Harendra Singh
-
హాకీ కోచ్ హరేంద్ర సింగ్‌పై వేటు
న్యూఢిల్లీ:భారత సీనియర్ పురుషుల హాకీ జట్టు చీఫ్ కోచ్ పదవి నుంచి హరేంద్ర సింగ్‌ను తప్పించారు. సొంతగడ్డపై జరిగిన ప్రపంచ కప్‌లో భారత జట్టు సెమీఫైనల్ చేరడంలో విఫలం కావడమే అందుకు కారణం. హరేంద్ర స్థానంలో కొత్త కోచ్ ఎంపిక కోసం హాకీ ఇండియా దరఖాస్తులు కూడా కోరింది. వరల్డ్ కప్‌లో గ్రూప్ దశలో టాపర్‌గా నిలిచిన భారత్... క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. మ్యాచ్‌లో పరాజయం అనంతరం మేం 13 మందితో తలపడ్డామంటూ రిఫరీలకు వ్యతిరేకంగా హరేంద్ర చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 2018 మే నుంచి హరేంద్ర కోచ్‌గా వ్యవహరించారు. గత పాతికేళ్లలో హాకీ సమాఖ్య తప్పించిన 25వ కోచ్ హరేంద్ర కావడం విశేషం. అయితే హరేంద్రను గతంలో పని చేసిన విధంగా జూనియర్ హాకీ జట్టు బాధ్యతలు అప్పగించారు. -
ఆ గందరగోళం పోయింది
న్యూఢిల్లీ: విదేశీ కోచ్‌ల భాషతో ఇబ్బంది ఉండేదని... మ్యాచ్ విరామ సమయాల్లో వారు ఇచ్చే సూచనలు అర్థం చేసుకోవడానికి చాలా కష్ట పడాల్సి వచ్చేదని భారత హాకీ జట్టు సీనియర్ ఆటగాళ్లు సర్దార్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మే నుంచి భారత పురుషుల హాకీ జట్టుకు హరేంద్ర సింగ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి భాష ఇబ్బందులు తొలగిపోయాయని ఇప్పుడు కోచ్ చెప్పే విషయంపై దృష్టి పెడితే సరిపోతోందని... దాన్ని అనువదించుకోవాల్సిన పనిలేకుండా పోయిందని అన్నారు. ‘హరేంద్రతో 16 ఏళ్ల క్రితం నుంచే పరిచయం ఉంది. ఆయనతో ఏ విషయాన్నైనా చర్చించే అవకాశం ఉంటుంది. విదేశీ కోచ్‌లు ఉంటే మ్యాచ్ మధ్య లభించే రెండు నిమిషాల విరామ సమయాల్లో వారు చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టేది. ఒక్కోసారి సరిగ్గా అర్థంకాక గందరగోళానికి గురయ్యే వాళ్లం. స్వదేశీ కోచ్ ఆధ్వర్యంలో ఆడటంతో ఆ తేడా స్పష్టమవుతోంది’ అని సర్దార్ సింగ్ తెలిపారు. ‘ఆటగాళ్ల బలాబలాల విషయంలో హరేంద్రకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన ప్లేయర్ల ఆటతీరును మార్చుకోమని చెప్పడు... చిన్న చిన్న సర్దుబాట్లతో వారిని మరింత రాటుదేలేలా చేస్తారు’ అని మన్‌ప్రీత్ పేర్కొన్నాడు. ఈ నెల 18 నుంచి జకార్తా వేదికగా జరుగనున్న ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గాలనే ధృడ సంకల్పంతో భారత జట్టు ప్రాక్టీస్ కొనసాగిస్తోంది. ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిస్తే 2020 (టోక్యో) ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందనుంది. -
పురుషుల హాకీ కోచ్‌గా హరేంద్ర
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ) భారత జట్ల కోచ్‌లను పరస్పరం మార్చేసింది. మహిళల కోచ్ హరేంద్ర సింగ్‌ను పురుషుల జట్టుకు నియమించగా, పురుషుల కోచ్ జోయర్డ్ మరీనేకు మళ్లీ మహిళల బాధ్యతలు అప్పగించింది. గతంలో మరీనే మహిళల జట్టుకు శిక్షణ ఇచ్చారు. గోల్డ్ కోస్ట్‌లో ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పురుషుల జట్టు పతకం గెలవడంలో విఫలం కావడంతో హెచ్ఐ ఈ నిర్ణయం తీసుకుంది. మరీనే శిక్షణలో నిరాశపరిచిన మన్‌ప్రీత్ సేన ఐదో స్థానంలో నిలిచింది. 2006 కామన్వెల్త్ తర్వాత పతకం లేకుండా రావడం ఇదే మొదటిసారి. మరోవైపు మహిళల జట్టు కూడా పతకం గెలవకపోయినా... నాలుగో స్థానం పొందింది. అయితే హరేంద్రకు పురుషుల జట్టును విజయవంతంగా నడిపించిన అనుభవముంది. 2009 నుంచి 2011 వరకు ఆయన కోచ్‌గా సేవలందించారు. రెండేళ్ల క్రితం 2016లో జూనియర్ ప్రపంచకప్‌లో భారత యువ జట్టు టైటిల్ గెలవడంతో కీలకపాత్ర పోషించారు. ఆయన మార్గదర్శనంలోనే గతేడాది జపాన్‌లో జరిగిన ఆసియా కప్‌లో మహిళల జట్టు విజేతగా నిలిచింది. మహిళల జట్టుతో తన పయనం సానుకూలంగా సాగిందని ఇప్పుడు పురుషుల జట్టు బాధ్యతలు అప్పగించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు హరేంద్ర చెప్పారు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో ఉన్న మరీనే తిరిగి మహిళల జట్టుకు రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచకప్‌కు జట్టును సన్నద్ధం చేస్తానని తెలిపారు. -
ఇది ఆరంభమే...
