
జకర్తా: భారత మహిళల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో అదరగొడుతున్నారు. వరుస విజయాలతో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 1-0తేడాతో చైనాపై గెలిచి స్వర్ణపోరుకు సిద్దమైంది. సెమీఫైనల్‌లో నమోదైన ఏకైక గోల్ టీమిండియా స్టార్ ప్లేయర్ గుర్జీత్ కౌర్(52వ నిమిషంలో) సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడో సారి కాగా, 1998 తర్వాత ఇదే తొలి సారి కావడం విశేషం. భారత జట్టు ఫైనల్ పోరులో ఈ నెల 31న (శుక్రవారం) జపాన్‌తో తలపడనుంది.
నేడు జరిగిన సెమీఫైనల్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇరుజట్ల ఢిపెన్స్ బలంగా ఉండటంతో గోల్ నమోదు కావడానికి చాలా సమయమే పట్టింది. దీంతో మూడు క్వార్టర్స్ ముగిసే సరికి ఒక్క గోల్ నమోదుకాలేదు. మరో ఎనిమిది నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా పెనాల్టీ కార్నర్ రూపంలో భారత జట్టుకు అదృష్టం వరించింది. వచ్చిన అవకాశాన్ని మిస్ చేయకుండా భారత స్టార్ ప్లేయర్ గుర్జీత్ కౌర్ చైనా గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించి గోల్ సాధించారు. ఇక ఆట ముగిసే సమయానికి మరో గోల్ నమోదు కాకపోవడంతో టీమిండియా విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment