మరకానా జిగేల్
రియోడిజనీరో: క్రీడా ప్రపంచమంతా అతి పెద్ద సంబరంగా భావించే ఒలింపిక్స్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 31వ ఒలింపిక్స్ లో భాగంగా బ్రెజిల్ నగరం రియో డి జనీరో పక్షం రోజులకు పైగా పాటు జరిగే క్రీడా సంబరాలకు అధికారికంగా తెరలేచింది. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున మరకానా స్టేడియంలో ఒలింపిక్స్ క్రీడలు ఆరంభమయ్యాయి. కళ్లు మిరమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు, అదిరిపోయే అథ్లెట్ల కవాతులు, ఆకట్టుకునే నృత్యాల నడుమ విశ్వ క్రీడా వేడుకలు 'కలర్ ఫుల్' గా ప్రారంభమయ్యాయి. బ్రెజిల్ చరిత్రను పరిచయం చేసే కళారూపం జిగేల్ మనిపించింది. దాదాపు ఆరువేల మంది కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు వారి చరిత్రకు అద్దం పట్టాయి. అలాగే బ్రెజిల్ సంస్కృతిని చాటే సాంబా, కార్నివాల్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఆగస్టు 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ మరకానాతో సహా మొత్తం 37 వేదికల్లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతాయి. భారత్కు తొలి వ్యక్తిగత స్వర్ణం అందించిన అభినవ్ బింద్రా ఆరంభోత్సవంలో మన బృందానికి నాయకత్వం వహించాడు. ఈసారి భారత్ నుంచి అత్యధిక స్థాయిలో 118 మంది ఒలింపిక్స్లో బరిలోకి దిగుతున్నారు. మరోవైపు భారీ ఒలింపిక్ బృందంతో ఒలింపిక్స్ కు సిద్ధమైన అమెరికా ఆరంభ వేడుకల్లో ప్రత్యేకగా ఆకర్షణగా నిలిచింది. ఒలింపిక్స్ వేడుకలకు విచ్చేసిన అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ తమ దేశ క్రీడాకారులను చప్పట్లతో ఉత్సాహపరిచారు.
భారత కాలమానం ప్రకారం రియో ఎనిమిదిన్నర గంటలు వెనక ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ మన కాలమానం సాయంత్రం ఆరు గంటల నుంచి పోటీలు జరుగుతాయి. ఉదయం ఏడు గంటల వరకూ పోటీలు సాగుతాయి.