హరేంద్ర సింగ్... భారత హాకీలో మేటి కోచ్. బాధ్యతలు తీసుకుంటే పట్టుదలతో పని చేస్తారు. ఫలితాల్ని అందిస్తారు. ఆయన కోచింగ్‌లోనే జూనియర్ ప్రపంచకప్‌లో భారత్ చాంపియన్ అయింది. తాజాగా ఆయన పర్యవేక్షణలోనే ఆసియా కప్ మహిళల ఈవెంట్లో ట్రోఫీని గెలుచుకుంది. ప్రపంచకప్ బెర్త్‌ను సాధించింది. న్యూఢిల్లీ: అవకాశమిచ్చినప్పుడల్లా అద్భుతాలు చేయడం హరేంద్ర సింగ్‌కు అలవాటే. కోచింగ్‌లో విశేష అనుభవజ్ఞుడైన హరేంద్ర ఇప్పుడు కూడా సరిగ్గా అదే పని చేశారు. 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల జట్టుకు ఆసియా కప్‌ను అందించారు. కుర్రాళ్లకు జూనియర్ ప్రపంచకప్, అమ్మాయిలకు ఆసియా ట్రోఫీని అందించిన హరేంద్రకు విజయాల దాహం ఇంకా తీరనట్లుంది. ‘ఆసియా’ కేవలం పునాదేనని మరిన్ని విజయాలు ముందున్నాయని తన లక్ష్యాల్ని చెప్పకనే చెబుతున్నారు. మెగా ఈవెంట్లపై దృష్టి... భారత హాకీకి వచ్చే ఏడాది చాలా కీలకం. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్, ప్రపంచకప్‌లాంటి మెగా ఈవెంట్లున్నాయి. ఈ మూడింటిలో కనీసం రెండు పతకాలైనా సాధించాలనేదే నా లక్ష్యం. క్రీడల్లో అసాధ్యమనేదే లేదు. సుదీర్ఘ కాలం పురుషుల జట్టుకు సేవలందించిన నాకు మహిళల టీమ్‌ను మేటి జట్టుగా మలచడం కూడా తెలుసు. మహిళల జట్టులో ప్రతిభకు కొదవలేదు. ఏదైనా సాధించగలరనేది ఇప్పుడు చేతల్లో చూపారు. వేటికవే భిన్నం... ఓ కోచ్‌గా నాకు ప్రతీ టోర్నీ ముఖ్యమైనదే. కుర్రాళ్ల జూనియర్ ప్రపంచకప్ టైటిల్, అమ్మాయిల ఆసియా కప్ విజయం... ఈ రెండు భిన్నమై నవి. వీటిని పోల్చడం తగదు. ప్రపంచకప్ కోసం కుర్రాళ్లతో మూడేళ్లు పనిచేశాను. అదే ‘ఆసియా’ కోసం 23, 24 రోజులు శ్రమించా. ఈ రెండు సంతృప్తినిచ్చినప్పటికీ... ఈ విజయాలతో ఆగిపోను. మెరిట్‌తోనే బెర్త్... దయతో కాదు... మన అమ్మాయిలు ఫైనల్లో చైనాను ఓడించి టైటిల్‌ను గెలిచారు. మెరిట్‌తోనే ప్రపంచకప్ బెర్త్‌ను సాధించారు. ఇంకొకరి దయతోనూ, మరో జట్టు వైఫల్యంతోనూ అర్హత పొందలేదు. స్వతహాగా సాధించిన బెర్త్ ఇది. ఈ ఉత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని టైటిళ్లు గెలిచే ఆత్మవిశ్వాసం లభించినట్లయింది. ఏ పతకమైనా ఓకే... వచ్చే ఏడాది మూడు మేటి ఈవెంట్లలో (కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, వరల్డ్ కప్) మనం పతకం సాధించే అవకాశాల్ని కొట్టిపారేయలేం. ఏ పతకమొచ్చినా సంతోషమే. రంగు (పసిడి, రజతం, కాంస్యం) ఏదనేది బరిలోకి దిగాక అమ్మాయిలే నిర్ణయిస్తారు. ఏదైనా సాధించగలమని నిరూపిస్తారు. రూ లక్ష చొప్పున హెచ్ఐ నజరానా హాకీ ఇండియా (హెచ్ఐ) ఆసియా కప్ విజేతలకు నజరానా ప్రకటించింది. 18 మంది సభ్యులుగల మహిళల జట్టులో ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున, కోచ్ హరేంద్రకు రూ. లక్ష, ఇతర సహాయక సిబ్బందికి రూ. 50 వేల చొప్పున ఇవ్వనుంది. మొదటిసారి టాప్–10లోకి... భారత మహిళల జట్టు ర్యాంక్‌లోనూ రెండు స్థానాలు పురోగతి సాధించింది. ప్రపంచ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టీమిండియా తొలిసారి టాప్–10లోకి దూసుకొచ్చింది. పురుషుల జట్టు నిలకడగా ఆరో స్థానంలోనే ఉంది. -
ప్రపంచ కప్ వెనుక ఎవరున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: హాకీ జూనియర్ ప్రపంచకప్ విజేతగా భారత్ నిలవడం వెనుక ఓ వ్యక్తి అమోఘ కృషి, పట్టుదల ఉన్నాయనే మీకు తెలుసా? గతంలో తాను ఎంచుకున్న క్రీడలో విఫలమైన ఆ క్రీడాకారుడి బోధనలే భారత్‌కు హాకీ జూనియర్ అండర్-21 ప్రపంచ కప్‌ను అందించాయంటే ఎంతమంది నమ్మగలరు? కానీ, ఇది నమ్మి తీరాల్సిందే. భారత్ హాకీ జూనియర్ టీంకు శిక్షకుడిగా పనిచేసిన హరేంద్ర సింగ్ ఒక హాకీ ప్లేయర్. జాతీయ టీంకు ఎంపిక చేయకుండా పక్కకు పడేసిన ఓ క్రీడాకారుడు. ఆ సమయంలో తాను ఎంత కుమిలిపోయి ఉన్నాడనే విషయం తాజాగా అతడి మాటలే చెబుతున్నాయి. సాధారణంగా జట్టు విజయం సాధించిన వెంటనే క్రీడాకారులును ప్రశ్నించిన మీడియా అనంతరం కోచ్ హరేంద్ర సింగ్‌ను ప్రశ్నించింది. ఆ సమయంలో అతడి కళ్లు చెమ్మగిల్లాయి. అంతే కాదు అతడి చెంపల మీదుగా ఆ కన్నీళ్లు దారగా కారాయి. ఈ విజయం వెనుక మీరే ఉండటం ఒక క్రీడాకారుడిగా, కోచ్‌గా ఎలా భావిస్తున్నారని ప్రశ్నించగా. తన గత స్మృతులు చెప్పారు. తాను ఒక క్రీడాకారుడినని, కసిగా ఆడేవాడినని, ఒకప్పుడు జాతీయ టీంకు ఎంపికచేయకుండా పక్కకు పెట్టారని అన్నారు. అప్పుడే తనకు తాను బోధించుకున్నానని, అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయగలనన్న ఆత్మ విశ్వాసంతో 1998లో కోచ్‌గా కెరీర్ ప్రారంభించానని చెప్పాడు. ‘ఆరోజే నేను నా అంతరాత్మకు చెప్పుకున్నాను. నేను ఒలింపియన్‌ను కాకపోవచ్చు.. కానీ నేను ఒలింపియన్లను, ప్రపంచ చాంపియన్లను తయారు చేయగలనని.. దేశాన్ని గర్వంగా తలెత్తుకునేలా చేయగలనని. ఈ రోజు భారత త్రివర్ణ పతాకం ప్రపంచ కప్పు విజయంతో మరింత ఎత్తులో రెపరెపలాడుతోంది. ఈ క్షణం కోసం నేను ఎదురుచూశాను. ప్రపంచ కప్ భారత్ ఎలాగైనా తన శిక్షణతో గెలవాలని 22 ఏళ్ల జీవితాన్ని శిక్షణకే కేటాయించాను. అది నేడు ఆవిష్కృతమైంది’ అని ఆయన చెప్పారు. బెల్జియంపై 2-1తేడాతో భారత్ జూనియర్ హాకీ టీం విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 15 ఏళ్ల నిరీక్షణకు ఈ విజయంతో తెరపడింది. వీరేంద్ర సెహ్వాగ్ అభినందనలు హాకీ జూనియర్ ప్రపంచ కప్ సాధించిన యువ క్రీడాకారులకు ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభినందనలు తెలియజేశారు. వారు దేశం గర్వించేలా చేశారని, ఇది నిజంగా చాలా గొప్ప విజయం అని అభివర్ణిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘ఎంజాయ్ ది బెల్జియం చాకోలెట్ బాయ్స్’ అంటూ ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. -
ఫేస్ బుక్ పోస్ట్ అతడి జీవితాన్నే మార్చేసింది..
నోయిడా: ఓ ఐడియా జీవితాన్నే మార్చేసినట్లు...ఓ బాలుడికి సోషల్ మీడియా ఫేస్ బుక్ చేసిన సాయం అంతా ఇంతా కాదు. ఓ ప్రయాణికుడు చేసిన ఒక ఫేస్ బుక్ పోస్టు ఆ బాలుడి పాలిట వరంగా మారింది. అతడికి సహాయం చేయాలంటూ చేసిన విన్నపం ఏకంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను చేరింది. వివరాల్లోకి వెళితే... 13 ఏళ్ల హరేంద్రసింగ్ నోయిడాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అనుకోకుండా ఆర్థిక సమస్యలు తలెత్తడంతో నోయిడాలోని మెట్రో స్టేషన్లో బరువు కొలిచే యంత్రం పక్కన పెట్టుకొని, స్ట్రీట్ ల్యాంప్ కింద కూర్చొని హోం వర్క్ చేసుకునే వాడు. ఆ దారిలో ఎవరైనా బరువు తెలుసుకోవాలనుకునే వాళ్లు అక్కడికి వచ్చి చిల్లర వేసి బరువు కొలుచుకునే వాళ్లు. అలా వచ్చిన డబ్బుతో పుస్తకాలు,పెన్నులు, చదువుకోవడానికి అవసరమైన సామగ్రిని కొనుక్కునే వాడు. నోయిడాకి చెందిన వికాస్ షర్ధా అనే ప్రయాణికుడు ఒక రోజు స్టేషన్ నుంచి బయటకి వస్తున్నసమయంలో ఆ అబ్బాయిని చూశాడు. వెంటనే ఫోటో తీసి... 'ఎవరైతే నోయిడా మెట్రో స్టేషన్ గుండా రాత్రి 7 గంటల తర్వాత ప్రయాణాలు చేస్తారో..వాళ్లు ఆ బాలుని దగ్గర బరువు చూసుకుని అతని చదువు కోసం సహాయం చేయండి... దయచేసి అతడిని ఎవరూ అడుక్కునే వాడిలా చూడకండి..అంటూ' ఫేస్ బుక్ లో షేర్ చేశాడు. అంతే.. ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చివరికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలే యాదవ్ దృష్టిలో హరేంద్రసింగ్ పడ్డాడు. అతనికి ఐదు లక్షల ఆర్థిక సహాయంతో పాటూ చదువుకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. 'జూన్‌లో మానాన్న ఉద్యోగాన్ని కోల్పోయారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గత నెలన్నర నుంచి నోయిడా మెట్రో స్టేషన్‌కు రాత్రి 7 గంటకు వచ్చి కొంత డబ్బును సంపాదిస్తున్నాను. అలా వచ్చిన డబ్బుతో చదువుకోవడానికి అవసరమయ్యే స్టేషనరీ సమాన్లు కొనుక్కుంటున్నాను' అని హరేంద్రసింగ్ చెప్పాడు. రోజు రూ. 70 లేదా అప్పడప్పుడు అంతకన్నా తక్కువగా వచ్చేవని తెలిపాడు. అతని సమస్య గురించి అందరికీ తెలిసేలా ఫోటో తీసి షేర్ చేసినందుకు వికాస్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.