భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న రెజ్లర్
ఢిల్లీ నుంచి బలాలి వరకు భారీ ఊరేగింపు
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ శనివారం స్వదేశానికి చేరుకుంది. స్వర్ణపతక పోరుకు ముందు అనర్హతకు గురై అప్పీల్‌కు వెళ్లిన ఆమె ఇన్నాళ్లూ పారిస్‌లోనే ఉండిపోయింది. ఫైనల్ రోజు కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమె అనర్హతకు గురైంది. ఫైనల్లో ఓడినా కనీసం రజతం ఖాయం అనుకోగా, అదీ చేజారిపోయింది. సంయుక్త రజతం కోసం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో వినేశ్ అప్పీలు చేసింది.
భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మద్దతుతో నిష్ణాతులైన లాయర్ల బృందం ఆమె కేసును వాదించింది. విచారణ తదుపరి వాయిదాల అనంతరం చివరకు భారత రెజ్లర్‌కు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. దీంతో భారత్‌కు పయనమైన వినేశ్ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే క్రీడాభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. డోలు బాజాలు, భాంగ్రా నృత్యాల మధ్య ఆమె బయటకు వచ్చింది. వినేశ్ భర్త సోమ్‌వీర్ రాఠీ కూడా ఆమె వెంట ఉన్నాడు.
ఒలింపిక్ పతక విజేతలైన స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాలతో పాటు, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా, పోటెత్తిన అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. వెల్లువెత్తిన అభిమానం చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన ఫొగాట్ కన్నీళ్లు పెట్టుకుంది. ఇది గమనించిన సాక్షి, బజరంగ్ ఆమెను దగ్గరికి తీసుకొని ఓదార్చారు. అనంతరం తేరుకొని వినమ్రంగా చేతులు జోడించి ‘యావత్ దేశానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని చెప్పింది.
పెద్ద సంఖ్యలో అభిమానులంతా తమ వాహనాల్లో వినేశ్‌ను ఆమె స్వగ్రామం బలాలి (హరియాణా) చేరే వరకు అనుసరించారు. దీంతో ఈ 135 కిలో మీటర్ల మార్గమంతా వీఐపీ కాన్వాయ్‌ని తలపించింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత బృందానికి చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించిన మాజీ షూటర్ గగన్ నారంగ్ కూడా శనివారం ఆమెతో పాటు స్వదేశం చేరుకున్నారు. ఆమెతో పారిస్‌లో దిగిన ఫొటోని ‘ఎక్స్’లో షేర్ చేస్తూ వినేశ్ నిజమైన చాంపియన్‌గా అభివర్ణించారు.
‘క్రీడా గ్రామంలో తొలి రోజే ఆమె చాంపియన్‌గా అడుగుపెట్టింది. అనర్హతకు గురైనా ఇప్పటికీ ఆమెనే చాంపియన్. పతకాలు, విజయాలే కాదు... కొన్నిసార్లు పోరాటం కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. వినేశ్ కనబరిచింది కూడా అదే! యువతరానికి ప్రేరణగా నిలిచిన ఆమెకు నా సెల్యూట్’ అని నారంగ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
వినేశ్ కోసం ఢిల్లీలో, తమ స్వగ్రామంలో ఎదురు చూసిన అభిమానులు ఆమెకు బ్రహ్మరథం పట్టారని సోదరుడు హర్విందర్ ఫొగాట్ చెప్పాడు. ‘ఒలింపిక్స్ నిర్వాహకులు నాకు పతకం ఇవ్వకపోతేనేమి. ఇక్కడి ప్రజలంత ఎంతో ప్రేమ, గౌరవం అందించారు. నాకు ఇది 1000 ఒలింపిక్ పతకాలతో సమానం’ అని వినేశ్ వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment