ఆసియా క్రీడల స్క్వాష్ క్రీడాంశంలో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. జోష్నా చినప్ప, తన్వీ ఖన్నా, అనాహత్ సింగ్, దీపిక పల్లికల్‌లతో కూడిన భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 1–2తో డిఫెండింగ్ చాంపియన్ హాంకాంగ్ జట్టు చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తొలి మ్యాచ్‌లో తన్వీ ఖన్నా 6–11, 7–11, 3–11తో చాన్ సిన్ యుక్ చేతిలో ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో జోష్నా చినప్ప 7–11, 11–7, 9–11, 11–6, 11–8తో హో జె లోక్‌పై గెలిచి స్కోరును 1–1తో సమం చేసింది.
నిర్ణాయక మూడో మ్యాచ్‌లో అనాహత్ సింగ్ 8–11, 7–11, 10–12తో లీ కా యి చేతిలో ఓడిపోయింది. 2010 ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన భారత జట్టు 2014, 2018 క్రీడల్లో రజతం సాధించింది. మరోవైపు భారత పురుషుల జట్టు 2–0తో డిఫెండిగ్ చాంపియన్ మలేసియాను ఓడించి పసిడి పతక పోరుకు అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లో అభయ్ సింగ్ 11–3, 12–10, 9–11, 11–6తో అదీన్ ఇద్రాకీపై... రెండో మ్యాచ్‌లో సౌరవ్ ఘోషాల్ 11–8, 11–6, 10–12, 11–3తో ఎన్జీ ఎయిన్‌పై గెలిచారు. నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment