
న్యూఢిల్లీ: విదేశీ కోచ్‌ల భాషతో ఇబ్బంది ఉండేదని... మ్యాచ్ విరామ సమయాల్లో వారు ఇచ్చే సూచనలు అర్థం చేసుకోవడానికి చాలా కష్ట పడాల్సి వచ్చేదని భారత హాకీ జట్టు సీనియర్ ఆటగాళ్లు సర్దార్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మే నుంచి భారత పురుషుల హాకీ జట్టుకు హరేంద్ర సింగ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి భాష ఇబ్బందులు తొలగిపోయాయని ఇప్పుడు కోచ్ చెప్పే విషయంపై దృష్టి పెడితే సరిపోతోందని... దాన్ని అనువదించుకోవాల్సిన పనిలేకుండా పోయిందని అన్నారు. ‘హరేంద్రతో 16 ఏళ్ల క్రితం నుంచే పరిచయం ఉంది. ఆయనతో ఏ విషయాన్నైనా చర్చించే అవకాశం ఉంటుంది. విదేశీ కోచ్‌లు ఉంటే మ్యాచ్ మధ్య లభించే రెండు నిమిషాల విరామ సమయాల్లో వారు చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టేది. ఒక్కోసారి సరిగ్గా అర్థంకాక గందరగోళానికి గురయ్యే వాళ్లం. స్వదేశీ కోచ్ ఆధ్వర్యంలో ఆడటంతో ఆ తేడా స్పష్టమవుతోంది’ అని సర్దార్ సింగ్ తెలిపారు.
‘ఆటగాళ్ల బలాబలాల విషయంలో హరేంద్రకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన ప్లేయర్ల ఆటతీరును మార్చుకోమని చెప్పడు... చిన్న చిన్న సర్దుబాట్లతో వారిని మరింత రాటుదేలేలా చేస్తారు’ అని మన్‌ప్రీత్ పేర్కొన్నాడు. ఈ నెల 18 నుంచి జకార్తా వేదికగా జరుగనున్న ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గాలనే ధృడ సంకల్పంతో భారత జట్టు ప్రాక్టీస్ కొనసాగిస్తోంది. ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిస్తే 2020 (టోక్యో) ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందనుంది.