Tokyo Olympics : India women hockey team enters semifinals - Sakshi
Sakshi News home page

Tokyo Olympics: వస్తూ.. వస్తూ కొంచెం బంగారం తీసుకురండి!

Published Mon, Aug 2 2021 11:20 PM | Last Updated on Tue, Aug 3 2021 1:10 PM

Tokyo Olympics: India Create History Beat Australia To Reach Semifinals In Women's Hockey - Sakshi

దేశంలో కోలాహలంగా ఉంది. ఒలింపిక్స్‌లో ఇండియన్‌ విమెన్‌ హాకీ టీమ్‌
ఆస్ట్రేలియాను ఓడించి సెమీ ఫైనల్స్‌కు వెళ్లి చరిత్ర సృష్టించింది.
ఆగస్టు 4న అర్జంటీనాతో సెమిస్‌లో గెలిస్తే అది మరో చరిత్ర.
కాని ఇదంతా జరగక ముందే  ఇలాంటిది ఒకటి సినిమాలో జరిగింది.
‘చక్‌ దే ఇండియా’లో రీల్‌ విమెన్‌ టీమ్‌ ఆస్ట్రేలియా మీద గెలిచి వరల్డ్‌ కప్‌ సాధిస్తుంది.
ఇప్పుడు ఆ రీల్‌ టీమ్‌ తారలు  రియల్‌ టీమ్‌ను అభినందిస్తున్నారు. అంతేనా?
రీల్‌ టీమ్‌ కోచ్‌ షారూక్‌ ఖాన్‌ రియల్‌ కోచ్‌ను 
‘సరే సరే.. వస్తూ వస్తూ కాసింత బంగారం తెండి’
అని ‘మాజీ కోచ్‌’ హోదాలో కోరాడు. అసలు ఇదంతా ఎంత సందడో కదా.

మొత్తం 16 మంది ప్లేయర్లు. ఒక ప్రాంతం కాదు. ఒక భాష కాదు. ఒక భౌతిక, మానసిక స్థితి కాదు. ఒకే రకమైన ఆట కాదు. కదలికా కాదు. కాని ఒలింపిక్స్‌ కోసం టోక్యోలో క్వార్టర్‌ ఫైనల్స్‌లో నిన్న (ఆగస్టు 2న) శక్తిమంతమైన (ప్రపంచ 3వ ర్యాంకు) ఆస్ట్రేలియా జట్టు పై పోటీకి దిగినప్పుడు వాళ్లందరి కళ్ల ముందు ఒకే దృశ్యం కనపడుతూ వచ్చింది. 

అది దేశ జాతీయ పతాకం భారత క్రీడా ఆకాంక్ష భారత ప్రజలు ఆశిస్తున్న విశ్వ క్రీడా గుర్తింపు. 
అందుకే విమెన్‌ హాకీ టీమ్‌ పట్టుదలగా, అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించింది. 19 ఏళ్ల  నుంచి 31 ఏళ్ల వరకూ రకరకాల వయసుల్లో ఉన్న ఈ మహిళా ప్లేయర్లు తమ చురుకుదనాన్ని, అనుభవాన్ని సంయమనం చేసుకుంటూ 160 గ్రాముల హాకీ బాల్‌ మీద 130 కోట్ల మంది భారతీయులు పెట్టిన భారాన్ని ఒడుపుగా బ్యాట్‌తో నెడుతూ విజయం అనే లక్ష్యానికి చేర్చారు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 1980 ఒలిపింక్స్‌లో మన మహిళా జట్టు విశ్వ వేదిక మీద అలాంటి ప్రదర్శన ఇచ్చింది. ఇన్నాళ్లకు మళ్లీ ఇప్పుడు. క్రీడలంటే పురుషుల గుత్త సొత్తు కాదు... మాది... క్రీడాకాశంలో మేము సగం అని మన మహిళా క్రీడాకారులు ఎలుగెత్తి చాటిన సందర్భం ఇది. చరిత్రాత్మక సందర్భం. పతకాల కంటే కూడా ప్రయత్నమే గొప్పగా వీరు మనసుల్ని గెలుచుకున్నారు. అయితే ఇదంతా ‘డెజావూ’గా ఉంది కొందరికి. కారణం ఇలాంటి విజయాన్ని ఇదివరకే భారతీయులు చూడటం వల్లే. కాకుంటే వెండితెర మీద. ‘చక్‌ దే ఇండియా’ సినిమాలో. అందుకే ఆ సినిమాలో పని చేసినవారూ, చూసిన వారూ ఇప్పుడా సినిమాను గుర్తు చేసుకుంటున్నారు.

చక్‌ దే ఇండియా
2007లో ‘చక్‌ దే ఇండియా’ వచ్చింది. అంతవరకూ క్రికెట్‌దే రాజ్యంగా, క్రికెట్‌ నేపథ్య సినిమాలే ప్రధానంగా వస్తుంటే చక్‌ దే.. వచ్చి హాకీని తెర మీదకు తెచ్చింది. అదీ మహిళా హాకీని. ‘ఎందుకు మహిళా హాకీని ఇంత చిన్న చూపు చూస్తారు. వారి గొప్పతనం తెలిపే సినిమా తీయాలి’ అని దర్శకుడు షిమిత్‌ అమిన్‌ అనుకోవడంతో ఈ సినిమా సాధ్యమైంది. 2002 కామన్‌వెల్త్‌ క్రీడల్లో, 2004 ఆసియా కప్‌లో భారత మహిళా హాకీ అద్భుతమైన ప్రతిభ చూపడమే ఇందుకు కారణం. అదీ కాక మన ప్రేక్షకులకు క్రికెట్‌ తెలిసినంతగా హాకీ తెలియదు. హాకీ ఆటలో ఉండే మెళకువలు, కఠోర సాధన, సాటి వారి నుంచి ఎదురయ్యే సవాళ్లు ముఖ్యంగా మహిళా ప్లేయర్లకు ఎలా ఉంటాయో చూపుతూ ఈ సినిమా తీయాలని నిశ్చయించుకున్నారు. ఇందులో కోచ్‌గా షారూక్‌ ఖాన్‌ నటించడానికి అంగీకరించడంతో గ్లామర్‌ యాడ్‌ అయ్యింది.

నిజ జీవిత పాత్రలతో
మహిళా హాకీకి కోచ్‌గా ఉన్న మహరాజ్‌ క్రిషన్‌ కౌశిక్‌ను కలిసిన దర్శకుడు షిమిత్‌ ఆటను సినిమాగా రాసుకోవడమే కాదు మరో హాకీ కోచ్‌ మిర్‌ రంజన్‌ నెగి గురించి తెలుసుకున్నాడు. 1982 ఆసియన్‌ గేమ్స్‌లో పాకిస్తాన్‌తో ఆడిన మేచ్‌లో ఇండియా ఘోరంగా ఓడిపోయింది. ఆ మేచ్‌కు గోల్‌ కీపర్‌గా వ్యవహరించిన నేగి మొహం చెల్లక అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు అజ్ఞాతం వీడి మహిళా జుట్టుకు గోల్‌కీపింగ్‌లో శిక్షణ ఇచ్చి విజయబాటలో నడిపాడు. ఇతని పాత్రే షారుక్‌ఖాన్‌ పాత్రకు ఇన్‌స్పిరేషన్‌. అదొక్కటే కాదు క్రీడాకారుల్లో ఉండే ఇగో, భాషాభేదం, ప్రాంతీయభేదం... వీటన్నింటిని దాటి కోచ్‌లు ఆ టీమ్‌ని ఏకతాటిపై ఎలా తీసుకువస్తాడో కూడా సినిమాలో చూపడం వల్ల ప్రేక్షకులకు నచ్చింది.

రీల్‌ టీమ్‌ తబ్బిబ్బు
సినిమాలో ఆస్ట్రేలియా టీమ్‌పై గెలిచినట్టే ఇప్పుడు ఒలింపిక్స్‌లో మన జట్టు ఆస్ట్రేలియా జట్టుపై గెలవడంతో చక్‌ దే..లో పని చేసిన తారలు సంతోషంతో ట్వీట్లు చేస్తున్నారు. చక్‌దేలో కెప్టెన్‌గా నటించిన విద్య మలవడె ‘ఉదయం నించి నా ఫోన్‌ మోగుతూనే ఉంది. నేను తెర మీదే గెలిచాను. వీరు నిజంగా గెలిచారు. చరిత్ర సృష్టించారు’ అని ఇన్‌స్టాలో రాసింది. మరోనటి సాగరిక ఘాటే కూడా ఇలాగే సంతోషం పంచుకుంది. ఇక షారూక్‌ ఖాన్‌ ఏకంగా ‘మాజీ కోచ్‌’నంటూ రంగంలో దిగి సంతోషం పంచుకున్నాడు. 
‘సరే సరే.. వస్తూ వస్తూ కొంచెం బంగారం తీసుకురండి. ధన్‌తేరస్‌ కూడా ముందుంది. 
– మాజీ కోచ్‌ కబీర్‌ఖాన్‌’

అని ట్వీట్‌ చేశాడు. దానికి రియల్‌ కోచ్‌ మరిజ్నే స్పందిస్తూ ‘మీ సపోర్ట్‌కు కృతజ్ఞతలు. మేము మా సర్వస్వాన్ని ఒడ్డుతాము. ఇట్లు రియల్‌ కోచ్‌’ అని సమాధానం ఇచ్చాడు. ఈ దేశం మర్యాదను నిలబెట్టే పని మహిళా ప్లేయర్లే చేస్తున్నారు. అలాగని మగవారి శ్రమ తక్కువది కాదు. స్త్రీ, పురుషులు కలిసి భారత క్రీడా పతాకాన్ని రెపరెపలాడించడమేగా కావలసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement