కుస్తీమే సవాల్..! | WFI president keeps the Sushil Kumar vs Narsingh Yadav debate raging | Sakshi
Sakshi News home page

కుస్తీమే సవాల్..!

Published Thu, May 12 2016 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM

కుస్తీమే సవాల్..!

కుస్తీమే సవాల్..!

సుశీ ల్ x నర్సింగ్ ఒలింపిక్ బెర్త్‌పై వివాదం
74 కేజీల విభాగంపై వీడని ఉత్కంఠ
‘రియో’కు తననే పంపించాలంటున్న నర్సింగ్
‘ట్రయల్స్’ నిర్వహించాల్సిందేనని సుశీల్ పట్టు రెజ్లింగ్ సమాఖ్య తర్జన భర్జన.
 
 
సాక్షి క్రీడావిభాగం ఒలింపిక్స్‌కు ముందు భారత క్రీడారంగంలో వివాదం రాజుకుంది. రెజ్లింగ్‌లో 74 కేజీల విభాగంలో పాల్గొంటామని ఇద్దరు రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ పట్టుబడుతున్నారు. భారత్ తరఫున 74 కేజీల విభాగంలో సుశీల్ (ఢిల్లీ), నర్సింగ్ (ముంబై) అత్యుత్తమ రెజ్లర్లు. అయితే వీరిద్దరిలో ఒక్కరికి మాత్రమే రియో ఒలింపిక్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. గతేడాది లాస్‌వేగాస్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నర్సింగ్ యాదవ్ 74 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గడంతోపాటు టాప్-6లో నిలిచి ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. వాస్తవానికి ఆ ఈవెంట్‌కు వెళ్లాల్సిన సుశీల్ గాయం కారణంగా తప్పుకోవడంతో నర్సింగ్ వెళ్లాడు. ఒకసారి ఒక దేశానికి బెర్త్ దక్కాక... మరో క్రీడాకారుడు ఒలింపిక్ బెర్త్ కోసం పోటీపడకూడదు.


 సమస్య ఎలా వచ్చిందంటే?
 గతంలో సుశీల్ కుమార్ 66 కేజీల విభాగంలో పాల్గొనేవాడు. నర్సింగ్ మాత్రం చాలాకాలం నుంచి 74 కేజీల విభాగంలోనే బరిలోకి దిగుతున్నాడు. అయితే 2013లో ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య ఒలింపిక్స్‌లో మహిళల విభాగంలో వెయిట్ కేటగిరీలను పెంచేందుకుగాను పురుషుల విభాగంలో రెండు కేటగిరీలను తీసేయడంతో పాటు వెయిట్ కేటగిరీలను మార్చింది. ఫలితంగా గతంలో సుశీల్ (66 కేజీలు), యోగేశ్వర్ దత్ (60 కేజీలు) ప్రాతినిధ్యం వహించిన విభాగాలు లేకుండా పోయాయి. కొత్తగా వచ్చిన 65 కేజీల విభాగానికి యోగేశ్వర్ మారడంతో... సుశీల్ 74 కేజీలకు మారిపోయాడు. అప్పటి నుంచి సుశీల్, నర్సింగ్‌ల మధ్య పోటీ మొదలైంది. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో ఈ విభాగంలో సుశీల్ బరిలోకి దిగి స్వర్ణం సాధించగా... 2014 ఆసియా క్రీడల్లో నర్సింగ్ పాల్గొని కాంస్యం నెగ్గాడు.


 గతంలో ఏం జరిగిందంటే...
 ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో క్వాలిఫయింగ్ విధానం మొదలైనప్పటి నుంచి భారత్ తరఫున ‘బెర్త్’ను సాధించినవారే ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ సమయంలో ఇలాంటి వివాదమే తెరపైకి వచ్చింది. ఆనాడు 55 కేజీల విభాగంలో యోగేశ్వర్ దత్ ఒలింపిక్ బెర్త్‌ను సాధించాడు. యోగేశ్వర్‌నే ఒలింపిక్స్‌కు పంపించాలని భారత రెజ్లింగ్ సమాఖ్య నిర్ణయించింది. అయితే అప్పుడు ఆ విభాగంలో భారత నంబర్‌వన్ రెజ్లర్‌గా ఉన్న కృపాశంకర్ పాటిల్ సమాఖ్య నిర్ణయాన్ని తప్పు పట్టాడు. ఒలింపిక్ బెర్త్ అనేది దేశానికి  చెందుతుందని, వ్యక్తికి కాదని కృపాశంకర్ వాదించాడు. యోగేశ్వర్‌కు, తనకు మధ్య ట్రయల్స్ నిర్వహించి ఇద్దరిలో గెలిచిన వారిని ఒలింపిక్స్‌కు పంపించాలని కోరుతూ కోర్టులో కేసు వేశాడు. అయితే ఒలింపిక్ బెర్త్ సాధించిన వారు ఫిట్‌గా ఉంటే వారినే పంపించాలని కోర్టు తీర్పు చెప్పి కృపాశంకర్ పాటిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.


