రాంచీ: మహిళల హాకీ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ సెమీఫైనల్లో భారత జట్టుకు ఓటమి ఎదురైంది. జర్మనీతో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా ‘షూటౌట్’లో 3–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఈ గెలుపుతో జర్మనీ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. తొలి సెమీఫైనల్లో అమెరికా 2–1తో జపాన్‌ను ఓడించి పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మూడో బెర్త్ కోసం నేడు భారత్, జపాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది.
జర్మనీతో జరిగిన సెమీఫైనల్లో నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున దీపిక (15వ ని.లో), ఇషిక (59వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. జర్మనీ జట్టుకు చార్లోటి (27వ, 57వ ని.లో) రెండు గోల్స్ అందించింది. ‘షూటౌట్’లో తొలి ఐదు షాట్‌లు ముగిశాక రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. ఫలితం తేలడానికి ‘సడెన్‌డెత్’ను నిర్వహించగా... తొలి ప్రయత్నంలో రెండు జట్లు విఫలమయ్యాయి. రెండో ప్రయత్నంలో భారత ప్లేయర్ సంగీత గురి తప్పగా... జర్మనీ ప్లేయర్ లీసా నోల్టి గోల్ చేసి జర్మనీ విజయాన్ని ఖరారు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment