'నా కలను క్రూరంగా చిదిమేశారు'
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ లో దేశానికి పతకం సాధించిపెట్టాలన్న తన కలను క్రూరంగా చిదిమేశారని భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తనపై నాలుగేళ్ల నిషేధం విధించడం పట్ల అతడు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాడు.
'ఒలింపిక్స్ లో సత్తా చాటేందుకు రెండు నెలలుగా ఎంతో శ్రమించాను. ప్రతిష్టాత్మక క్రీడల్లో దేశ గౌరవాన్ని నిలబెట్టాలని నిరంతరం తపించాను. రియో ఒలింపిక్స్ లో దేశానికి పతకం సాధించి పెట్టాలన్నది నా కల. బౌట్ లో దిగడానికి 12 గంటల ముందు నాపై నిషేధం విధించి నా కలను దారుణంగా చిదిమేశార'ని నర్సింగ్ వాపోయాడు. తన నిర్దోషత్వం నిరూపించుకోవడానికి చేయాల్సిదంతా చేస్తానని, పోరాటం కొనసాగిస్తానని ఒక ప్రకటనలో తెలిపాడు. నర్సింగ్ అమాయకుడని, అతడి న్యాయ పోరాటానికి అండగా ఉంటామని స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న జేఎస్ డబ్ల్యూ స్పోర్ట్స్ తెలిపింది.