india womens hockey team
-
Womens FIH Pro League: అమెరికాపై భారత్ పైచేయి
రోటర్‌డామ్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మహిళల ప్రొ లీగ్‌లో భారత జట్టు ఖాతాలో ఐదో విజయం చేరింది. అమెరికా జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4–2 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున దీప్ గ్రేస్ ఎక్కా (31వ ని.లో), నవనీత్ కౌర్ (32వ ని.లో), సోనిక (40వ ని.లో), వందన కటారియా (50వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. అమెరికా జట్టు డానియెలా గ్రెగా (28వ ని.లో) గోల్‌తో ఖాతా తెరువగా... నటాలీ కొనెర్త్ (45వ ని.లో) రెండో గోల్ అందించింది. ఈ విజయంతో భారత జట్టు ప్రొ హాకీ లీగ్‌లో 13 మ్యాచ్‌లు పూర్తి చేసుకొని 27 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నేడు అమెరికా జట్టుతోనే భారత్ రెండో అంచె లీగ్ మ్యాచ్‌లో తలపడుతుంది. ఈ మ్యాచ్‌తో ప్రొ హాకీ లీగ్‌ను భారత్ ముగిస్తుంది. -
భారత జట్టు దృక్పథం మారింది!
బెంగళూరు: ఓవైపు కరోనా ధాటికి టోర్నీలు రద్దవడంతో ఆటగాళ్లంతా ఇంటిపట్టునే గడుపుతుండగా... మరోవైపు భారత మహిళల హాకీ జట్టు మాత్రం ఒలింపిక్స్ సన్నాహాల కోసం సంసిద్ధమవుతోంది. ఒలింపిక్స్ కోసం వచ్చే వారం నుంచి కఠిన శిక్షణలో పాల్గొంటామని భారత స్ట్రయికర్ నవనీత్ కౌర్ తెలిపింది. ఈ మెగా ఈవెంట్ కోసం విడుదలైన డ్రాలో భారత్ పటిష్ట జట్లయిన నెదర్లాండ్స్, జర్మనీ, బ్రిటన్, దక్షిణాఫ్రికాతో కలిసి గ్రూప్ ‘ఎ’లో చోటు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మెరుగైన ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చేలా తమ ఒలింపిక్స్ సన్నాహాలు ఉంటాయని కౌర్ పేర్కొంది. ‘నెదర్లాండ్స్‌తో జరిగే తొలి మ్యాచ్ కోసం జట్టంతా ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. ఇంతకుముందెన్నడూ మేం నెదర్లాండ్స్‌ను ఎదుర్కోలేదు. పటిష్ట ప్రత్యర్థులను చూసి మేం భయపడట్లేదు. దానికి తగినట్లుగా ప్రాక్టీస్ చేయడంపైనే దృష్టి పెట్టాం. ప్రస్తుతం మేం జిమ్‌లో తేలికపాటి వ్యాయామాలు చేస్తున్నాం. వచ్చే వారం నుంచి ప్రాక్టీస్‌లో తీవ్రత పెంచుతాం’ అని కౌర్ చెప్పింది. గత కొంతకాలంగా భారత జట్టు దృక్పథంలో వచ్చిన మార్పు పట్ల ఆమె హర్షం వ్యక్తం చేసింది. ఈ మార్పు చీఫ్ కోచ్ జోయర్డ్ మరీనే కారణంగా వచ్చిందని పేర్కొంది. ‘మా దృక్పథంలో మార్పుకు చాలా అంశాలు దోహదపడ్డాయి. ప్రాధాన్యత గల మ్యాచ్‌ల్ని గెలవడంతో పాటు కోచ్ జోయర్డ్ మరీనే మా ధోరణిలో మార్పు తెచ్చారు. అయన దూకుడైన ఆటను ఇష్టపడతారు. మేం కూడా దూకుడుగా ఆడగలమనే ఆత్మవిశ్వాసాన్ని ఆయన జట్టులో నింపారు. మ్యాచ్‌లో చివరి విజిల్ వరకు పోరాడాలని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. జట్టులో పోరాట పటిమను పెంచారు’ అని కౌర్ కోచ్‌పై పొగడ్తల వర్షం కురిపించింది. -
హాకీ ఇండియా...చలో టోక్యో...
భువనేశ్వర్: ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత పురుషుల, మహిళల హాకీ జట్లు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. శనివారం జరిగిన రెండో అంచె మ్యాచ్‌ల్లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి మ్యాచ్‌లో 5–1తో అమెరికాపై భారత మహిళల జట్టు విజయం సాధించగా... రెండో అంచె మ్యాచ్‌లో టీమిండియాకు 1–4తో ఓటమి ఎదురైంది. భారత్, అమెరికా చెరో మ్యాచ్‌లో నెగ్గడంతో... నిబంధనల ప్రకారం రెండు మ్యాచ్‌ల్లో సాధించిన మొత్తం గోల్స్ ఆధారంగా బెర్త్ ఎవరికి దక్కాలో నిర్ణయించారు. ఇక్కడ భారత్ 6–5 గోల్స్ తేడాతో అమెరికాపై పైచేయి సాధించి ‘టోక్యో’ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరోవైపు తొలి అంచె మ్యాచ్‌లో రష్యాపై 4–2తో నెగ్గిన భారత పురుషుల జట్టు రెండో అంచె మ్యాచ్‌లో మాత్రం విశ్వరూపం ప్రదర్శించింది. ఏకంగా 7–1 గోల్స్ తేడాతో రష్యాను చిత్తు చేసి ‘టోక్యో’ బెర్త్‌ను తమ ఖాతాలో వేసుకుంది. మొత్తం గోల్స్‌లోనూ భారత్‌దే 11–3తో పైచేయిగా నిలిచింది. ఆదుకున్న రాణి రాంపాల్... తొలి అంచె మ్యాచ్‌లో అమెరికాను వణికించిన భారత మహిళల జట్టు రెండో మ్యాచ్‌లో మాత్రం తడబడింది. కనీసం నాలుగు గోల్స్ తేడాతో గెలిస్తేనే ‘టోక్యో’ బెర్త్ ఆశలు సజీవంగా ఉన్న పరిస్థితుల్లో అమెరికా ఆరంభం నుంచే ఎదురుదాడులు చేసింది. వారి దూకుడు ఫలితాన్నిచ్చింది. తొలి క్వార్టర్లో రెండు గోల్స్... రెండో క్వార్టర్లో మరో రెండు గోల్స్ చేసి 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్లో అమెరికాను నిలువరించిన భారత్ ఇంకో గోల్‌ను సమర్పించుకోలేదు. అప్పటికి మొత్తం గోల్స్ సంఖ్య (రెండు మ్యాచ్‌లవి కలిపి) 5–5తో సమఉజ్జీగా ఉంది. నాలుగో క్వార్టర్ మొదలైన మూడో నిమిషంలో అమెరికా ‘డి’ రక్షణ వలయంలో లభించిన సువర్ణావకాశాన్ని భారత కెప్టెన్ రాణి రాంపాల్ వదులుకోలేదు. కళ్లు చెదిరే షాట్‌తో బంతిని లక్ష్యానికి చేర్చిన రాణి రాంపాల్ భారత్ ఖాతాలో గోల్ చేర్చింది. దాంతో మొత్తం గోల్స్ సంఖ్యలో భారత్ 6–5తో ఆధిక్యంలోకి వచ్చింది. చివరి 12 నిమిషాల్లో అమెరికా దాడులను సమర్థంగా నిలువరించిన భారత మహిళల బృందం మ్యాచ్‌లో ఓడిపోయినా ‘టోక్యో’ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఒలింపిక్స్ క్రీడలకు భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించడం ఇది మూడోసారి (1980, 2016) మాత్రమే. మహిళల విభాగం భారత్ 1 ►రాణి రాంపాల్ (48వ ని.లో) అమెరికా 4 ►అమండా మగాడాన్ (5వ ని.లో) ►కాథ్లీన్ షార్కీ (14వ ని.లో) ►అలీసా పార్కర్ (20వ ని.లో) ►అమండా మగాడాన్ (28వ ని.లో) పురుషుల విభాగం భారత్ 7 ►లలిత్ ఉపాధ్యాయ్(17వ ని.లో) ►ఆకాశ్‌దీప్ సింగ్ (23వ ని.లో) ►ఆకాశ్‌దీప్ సింగ్ (27వ ని.లో) ►నీలకంఠ శర్మ (47వ ని.లో) ►రూపిందర్ సింగ్ (48వ ని.లో) ►రూపిందర్ సింగ్ (59వ ని.లో) ►అమిత్ రోహిదాస్ (60వ ని.లో) రష్యా 1 ►సబోలెవ్స్కీ (1వ ని.లో) -
‘డ్రా’తో ముగించారు
