అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భాగంగా జపాన్‌తో ఇవాళ (డిసెంబర్ 2) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి జపాన్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. కెప్టెన్ మొహమ్మద్ అమాన్ అజేయ సెంచరీతో (118 బంతుల్లో 122; 7 ఫోర్లు) కదం తొక్కాడు. కేపీ కార్తికేయ (57), ఆయుశ్ మాత్రే (54) అర్ద సెంచరీలతో రాణించారు.
చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ 23 పరుగులకే పరిమితమయ్యాడు. భారత ఇన్నింగ్స్‌లో ఆండ్రీ సిద్దార్థ్ 35, నిఖిల్ కుమార్ 12, హర్‌వన్ష్ సింగ్ 1, హార్దిక్ రాజ్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. జపాన్ బౌలర్లలో కీఫర్ యమమోటో లేక్, హ్యూగో కెల్లీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జార్లెస్ హింజే, ఆరవ్ తివారి చెరో వికెట్ దక్కించుకున్నారు.
కాగా, ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓడింది. గత శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన భారత్ 47.1 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. ఈ టోర్నీలో భారత్, పాక్, జపాన్, యూఏఈ జట్లు గ్రూప్-ఏలో తలపడుతున్నాయి.
ఇవాళే జరుగుతున్న మరో గ్రూప్-ఏ మ్యాచ్‌లో పాకిస్తాన్, యూఏఈ జట్లు ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. షాజైబ్ ఖాన్ (132), మొహమ్మద్ రియాజుల్లా (106) సెంచరీల మోత మోగించారు.
Comments
Please login to add a commentAdd a comment