చెన్నై: స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు తుది పోరుకు అర్హత సాధించింది. ఇప్పటికే మూడుసార్లు విజేతగా నిలిచిన భారత్ శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో 5–0 గోల్స్ తేడాతో జపాన్‌పై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో మలేసియా తో భారత్ ఆడుతుంది.
తొలి సెమీఫైనల్లో మలేసియా 6–2తో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి ఈ టోర్నీలో మొదటిసారి ఫైనల్ చేరింది. 2018 ఆసియా క్రీడల సెమీఫైనల్లో చివరిసారి మలేసియా చేతిలో ఓడిన భారత్ ఆ తర్వాత ఈ జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడలేదు. 5–6 స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 6–1తో చైనాపై గెలిచి ఐదో స్థానాన్ని దక్కించుకోగా... చైనా చివరిదైన ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.
జపాన్‌పై గెలుపుతో హర్మన్‌ప్రీత్ సేన నాలుగో టైటిల్‌పై కన్నేసింది. ఈ టోర్నీలో లీగ్ దశలో 1–1తో తమని నిలువరించిన జపాన్‌పై టీమిండియా ఎదురు లేని విజయం సాధించింది. బంగ్లాదేశ్‌లో జరిగిన గత టోర్నీ (2021)లో సెమీస్‌లో ఎదురైన పరాజయానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. భారత శిబిరం అటాకింగ్‌కు జపాన్ వద్ద బదులే లేకపోయింది.
తొలి క్వార్టర్ 0–0తో ముగిసింది. ఆ తర్వాత మూడు క్వార్టర్లు భారత ఆటగాళ్లదే జోరు. ఆకాశ్‌దీప్ సింగ్ (19వ ని.లో), కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (23వ ని.లో), మన్‌దీప్ సింగ్ (30వ ని.లో), సుమిత్ (39వ ని.లో), కార్తీ సెల్వం (51వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. ఈ మ్యాచ్‌తో భారత జట్టు గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ 300 అంతర్జాతీయ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment