ప్రపంచ కప్ వెనుక ఎవరున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: హాకీ జూనియర్ ప్రపంచకప్ విజేతగా భారత్ నిలవడం వెనుక ఓ వ్యక్తి అమోఘ కృషి, పట్టుదల ఉన్నాయనే మీకు తెలుసా? గతంలో తాను ఎంచుకున్న క్రీడలో విఫలమైన ఆ క్రీడాకారుడి బోధనలే భారత్‌కు హాకీ జూనియర్ అండర్-21 ప్రపంచ కప్‌ను అందించాయంటే ఎంతమంది నమ్మగలరు? కానీ, ఇది నమ్మి తీరాల్సిందే. భారత్ హాకీ జూనియర్ టీంకు శిక్షకుడిగా పనిచేసిన హరేంద్ర సింగ్ ఒక హాకీ ప్లేయర్. జాతీయ టీంకు ఎంపిక చేయకుండా పక్కకు పడేసిన ఓ క్రీడాకారుడు. ఆ సమయంలో తాను ఎంత కుమిలిపోయి ఉన్నాడనే విషయం తాజాగా అతడి మాటలే చెబుతున్నాయి.
సాధారణంగా జట్టు విజయం సాధించిన వెంటనే క్రీడాకారులును ప్రశ్నించిన మీడియా అనంతరం కోచ్ హరేంద్ర సింగ్‌ను ప్రశ్నించింది. ఆ సమయంలో అతడి కళ్లు చెమ్మగిల్లాయి. అంతే కాదు అతడి చెంపల మీదుగా ఆ కన్నీళ్లు దారగా కారాయి. ఈ విజయం వెనుక మీరే ఉండటం ఒక క్రీడాకారుడిగా, కోచ్‌గా ఎలా భావిస్తున్నారని ప్రశ్నించగా. తన గత స్మృతులు చెప్పారు. తాను ఒక క్రీడాకారుడినని, కసిగా ఆడేవాడినని, ఒకప్పుడు జాతీయ టీంకు ఎంపికచేయకుండా పక్కకు పెట్టారని అన్నారు. అప్పుడే తనకు తాను బోధించుకున్నానని, అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయగలనన్న ఆత్మ విశ్వాసంతో 1998లో కోచ్‌గా కెరీర్ ప్రారంభించానని చెప్పాడు.
‘ఆరోజే నేను నా అంతరాత్మకు చెప్పుకున్నాను. నేను ఒలింపియన్‌ను కాకపోవచ్చు.. కానీ నేను ఒలింపియన్లను, ప్రపంచ చాంపియన్లను తయారు చేయగలనని.. దేశాన్ని గర్వంగా తలెత్తుకునేలా చేయగలనని. ఈ రోజు భారత త్రివర్ణ పతాకం ప్రపంచ కప్పు విజయంతో మరింత ఎత్తులో రెపరెపలాడుతోంది. ఈ క్షణం కోసం నేను ఎదురుచూశాను. ప్రపంచ కప్ భారత్ ఎలాగైనా తన శిక్షణతో గెలవాలని 22 ఏళ్ల జీవితాన్ని శిక్షణకే కేటాయించాను. అది నేడు ఆవిష్కృతమైంది’ అని ఆయన చెప్పారు. బెల్జియంపై 2-1తేడాతో భారత్ జూనియర్ హాకీ టీం విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 15 ఏళ్ల నిరీక్షణకు ఈ విజయంతో తెరపడింది.
వీరేంద్ర సెహ్వాగ్ అభినందనలు
హాకీ జూనియర్ ప్రపంచ కప్ సాధించిన యువ క్రీడాకారులకు ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభినందనలు తెలియజేశారు. వారు దేశం గర్వించేలా చేశారని, ఇది నిజంగా చాలా గొప్ప విజయం అని అభివర్ణిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘ఎంజాయ్ ది బెల్జియం చాకోలెట్ బాయ్స్’ అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.