అండర్-19 ఆసియా కప్‌లో టీమిండియా భారీ విజయం సాధించింది. పసికూన జపాన్‌తో ఇవాళ (డిసెంబర్ 2) జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో భారత్ 211 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.
కెప్టెన్ మొహమ్మద్ అమాన్ అజేయ సెంచరీతో (122) కదంతొక్కగా.. ఓపెనర్ ఆయుశ్ మాత్రే మెరుపు అర్ద సెంచరీతో (29 బంతుల్లో 54; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగాడు. మిడిలార్డర్ బ్యాటర్ కేపీ కార్తికేయ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, సిక్స్) రాణించగా.. స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 23, ఆండ్రీ సిద్దార్థ్ 35, నిఖిల్ కుమార్ 12, హర్వంశ్ సింగ్ 1, హార్దిక్ రాజ్ 25 (నాటౌట్) పరుగులు చేశారు.
జపాన్ బౌలర్లలో కీఫర్ యమమోటో లేక్, హ్యూగో కెల్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్లెస్ హింజే, ఆరవ్ తివారి చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జపాన్.. భారత బౌలర్లు యుధాజిత్ గుహ (7-3-9-1), హార్దిక్ రాజ్ (8-2-9-2), చేతన్ శర్మ (8-0-14-2), కేపీ కార్తికేయ (10-1-21-1) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది.
జపాన్ ఇన్నింగ్స్‌లో హ్యూగో కెల్లీ (50), చార్లెస్ హింజే (35 నాటౌట్), నిహార్ పర్మార్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, ఈ మ్యాచ్‌లో ముందు పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment