సెమీస్‌లో భారత్
కౌలాలంపూర్: భారత మహిళల హాకీ జట్టు ఆసియా కప్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 2-0 గోల్స్ తేడాతో ఆతిథ్య మలేసియా జట్టును ఓడించింది. 39వ నిమిషంలో పూనమ్ రాణి, 46వ నిమిషంలో లిలీ చానూ ఒక్కో గోల్ చేసి టీమిండియా విజయాన్ని ఖాయం చేశారు.
ఈ గెలుపుతో భారత్ గ్రూప్ ‘ఎ’లో ఆరు పాయింట్లతో రెండో స్థానంలో, తొమ్మిది పాయింట్లతో చైనా గ్రూప్ టాపర్‌గా నిలిచింది. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో దక్షిణ కొరియాతో భారత్; జపాన్‌తో చైనా తలపడతాయి. కనీసం ‘డ్రా’ చేసుకుంటే సెమీఫైనల్ స్థానాన్ని ఖాయం చేసుకునే పరిస్థితిలో భారత్‌కు ఆతిథ్య జట్టు గట్టిపోటీనే ఇచ్చింది. తొలి అర్ధభాగం వరకు గోల్స్ చేయనీకుండా నిలువరించింది. అయితే రెండో అర్ధభాగంలో భారత్ తమ దూకుడు పెంచింది. ఏడు నిమిషాల తేడాలో రెండు గోల్స్ సాధించింది. అనంతరం భారత్ పకడ్బందీగా ఆడుతూ మలేసియాకు ఖాతా తెరిచే అవకాశం ఇవ్వలేదు.