హాకీ ఇండియా...చలో టోక్యో... | Indian Men And Women Hockey Team Got Chance For Olympic | Sakshi
Sakshi News home page

హాకీ ఇండియా...చలో టోక్యో...

Published Sun, Nov 3 2019 3:07 AM | Last Updated on Sun, Nov 3 2019 3:07 AM

Indian Men And Women Hockey Team Got Chance For Olympic - Sakshi

భువనేశ్వర్‌: ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత పురుషుల, మహిళల హాకీ జట్లు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. శనివారం జరిగిన రెండో అంచె మ్యాచ్‌ల్లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి మ్యాచ్‌లో 5–1తో అమెరికాపై భారత మహిళల జట్టు విజయం సాధించగా... రెండో అంచె మ్యాచ్‌లో టీమిండియాకు 1–4తో ఓటమి ఎదురైంది. భారత్, అమెరికా చెరో మ్యాచ్‌లో నెగ్గడంతో... నిబంధనల ప్రకారం రెండు మ్యాచ్‌ల్లో సాధించిన మొత్తం గోల్స్‌ ఆధారంగా బెర్త్‌ ఎవరికి దక్కాలో నిర్ణయించారు. ఇక్కడ భారత్‌ 6–5 గోల్స్‌ తేడాతో అమెరికాపై పైచేయి సాధించి ‘టోక్యో’ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరోవైపు తొలి అంచె మ్యాచ్‌లో రష్యాపై 4–2తో నెగ్గిన భారత పురుషుల జట్టు రెండో అంచె మ్యాచ్‌లో మాత్రం విశ్వరూపం ప్రదర్శించింది. ఏకంగా 7–1 గోల్స్‌ తేడాతో రష్యాను చిత్తు చేసి ‘టోక్యో’ బెర్త్‌ను తమ ఖాతాలో వేసుకుంది. మొత్తం గోల్స్‌లోనూ భారత్‌దే 11–3తో పైచేయిగా నిలిచింది.

ఆదుకున్న రాణి రాంపాల్‌... 
తొలి అంచె మ్యాచ్‌లో అమెరికాను వణికించిన భారత మహిళల జట్టు రెండో మ్యాచ్‌లో మాత్రం తడబడింది. కనీసం నాలుగు గోల్స్‌ తేడాతో గెలిస్తేనే ‘టోక్యో’ బెర్త్‌ ఆశలు సజీవంగా ఉన్న పరిస్థితుల్లో అమెరికా ఆరంభం నుంచే ఎదురుదాడులు చేసింది. వారి దూకుడు ఫలితాన్నిచ్చింది. తొలి క్వార్టర్‌లో రెండు గోల్స్‌... రెండో క్వార్టర్‌లో మరో రెండు గోల్స్‌ చేసి 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్‌లో అమెరికాను నిలువరించిన భారత్‌ ఇంకో గోల్‌ను సమర్పించుకోలేదు.

అప్పటికి మొత్తం గోల్స్‌ సంఖ్య (రెండు మ్యాచ్‌లవి కలిపి) 5–5తో సమఉజ్జీగా ఉంది. నాలుగో క్వార్టర్‌ మొదలైన మూడో నిమిషంలో అమెరికా ‘డి’ రక్షణ వలయంలో లభించిన సువర్ణావకాశాన్ని భారత కెప్టెన్‌ రాణి రాంపాల్‌ వదులుకోలేదు. కళ్లు చెదిరే షాట్‌తో బంతిని లక్ష్యానికి చేర్చిన రాణి రాంపాల్‌ భారత్‌ ఖాతాలో గోల్‌ చేర్చింది. దాంతో మొత్తం గోల్స్‌ సంఖ్యలో భారత్‌ 6–5తో ఆధిక్యంలోకి వచ్చింది. చివరి 12 నిమిషాల్లో అమెరికా దాడులను సమర్థంగా నిలువరించిన భారత మహిళల బృందం మ్యాచ్‌లో ఓడిపోయినా ‘టోక్యో’ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఒలింపిక్స్‌ క్రీడలకు భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించడం ఇది మూడోసారి (1980, 2016) మాత్రమే.

మహిళల విభాగం
భారత్‌ 1
►రాణి రాంపాల్‌ (48వ ని.లో) 
అమెరికా  4
►అమండా మగాడాన్‌ (5వ ని.లో) 
►కాథ్లీన్‌ షార్కీ (14వ ని.లో) 
►అలీసా పార్కర్‌ (20వ ని.లో) 
►అమండా మగాడాన్‌ (28వ ని.లో)

పురుషుల విభాగం
భారత్‌ 7
►లలిత్‌ ఉపాధ్యాయ్‌(17వ ని.లో) 
►ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (23వ ని.లో) 
►ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (27వ ని.లో) 
►నీలకంఠ శర్మ (47వ ని.లో)
►రూపిందర్‌ సింగ్‌ (48వ ని.లో)
►రూపిందర్‌ సింగ్‌ (59వ ని.లో)
►అమిత్‌ రోహిదాస్‌ (60వ ని.లో)

రష్యా 1
►సబోలెవ్‌స్కీ (1వ ని.లో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement