'నన్ను ప్రభుత్వాలు పట్టించుకోలేదు'
న్యూఢిల్లీ: తనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదంటూ ఇటీవల జరిగిన ఫెడరేషన్ కప్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో జాతీయ రికార్డు నెలకొల్పిన స్ప్రింటర్ ద్యుతీ చంద్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన శిక్షణ సమయంలో ప్రభుత్వం కల్పిస్తామన్న హామీలను గాలికొదిలేశారని మండిపడింది. గత సెప్టెంబర్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తనకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చి ఆ తరువాత పట్టించుకోలేదని ద్యుతీ విమర్శించింది.
'గతంలో ప్రభుత్వం నాకు చాలా హామీలిచ్చింది. విదేశాల్లో శిక్షణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని సీఎం అన్నారు. ఆ శిక్షణలో ఒంటరిగానే పాల్గొన్నా. నేను తాజాగా నెలకొల్పిన రికార్డుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం అభినందనలు తెలపలేదు. నాకు ఉద్యోగం కల్పిస్తామన్న హామీ కూడా మరచిపోయారు' అంటూ ద్యుతీ చంద్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా టాప్ ఒలింపిక్ పోడియంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సహకారం కూడా తనకు అందలేదని ద్యుతీచంద్ ఆరోపించింది. ఈ మేరకు డిసెంబర్ 18వ తేదీన క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి తాను ఈ-మెయిల్ ద్వారా పొందిన హామీపై ఇప్పటివరకూ ఎటువంటి స్పందనా రాలేదని విమర్శించింది. ఇలా అథ్లెటిక్స్ ను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలకు ధన్యవాదాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
గురువారం ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన న ఫెడరేషన్ కప్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ జాతీయ రికార్డు నెలకొల్పింది. ద్యుతీ 11.33 సెకన్ల టైమింగ్తో స్వర్ణం సాధించింది. అయినప్పటికీ ఒకే ఒక్క సెకను తేడాతో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ బెర్తును చేజార్చుకుంది.