థాయ్‌లాండ్‌పై 13–0 గోల్స్ తేడాతో నెగ్గిన టీమిండియా
మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్
రాజ్‌గిర్ (బిహార్): ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ భారత మహిళల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడో విజయం నమోదు చేసింది. థాయ్‌లాండ్ జట్టుతో గురువారం జరిగిన మూడో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 13–0 గోల్స్ తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. భారత్ తరఫున దీపిక అత్యధికంగా ఐదు గోల్స్ (3వ, 19వ, 43వ, 45వ, 45వ నిమిషంలో) చేయగా ... ప్రీతి దూబే (9వ, 40వ నిమిషంలో), లాల్‌రెమ్‌సియామి (12వ, 56వ నిమిషంలో), మనీషా చౌహాన్ (55వ, 58వ నిమిషంలో) రెండు గోల్స్ చొప్పున సాధించారు.
బ్యూటీ డుంగ్‌డుంగ్ (30వ నిమిషంలో), నవ్‌నీత్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. ఈ గెలుపుతో భారత జట్టు అధికారికంగా సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. ఆరు జట్లు మూడేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా, భారత్ 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి.
అయితే గోల్స్ అంతరం కారణంగా చైనా (చేసిన గోల్స్ 22; ఇచ్చిన గోల్స్ 1) టాప్ ర్యాంక్‌లో, భారత్ (చేసిన గోల్స్ 20; ఇచ్చిన గోల్స్ 2) రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. 3 పాయింట్లతో మలేసియా మూడో స్థానంలో, 2 పాయింట్లతో జపాన్ నాలుగో స్థానంలో, 1 పాయింట్‌తో కొరియా ఐదో స్థానంలో, 1 పాయింట్‌తో థాయ్‌లాండ్ ఆరో స్థానంలో ఉన్నాయి.
నిర్ణీత ఐదు మ్యాచ్‌లు పూర్తయ్యాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్తాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా చైనా, భారత జట్ల తొమ్మిది పాయింట్లను మిగతా జట్లు దాటే పరిస్థితి లేదు. దాంతో ఈ రెండు జట్లకు సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి.
మూడో నిమిషంలో మొదలై...
గత పదేళ్లలో ఏడోసారి థాయ్‌లాండ్‌తో తలపడిన భారత జట్టుకు ఈసారీ ఎలాంటి పోటీ ఎదురు కాలేదు. గతంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో థాయ్‌లాండ్‌కు ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకొని 39 గోల్స్ సాధించిన భారత జట్టు ఏడోసారీ అదే దూకుడును కొనసాగించింది.
మూడో నిమిషంలో దీపిక చేసిన గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. అటునుంచి టీమిండియా వెనుదిరిగి చూడలేదు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు 11 పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. ఇందులో ఐదింటిని మాత్రమే భారత్ గోల్స్‌గా మలిచింది. లేదంటే విజయాధిక్యం మరింతగా ఉండేది.
గురువారమే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో చైనా 2–1 గోల్స్‌తో జపాన్‌పై, మలేసియా 2–1 గోల్స్‌తో కొరియాపై గెలిచాయి. శనివారం జరిగే నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో మలేసియాతో జపాన్; కొరియాతో థాయ్‌లాండ్; చైనాతో భారత్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment