
జకార్త : సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆసియా క్రీడల ఫైనల్ చేరిన భారత మహిళల హాకీ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం జపాన్‌తో జరిగిన ఫైనల్లో రాణి రాంపాల్ బృందం 1-2 తేడాతో ఓటమి పాలైంది. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకున్నభారత మహిళలు ఈసారి రజతంతో సరిపెట్టారు. తొలి అర్థభాగం వరకు ఇరు జట్ల స్కోర్ సమంగా ఉండగా రెండో అర్ధభాగంలో జపాన్ ఆధిక్యం సాధించి పసిడి సొంతం చేసుకుంది. జపాన్ మహిళలకు ఏషియాడ్‌లో ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం.
భారత్ తరపున నేహాగోయల్ గోల్ చేయగా.. జపాన్ తరపున మినామి, మొటామి గోల్స్ సాధించారు. స్వర్ణం నెగ్గి తద్వారా 2020 టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాలనుకున్న భారత మహిళల ఆశలు గల్లంతయ్యాయి. భారత్ 36 ఏళ్ల క్రితం 1982 న్యూఢిల్లీ క్రీడల్లో స్వర్ణం నెగ్గింది. చివరగా 1998 బ్యాంకాక్ క్రీడల్లో ఫైనల్ చేరినా... అక్కడ కొరియా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల జట్టు సెమీస్‌లో మలేషియాతో ఓడిన విషయం తెలిసిందే. కాంస్యం కోసం దాయదీ పాకిస్తాన్‌తో తలపడనుంది. శుక్రవారం భారత్‌కు మొత్తం ఒక రజతం నాలుగు కాంస్యాలతో ఐదు పతకాలు లభించాయి. దీంతో భారత్ పతకాల సంఖ్య 64 (13 స్వర్ణం, 22 రజతం, 29 కాంస్యం)కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment