుషుల 20 కిలోమీటర్ల నడక రేసులో వికాశ్ సింగ్ (1గం:27ని:33 సెకన్లు) ఐదో స్థానంలో నిలిచారు.
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో మరోసారి భారత తుపాకీ గురి అదిరింది. శుక్రవారం భారత షూటర్లు రెండు స్వర్ణాలు, మూడు రజత పతకాలతో మెరిపించారు. ముందుగా పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, స్వప్నిల్ కుసాలె, అఖిల్ షెరాన్‌లతో కూడిన భారత జట్టు 1769 పాయింట్లు స్కోరు కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతేకాకుండా స్వర్ణ పతకాన్ని కూడా సొంతం చేసుకుంది. 2022లో 1761 పాయింట్లతో అమెరికా నెలకొలి్పన ప్రపంచ రికార్డును భారత జట్టు బద్దలు కొట్టింది.
క్వాలిఫయింగ్‌లో స్వప్నిల్ (10 పాయింట్ల షాట్‌లు 33), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ (10 పాయింట్ల షాట్‌లు 27) 591 పాయింట్ల చొప్పున స్కోరు చేసి వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి వ్యక్తిగత విభాగం ఫైనల్‌కు అర్హత పొందారు. అఖిల్ షెరాన్ 587 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచాడు. అయితే ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరు షూటర్లు మాత్రమే ఫైనల్లో ఆడాలి. దాంతో అఖిల్ ఫైనల్‌కు దూరమయ్యాడు. టాప్–8లో నిలిచిన షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ 459.7 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెల్చుకున్నాడు. స్వప్నిల్ 438.9 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
పలక్ ‘పసిడి’..
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్, వ్యక్తిగత ఈవెంట్లలో భారత షూటర్లు అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నారు. పలక్, ఇషా సింగ్, దివ్యలతో కూడిన భారత జట్టు 1731 పాయింట్లు స్కోరు చేసి రజత పతకం దక్కించుకుంది. క్వాలిఫయింగ్‌లో తెలంగాణ షూటర్ ఇషా సింగ్ 579 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో, పలక్ 577 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో పలక్ 242.1 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకం సొంతం చేసుకోగా... ఇషా సింగ్ 239.7 పాయింట్లతో రజత పతకాన్ని గెల్చుకుంది. పాకిస్తాన్ షూటర్ తలత్ కిష్మలా 218.2 పాయింట్లతో కాంస్య పతకం సాధించింది. ఈ ఆసియా క్రీడల్లో ఇషా సింగ్ ఓవరాల్‌గా నాలుగు పతకాలు సాధించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment