మనమ్మాయిలు సాధిస్తారా..! | Olympic Qualification - A big lift for Indian women's hockey | Sakshi
Sakshi News home page

మనమ్మాయిలు సాధిస్తారా..!

Published Tue, Sep 1 2015 5:35 PM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM

Olympic Qualification - A big lift for Indian women's hockey

భారత మహిళా హాకీ జట్టు రియో ఒలింపిక్స్ బెర్త్ సొంతం చేసుకుంది. అదే ఉత్సాహంలో మన అమ్మాయిలు పోడియం ఫినిష్ చేస్తామంటూ మాట కూడా ఇచ్చేశారు. గత ఒలింపిక్స్ రికార్డులు చూస్తే భారత జట్టుకు పతకం గెలిచే సత్తా ఉందా? అనే సందేహం కలగవచ్చు. అయితే జట్టు మాత్రం పతకం సాధించాలనే పట్టుదలతో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. 36ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత మహిళల జట్టు ఒలింపిక్స్ కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

గత రికార్డులను పరిశీలిస్తే భారత మహిళల జట్టు ఒలింపిక్స్లో ఒకే ఒక్కసారి పాల్గొంది. 1980 మాస్కో ఒలింపిక్స్ లో ఆడిన మన జట్టు నాలుగో స్ధానంతో ముగించింది. అమెరికా సహా 65 దేశాలు బాయ్ కాట్ చేసిన ఈ మెగా ఈవెంట్లో భారత్.. ఆస్ట్రియా, పోలాండ్ జట్లను ఓడించి.. చెకోస్లోవేకియా చేతిలో ఒక్క గోల్ తేడాతో పరాజయం పాలైంది. క్వార్టర్స్ మ్యాచ్లో జింబాబ్వేతో డ్రా చేసుకుంది. మూడో స్ధానం కోసం జరిగిన మ్యాచ్ లో అప్పటి సోవియట్ యూనియన్ (రష్యా) చేతిలో 1-3 తేడాతో పరాజయం పాలైంది. ఆరు జట్లు మాత్రమే పాల్గొన్న ఆ టోర్నీలో నాలుగో స్ధానంతో సరిపెట్టుకుంది. కానీ నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, జర్మనీ, కొరియా వంటి అగ్రశ్రేణి జట్లు గైర్హాజరైన ఈ మెగా ఈవెంట్లో భారత్ ప్రదర్శన గొప్పగా చెప్పుకోదగిందేమీ కాదు.

ఇక ఇటీవల మన జట్టు ప్రదర్శన చూస్తే.. ప్రపంచ హాకీ సెమీస్ లీగ్ లో మంచి పోరాటమే కనబరిచింది. టాప్ టీమ్ లతో మ్యాచ్ ల్లో ఓడినా.. కీలక మ్యాచ్ ల్లో మనమ్మాయిలు సత్తా చాటారు. జపాన్ తో మ్యాచ్ టోర్నీకే హైలైట్. ఇక ఇతర టోర్నీల విషయానికి వస్తే.. 2013 జూనియర్ ఉమెన్స్ వరల్డ్ కప్ లో కాంస్య పతకం సాధించారు. ఇక గతేడాది జరిగిన ఆసియన్ గేమ్స్ లో సీనియర్ మహిళలు కూడా కాంస్యంతో సత్తా చాటారు. ఇక కెప్టెన్ రీతూరాణి సారధ్యంలో మన టీమ్ సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారు. వందనా కటారియా, పూనమ్ రాణి వంటి సీనియర్స్ తో ఫార్వర్డ్ లైన్ బలోపేతంగా ఉంది. మిడ్ ఫీల్డ్ లో రీతు రాణి, సుశీల చాను, నవనీత్ కౌర్, లిలిమా, లిల్లీ చానులు మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక ఒడిశా త్రయం గ్రేస్ ఎక్తా, నమిత, సునితాలక్రాల డిఫెన్స్ బలంగా ఉంది. గోల్ కీపర్ లు రజని, సవిత సత్తా చాటేందుకు సిద్దంగా ఉన్నారు.

మాజీ క్రీడాకారుణులు సైతం మనమ్మాయిలపై నమ్మకంగా ఉన్నారు. ఒలింపిక్స్ మెడల్ కొట్టేందుకు ఇదే సరైన సమయమని మాజీ కెప్టెన్ సురీందర్ కౌర్ అభిప్రాయపడ్డారు. కఠోర సాధన తోనే మన చిరకాల స్వప్నం సాకారమౌతుందని చెప్పుకొచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement