డోపింగ్ కేసుపై సీబీఐ విచారణ!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ కు ముందు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు స్వీకరించనుంది. ఈ మేరకు తమ విజ్ఞప్తిని మన్నించిన కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించినట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ శుక్రవారం స్సష్టం చేశారు. దీనిలో భాగంగా ప్రధాని కార్యాలయంలోని అధికారుల్ని కలిసి ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు.
'నర్సింగ్ యాదవ్ డోపింగ్ ఉదంతంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరాం. ఈ కేసుకు సంబంధించి ప్రధాని కార్యాలయంలో అధికారుల్ని కలిశా. ఇందుకు పీఎంవో కార్యాలయం సానుకూలంగా స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను సీబీఐ దర్యాప్తు చేస్తుంది' అని బ్రిజ్ భూషణ్ తెలిపారు.
గత జూన్లో నర్సింగ్ యాదవ్ డోపింగ్ వివాదంలో ఇరుక్కున సంగతి తెలిసిందే. దీంతో రియో ఒలింపిక్స్ లో పాల్గొనాలన్న నర్సింగ్ ఆశలు ఆవిరయ్యాయి. దాంతో పాటు నాలుగేళ్ల నిషేధం విధిస్తూ 'కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పునిచ్చింది. అయితే తాను డోపింగ్ పాల్పడలేదని, ఎవరో చేసిన కుట్రకు బలయ్యానని నర్సింగ్ యాదవ్ ఆరోపించాడు. ఈ వాదనకు భారత రెజ్లింగ్ సమాఖ్య కూడా మద్దతుగా నిలిచింది.