 అయితే సుశీల్ బృందం వాదన మరోలా ఉంది. ఒకవేళ ప్రపంచ చాంపియన్‌షిప్ సమయంలో సుశీల్‌కు గాయం లేకపోతే తానే బెర్త్ సాధించేవాడని, గతంలో రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన అనుభవం ఉన్న రెజ్లర్‌కు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. ఇద్దరి మధ్య ట్రయల్స్ నిర్వహించి గెలిచిన వారిని రియోకి పంపాలని కోరుతున్నారు. అటు నర్సింగ్ బృందం వాదన మరోలా ఉంది. గతంలో మాదిరిగా బెర్త్ సాధించిన వారినే పంపాలని కోరుతున్నారు. దీనిపై రెజ్లింగ్ సమాఖ్య ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ  ఈ ఇద్దరి మధ్య ట్రయల్స్ నిర్వహిస్తే మిగిలిన విభాగాల్లో కూడా ట్రయల్స్ నిర్వహించాలనే డిమాండ్ వస్తుంది. 57 కేజీల విభాగంలో అమిత్ దహియా భారత నంబర్‌వన్ రెజ్లర్. 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం కూడా సాధించాడు. అయితే గాయం కారణంగా అమిత్ క్వాలిఫయింగ్ టోర్నీలకు దూరంగా ఉన్నాడు. ఫలితంగా అమిత్ స్థానంలో ఈ విభాగం నుంచి సందీప్ తోమర్ రియో బెర్త్ సాధించాడు. ఈ విభాగం కోసం కూడా ట్రయల్స్ నిర్వహించాల్సి రావచ్చు.
 
 
 నా గత రికార్డును దృష్టిలో పెట్టుకొని నన్నే రియో ఒలింపిక్స్‌కు పంపించాలని నేను డిమాండ్ చేయడం లేదు. మా ఇద్దరి మధ్య పోటీ పెట్టి ఎవరు ఉత్తమమో వారినే పంపాలి. ఒలింపిక్ బెర్త్ అనేది దేశానికి చెందుతుంది కానీ వ్యక్తికి కాదనే విషయం గుర్తుంచుకోవాలి. ఒక విభాగంలో ఒకరికంటే ఎక్కువ మంది నైపుణ్యమున్న రెజ్లర్లు ఉంటే తప్పకుండా ట్రయల్స్ నిర్వహించి ఒకరిని ఎంపిక చేయాల్సిందే. అమెరికాలో కూడా ఇలాగే జరిగింది. ప్రస్తుతం నేను పూర్తి ఫిట్‌గా ఉన్నాను. ఒలింపిక్స్‌లో మరోసారి పతకం నెగ్గడానికి తీవ్రంగా సాధన చేస్తున్నాను. ఒకవేళ నేను ఫిట్‌గా ఉండకపోయుంటే ట్రయల్స్ నిర్వహించాలని కోరేవాణ్ని కాదు.    -సుశీల్ కుమార్
 
 
ట్రయల్స్ నిర్వహించాలనే ప్రస్తావనే రాకూడదు. నేను ఒలింపిక్ బెర్త్ సాధించాను కాబట్టి రియోకు వెళ్లే హక్కు నాకే ఉంది. ట్రయల్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్న రెజ్లర్ గతంలో ఇలాగే చేశారా..? సుశీల్‌కున్న పేరు ప్రతిష్టలను పరిగణనలోకి తీసుకోకూడదు. పేరు ప్రతిష్టలు పతకాలు సాధించి పెట్టవు. ప్రదర్శన ఆధారంగానే పతకాలు వస్తాయి.  భారత రెజ్లింగ్ గత చరిత్రను పరిశీలిస్తే బెర్త్ సాధించినవారే ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. నాతో పోలిస్తే 74 కేజీల విభాగంలో సుశీల్‌కు అంతగా అంతర్జాతీయ అనుభవం లేదు. సుశీల్‌కు ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు మరో మార్గం లేదు కాబట్టే ట్రయల్స్ నిర్వహించాలని అంటున్నాడు  -నర్సింగ్ యాదవ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement