నర్సింగ్‌కు మరో గండం!
‘నాడా’ క్లీన్‌చిట్‌పై ‘వాడా’ అప్పీల్ కొనసాగుతున్న విచారణ
18న తీర్పు వచ్చే అవకాశం
రియో: భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడం మళ్లీ సందేహంలో పడింది. ఈ నెల 19న అతను బరిలోకి దిగాల్సి ఉండగా, మూడు రోజుల ముందు అతనికి మరో షాక్ తగిలింది. డోపింగ్ వివాదంలో నర్సింగ్‌ను నిర్దోషిగా తేలుస్తూ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఇచ్చిన తీర్పుపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) సందేహం వ్యక్తం చేసింది. క్లీన్‌చిట్‌ను సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (కాస్)లో అప్పీల్ చేసింది. ఈ అంశంపై ఇప్పటికే విచారణ ప్రారంభం కాగా, ఐఓఏ కార్యదర్శి రాజీవ్ మెహతా సహా ‘వాడా’ అధికారులు దీనికి హాజరయ్యారు. నిషేధిత ఉత్ప్రేరకం మెథడనోన్ తీసుకోవడంతో రెండు సార్లు పాజిటివ్‌గా తేలిన నర్సింగ్... తనపై కుట్ర జరిగిందని ఆరోపించాడు. విచారణ తర్వాత ‘నాడా’ అతని తప్పేమీ లేదని తేల్చింది.
దీనికి తోడు భారత రెజ్లింగ్ సమాఖ్య అండగా నిలవడంతో నర్సింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రియో చేరుకున్నాడు. ఇలాంటి సమయంలో ‘వాడా’ అప్పీల్‌కు వెళ్లడం అతనికి కొత్త సమస్య తెచ్చి పెట్టింది. పోటీలకు ముందు రోజు గురువారం విచారణ కొనసాగుతుంది. అదే రోజు అతనికి అనుకూలంగా తీర్పు వస్తే నర్సింగ్ బరిలోకి దిగుతాడు. ‘వాడా’ అప్పీల్ సరైనదిగా ‘కాస్’ భావిస్తే నర్సింగ్‌పై కనీసం నాలుగేళ్ల నిషేధం పడుతుంది. తాము చివరి వరకు పోరాడతామని, నర్సింగ్‌కు న్యాయం జరిగి అతను ఒలింపిక్స్‌లో పాల్గొనేలా చేస్తామని మెహతా విశ్వాసం వ్యక్తం చేశారు.