అభినమాన సందేహం 'సాక్షి'గా...
రెజ్లర్ సాక్షి మలిక్‌కు భారీ స్వాగతం
ఘనంగా సత్కరించిన హరియాణా ప్రభుత్వం
రూ. 2.5 కోట్ల నగదు పురస్కారం అందజేత
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన రెజ్లర్ సాక్షి మలిక్ సగర్వంగా సొంతగడ్డపై అడుగు పెట్టింది. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు పెద్ద ఎత్తున ఘన స్వాగతం లభించింది. హరియాణా క్రీడాశాఖ మంత్రి అనిల్ విజ్ రియో నుంచి ఆమె వెంట రాగా, ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రులు స్వాగతం పలికారు. ముందుగా సాక్షి తల్లిదండ్రులు ఆమెను అభినందనలతో ముంచెత్తగా... ఆ తర్వాత క్రీడాభిమానులు ఎయిర్‌పోర్ట్ ముందు బ్యాండ్ బాజాలతో తమ ఆనందాన్ని ప్రదర్శించారు. అనంతరం ఝజ్జర్ జిల్లా బహదూర్‌గఢ్‌లో హరియాణా ప్రభుత్వం నిర్వహించిన అధికారిక సన్మాన కార్యక్రమంలో సాక్షి పాల్గొంది. కాంస్య పతకం గెలుచుకున్న సాక్షికి ఈ సందర్భంగా రూ. 2.5 కోట్ల నగదు పురస్కారపు చెక్‌ను ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అందజేశారు. దీంతో పాటు హరియాణా ప్రభుత్వం క్లాస్-2 ఉద్యోగాన్ని కూడా ఆఫర్ చేసింది. సాంప్రదాయ ‘పగ్డీ’తో సాక్షిని సత్కరించిన ఖట్టర్, బేటీ పఢావో-బేటీ బచావో కార్యక్రమానికి హరియాణా ప్రచారకర్తగా సాక్షిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత అభిమానులు కరెన్సీ నోట్ల దండలను ఆమె మెడలో వేశారు. రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ప్రతీ హరియాణా క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ. 15 లక్షల నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు కూడా సీఎం చెప్పారు. అనంతరం భారీ జన సందోహం తోడు రాగా సాక్షి తన స్వగ్రామం మోఖ్రాకు వెళ్లింది. మోఖ్రాలో స్పోర్ట్స్ నర్సరీ, స్టేడియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి... సాక్షి ఇద్దరు కోచ్‌లకు చెరో రూ. 10 లక్షల పురస్కారాన్ని ప్రకటించారు.
కర్ణాటక సింధు!
సాక్షి సత్కార కార్యక్రమంలో మాట్లాడే సమయంలో సీఎం ఖట్టర్ తడబడ్డారు. ముందుగా సాక్షి ఘనతల గురించి గొప్పగా చెప్పిన ఆయన ఇద్దరు అమ్మాయిలు దేశ గౌరవం నిలబెట్టారని ప్రశంసించారు. అయితే సింధు పేరు గుర్తుకు రాక పక్కవారిని ‘ఆ రెండో అమ్మాయి పేరు ఏమిటి’ అని అడిగి తెలుసుకున్నారు. దానితో ఆగిపోకుండా కర్ణాటకకు చెందిన సింధు అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
చాలా గర్వంగా ఉంది...
స్వదేశంలో తనకు లభించిన స్వాగతం పట్ల సాక్షి మలిక్ అమితానందం వ్యక్తం చేసింది. తన 12 ఏళ్ల శ్రమకు తగిన ఫలితం లభించిందని ఆమె ఉద్వేగంగా చెప్పింది. ‘ఇంత మంది నా కోసం రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు అండగా నిలిచిన, ప్రార్థనలు చేసినవారందరికీ కృతజ్ఞతలు. ఒలింపిక్ పతకం గెలవాలనే నా కల నిజమైంది. ముగింపు ఉత్సవంలో పతాకధారి కావడం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని 23 ఏళ్ల సాక్షి చెప్పింది. అమ్మాయికి కుస్తీ ఎందుకు అంటూ తమను చాలా మంది విమర్శించారని, ఇప్పుడు ఆమె ఘనత చూసి గర్విస్తున్నామని ఆమె తల్లిదండ్రులు సుఖ్‌బీర్, సుదేశ్ చెప్పారు.