ముర్సియా (స్పెయిన్): తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న స్పెయిన్ జట్టుపై వారి దేశంలోనే సిరీస్ గెలిచే అవకాశాన్ని భారత మహిళల జట్టు చేజార్చుకుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ భారత్ 1–1తో ముగించింది. సిరీస్‌లోని చివరిదైన నాలుగో మ్యాచ్ 2–2తో ‘డ్రా’ అయ్యింది. ఆట 8వ నిమిషంలో దీప్ ఎక్కా గోల్‌తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం 26వ నిమిషంలో నవనీత్ కౌర్ గోల్‌తో భారత ఆధిక్యం 2–0కు చేరింది. అయితే మూడో క్వార్టర్లో భారత్ నాలుగు నిమిషాల తేడాలో రెండు గోల్స్ సమర్పించుకుంది. ప్రపంచ ఏడో ర్యాంకర్ స్పెయిన్ జట్టు తరఫున 35వ నిమిషంలో లూసియా జెమినెజ్... 39వ నిమిషంలో క్లారా వైకార్ట్ ఒక్కో గోల్ చేసి స్కోరును 2–2తో సమం చేశారు. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేసేందుకు యత్నించినా సఫలం కాలేకపోయాయి. తొలి మ్యాచ్‌లో భారత్ 2–3తో ఓడిపోగా... రెండో మ్యాచ్ 1–1తో ‘డ్రా’ అయ్యింది. మూడో మ్యాచ్‌లో భారత్ 5–2తో గెలిచిన విషయం తెలిసిందే. -
అమ్మాయిల ఘన విజయం
మర్సియా (స్పెయిన్): ఆతిథ్య స్పెయిన్‌తో తొలి మ్యాచ్‌లో ఓడి రెండో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న భారత మహిళల హాకీ జట్టు మూడో మ్యాచ్‌లో సత్తా చాటింది. మంగళవారం జరిగిన పోరులో భారత్ 5–2తో ఘన విజయం సాధించింది. భారత్ తరఫున లాల్రెమ్సియామి (17వ, 58వ నిమిషాల్లో), నేహా గోయల్ (21వ ని.), నవనీత్ కౌర్ (32వ ని.), కెప్టెన్ రాణి రాంపాల్ (51వ ని.) గోల్స్ సాధించారు. స్పెయిన్ తరఫున బెర్తా బొనాస్త్రే (7వ, 35వ నిమిషాల్లో) రెండు గోల్స్ కొట్టింది. ముందుగా స్పెయిన్ గోల్ సాధించి 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత రెండో క్వార్టర్లో రెండు, మూడో క్వార్టర్లో ఒక గోల్ చేసిన భారత్ 3–1తో ముందంజ వేసింది. అయితే మూడు నిమిషాలకే స్పెయిన్ గోల్ సాధించడంతో ఆధిక్యం 3–2కు తగ్గింది. చివరి క్వార్టర్లోనూ అదే జోరు కనబర్చిన రాణి సేన భారీ తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఇరు జట్ల మధ్య గురువారం నాలుగో మ్యాచ్ జరుగుతుంది. -
ఆ గందరగోళం పోయింది
న్యూఢిల్లీ: విదేశీ కోచ్‌ల భాషతో ఇబ్బంది ఉండేదని... మ్యాచ్ విరామ సమయాల్లో వారు ఇచ్చే సూచనలు అర్థం చేసుకోవడానికి చాలా కష్ట పడాల్సి వచ్చేదని భారత హాకీ జట్టు సీనియర్ ఆటగాళ్లు సర్దార్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మే నుంచి భారత పురుషుల హాకీ జట్టుకు హరేంద్ర సింగ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి భాష ఇబ్బందులు తొలగిపోయాయని ఇప్పుడు కోచ్ చెప్పే విషయంపై దృష్టి పెడితే సరిపోతోందని... దాన్ని అనువదించుకోవాల్సిన పనిలేకుండా పోయిందని అన్నారు. ‘హరేంద్రతో 16 ఏళ్ల క్రితం నుంచే పరిచయం ఉంది. ఆయనతో ఏ విషయాన్నైనా చర్చించే అవకాశం ఉంటుంది. విదేశీ కోచ్‌లు ఉంటే మ్యాచ్ మధ్య లభించే రెండు నిమిషాల విరామ సమయాల్లో వారు చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టేది. ఒక్కోసారి సరిగ్గా అర్థంకాక గందరగోళానికి గురయ్యే వాళ్లం. స్వదేశీ కోచ్ ఆధ్వర్యంలో ఆడటంతో ఆ తేడా స్పష్టమవుతోంది’ అని సర్దార్ సింగ్ తెలిపారు. ‘ఆటగాళ్ల బలాబలాల విషయంలో హరేంద్రకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన ప్లేయర్ల ఆటతీరును మార్చుకోమని చెప్పడు... చిన్న చిన్న సర్దుబాట్లతో వారిని మరింత రాటుదేలేలా చేస్తారు’ అని మన్‌ప్రీత్ పేర్కొన్నాడు. ఈ నెల 18 నుంచి జకార్తా వేదికగా జరుగనున్న ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గాలనే ధృడ సంకల్పంతో భారత జట్టు ప్రాక్టీస్ కొనసాగిస్తోంది. ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిస్తే 2020 (టోక్యో) ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందనుంది. -
జపాన్‌కు షాక్ ఇచ్చి...
కకమిగహర (జపాన్): ప్రత్యర్థి ఎవరైనా ఏమాత్రం బెదరకుండా ఆడుతోన్న భారత మహిళల హాకీ జట్టు ఆసియా కప్‌లో తమ విజయపరంపరను కొనసాగిస్తోంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో రాణి రాంపాల్ నేతృత్వంలోని భారత జట్టు 4–2 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ జపాన్ను బోల్తా కొట్టించింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (7వ, 9వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... నవ్‌జ్యోత్ కౌర్ (9వ నిమిషంలో), లాల్రెమ్సియామి (38వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. జపాన్ జట్టుకు సుజీ (17వ నిమిషంలో), ఇషిబాషి (28వ నిమిషంలో) చెరో గోల్ అందించారు. మరో సెమీఫైనల్లో చైనా 3–2తో కొరియాను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో చైనాతో భారత్ తలపడుతుంది. ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్లో భారత్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది నాలుగోసారి. గతంలో 1999, 2004, 2009లలో ఫైనల్‌కు చేరిన టీమిండియా 2004లో టైటిల్ నెగ్గి, మిగతా రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది. -
న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి
డార్విన్ (ఆస్ట్రేలియా): నాలుగు దేశాల టోర్నమెంట్‌ను భారత మహిళల హాకీ జట్టు పరాజయంతో ఆరంభించింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 1-4తో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. భారత్ తరఫున అనురాధా దేవి తోక్చామ్ ఏకైక గోల్ సాధించగా... పిపా హెవార్డ్స్ (18, 47వ ని.), అనితా మెక్లారెన్ (51వ ని.), పెట్రియా వెబ్‌స్టెర్ (53వ ని.)లు కివీస్‌కు గోల్స్ అందించారు. ఉక్కపోత, వేడి వాతావరణం ఉన్నప్పటికీ భారత క్రీడాకారిణులు ఆరంభంలో అద్భుతమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్నారు. అయితే న్యూజిలాండ్ పదేపదే దాడులు చే స్తూ ఆరో నిమిషంలో రెండు పెనాల్టీ కార్నర్లను సా ధించింది. కానీ భారత డిఫెండర్లు, గోల్ కీపర్ సవితా అద్భుతంగా అడ్డుకట్ట వేశారు. రెండో క్వార్టర్స్‌లో మరింత అటాకింగ్‌కు దిగిన కివీస్ తొలి గోల్ సాధించింది. ఎండ్లు మారిన తర్వాత పుంజుకున్న భారత్ వరుసపెట్టి అవకాశాలను సృష్టించుకున్నా గోల్స్ మాత్రం చేయలేకపోయింది. నాలుగో క్వార్టర్స్‌లో కివీస్ ఏకంగా మూడు గోల్స్ చేసి గెలిచింది. -
సెమీస్‌లో భారత్
కౌలాలంపూర్: భారత మహిళల హాకీ జట్టు ఆసియా కప్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 2-0 గోల్స్ తేడాతో ఆతిథ్య మలేసియా జట్టును ఓడించింది. 39వ నిమిషంలో పూనమ్ రాణి, 46వ నిమిషంలో లిలీ చానూ ఒక్కో గోల్ చేసి టీమిండియా విజయాన్ని ఖాయం చేశారు. ఈ గెలుపుతో భారత్ గ్రూప్ ‘ఎ’లో ఆరు పాయింట్లతో రెండో స్థానంలో, తొమ్మిది పాయింట్లతో చైనా గ్రూప్ టాపర్‌గా నిలిచింది. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో దక్షిణ కొరియాతో భారత్; జపాన్‌తో చైనా తలపడతాయి. కనీసం ‘డ్రా’ చేసుకుంటే సెమీఫైనల్ స్థానాన్ని ఖాయం చేసుకునే పరిస్థితిలో భారత్‌కు ఆతిథ్య జట్టు గట్టిపోటీనే ఇచ్చింది. తొలి అర్ధభాగం వరకు గోల్స్ చేయనీకుండా నిలువరించింది. అయితే రెండో అర్ధభాగంలో భారత్ తమ దూకుడు పెంచింది. ఏడు నిమిషాల తేడాలో రెండు గోల్స్ సాధించింది. అనంతరం భారత్ పకడ్బందీగా ఆడుతూ మలేసియాకు ఖాతా తెరిచే అవకాశం ఇవ్వలేదు.