భారత్‌ శుభారంభం | India beat Malaysia 4-0 in women Asian Championship | Sakshi
Sakshi News home page

భారత్‌ శుభారంభం

Published Tue, Nov 12 2024 5:53 AM | Last Updated on Tue, Nov 12 2024 5:55 AM

India beat Malaysia 4-0 in women Asian Championship

మలేసియాపై 4–0తో విజయం

రెండు గోల్స్‌ చేసిన సంగీత

నేడు కొరియాతో టీమిండియా పోరు   

రాజ్‌గిర్‌ (బిహార్‌): ఆసియా మహిళల చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌లో సలీమా టెటె నాయకత్వంలోని భారత జట్టు 4–0 గోల్స్‌ తేడాతో మలేసియా జట్టుపై గెలిచింది. భారత్‌ తరఫున సంగీత కుమారి (8వ, 55వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... ప్రీతి దూబే (43వ నిమిషంలో), ఉదిత (44వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు. ఇతర తొలి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో పారిస్‌ ఒలింపిక్స్‌ రజత పతక విజేత చైనా 15–0తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేయగా... జపాన్, కొరియా మధ్య మ్యాచ్‌ 2–2తో ‘డ్రా’గా ముగిసింది.

 మలేసియా చేతిలో ఓటమి ఎరుగని భారత జట్టు ఈసారీ పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఎనిమిదో నిమిషంలో లభించిన రెండో పెనాల్టీ కార్నర్‌ను సంగీత లక్ష్యానికి చేర్చడంతో భారత్‌ ఖాతా తెరిచింది. ఆ తర్వాత భారత్‌ జోరు కొనసాగించినా ఫినిషింగ్‌ వేధించింది. ఫలితంగా 42వ నిమిషం వరకు భారత్‌ ఖాతాలో మరో గోల్‌ చేరలేదు. అయితే రెండు నిమిషాల వ్యవధిలో లభించిన రెండు పెనాల్టీ కార్నర్‌లను ప్రీతి దూబే, ఉదిత సది్వనియోగం చేసుకోవడంతో భారత్‌ ఒక్కసారిగా 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్‌ మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా సంగీత ఫీల్డ్‌ గోల్‌తో భారత ఆధిక్యం 4–0కు పెరిగింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో భారత్‌కు 11 పెనాల్టీ కార్నర్‌లు, మలేసియాకు ఒక పెనాల్టీ కార్నర్‌ లభించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement