హరేంద్ర సింగ్... భారత హాకీలో మేటి కోచ్. బాధ్యతలు తీసుకుంటే పట్టుదలతో పని చేస్తారు. ఫలితాల్ని అందిస్తారు. ఆయన కోచింగ్‌లోనే జూనియర్ ప్రపంచకప్‌లో భారత్ చాంపియన్ అయింది. తాజాగా ఆయన పర్యవేక్షణలోనే ఆసియా కప్ మహిళల ఈవెంట్‌లో ట్రోఫీని గెలుచుకుంది. ప్రపంచకప్ బెర్త్‌ను సాధించింది.
న్యూఢిల్లీ: అవకాశమిచ్చినప్పుడల్లా అద్భుతాలు చేయడం హరేంద్ర సింగ్‌కు అలవాటే. కోచింగ్‌లో విశేష అనుభవజ్ఞుడైన హరేంద్ర ఇప్పుడు కూడా సరిగ్గా అదే పని చేశారు. 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల జట్టుకు ఆసియా కప్‌ను అందించారు. కుర్రాళ్లకు జూనియర్ ప్రపంచకప్, అమ్మాయిలకు ఆసియా ట్రోఫీని అందించిన హరేంద్రకు విజయాల దాహం ఇంకా తీరనట్లుంది. ‘ఆసియా’ కేవలం పునాదేనని మరిన్ని విజయాలు ముందున్నాయని తన లక్ష్యాల్ని చెప్పకనే చెబుతున్నారు.
మెగా ఈవెంట్లపై దృష్టి...
భారత హాకీకి వచ్చే ఏడాది చాలా కీలకం. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్, ప్రపంచకప్‌లాంటి మెగా ఈవెంట్లున్నాయి. ఈ మూడింటిలో కనీసం రెండు పతకాలైనా సాధించాలనేదే నా లక్ష్యం. క్రీడల్లో అసాధ్యమనేదే లేదు. సుదీర్ఘ కాలం పురుషుల జట్టుకు సేవలందించిన నాకు మహిళల టీమ్‌ను మేటి జట్టుగా మలచడం కూడా తెలుసు. మహిళల జట్టులో ప్రతిభకు కొదవలేదు. ఏదైనా సాధించగలరనేది ఇప్పుడు చేతల్లో చూపారు.
వేటికవే భిన్నం...
ఓ కోచ్‌గా నాకు ప్రతీ టోర్నీ ముఖ్యమైనదే. కుర్రాళ్ల జూనియర్ ప్రపంచకప్ టైటిల్, అమ్మాయిల ఆసియా కప్ విజయం... ఈ రెండు భిన్నమై నవి. వీటిని పోల్చడం తగదు. ప్రపంచకప్ కోసం కుర్రాళ్లతో మూడేళ్లు పనిచేశాను. అదే ‘ఆసియా’ కోసం 23, 24 రోజులు శ్రమించా. ఈ రెండు సంతృప్తినిచ్చినప్పటికీ... ఈ విజయాలతో ఆగిపోను.
మెరిట్‌తోనే బెర్త్... దయతో కాదు...
మన అమ్మాయిలు ఫైనల్లో చైనాను ఓడించి టైటిల్‌ను గెలిచారు. మెరిట్‌తోనే ప్రపంచకప్ బెర్త్‌ను సాధించారు. ఇంకొకరి దయతోనూ, మరో జట్టు వైఫల్యంతోనూ అర్హత పొందలేదు. స్వతహాగా సాధించిన బెర్త్ ఇది. ఈ ఉత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని టైటిళ్లు గెలిచే ఆత్మవిశ్వాసం లభించినట్లయింది.
ఏ పతకమైనా ఓకే...
వచ్చే ఏడాది మూడు మేటి ఈవెంట్లలో (కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, వరల్డ్ కప్) మనం పతకం సాధించే అవకాశాల్ని కొట్టిపారేయలేం. ఏ పతకమొచ్చినా సంతోషమే. రంగు (పసిడి, రజతం, కాంస్యం) ఏదనేది బరిలోకి దిగాక అమ్మాయిలే నిర్ణయిస్తారు. ఏదైనా సాధించగలమని నిరూపిస్తారు.
రూ లక్ష చొప్పున హెచ్‌ఐ నజరానా
హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఆసియా కప్ విజేతలకు నజరానా ప్రకటించింది. 18 మంది సభ్యులుగల మహిళల జట్టులో ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున, కోచ్ హరేంద్రకు రూ. లక్ష, ఇతర సహాయక సిబ్బందికి రూ. 50 వేల చొప్పున ఇవ్వనుంది.
మొదటిసారి టాప్–10లోకి...
భారత మహిళల జట్టు ర్యాంక్‌లోనూ రెండు స్థానాలు పురోగతి సాధించింది. ప్రపంచ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టీమిండియా తొలిసారి టాప్–10లోకి దూసుకొచ్చింది. పురుషుల జట్టు నిలకడగా ఆరో స్థానంలోనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment