నేడు ఆసియా కప్ హాకీ ఫైనల్ | Today, Asia Cup Hockey Final | Sakshi
Sakshi News home page

నేడు ఆసియా కప్ హాకీ ఫైనల్

Published Sun, Sep 1 2013 1:53 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM

నేడు ఆసియా కప్ హాకీ ఫైనల్

నేడు ఆసియా కప్ హాకీ ఫైనల్

సా.గం. 5.30 నుంచి
 స్టార్ క్రికెట్‌లో ప్రత్యక్ష ప్రసారం
 
 ఇపో (మలేసియా): పరిష్కారం లభించని సమాఖ్య వివాదాలు... ఆటగాళ్ల పేలవ ప్రదర్శనతో అంతకంతకూ దిగజారుతున్న ప్రతిష్ట... మధ్యలో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆకట్టుకున్నా... మిగతా ఈవెంట్లలో మళ్లీ నిరాశే. క్లుప్తంగా చెప్పాలంటే ప్రస్తుతం భారత హాకీ జట్టు పరిస్థితి ఇది.
 
  ఇలాంటి నేపథ్యంలో బరిలోకి దిగిన యువ జట్టు దుమ్మురేపే ఆటతో ఆసియా కప్ టైటిల్ పోరుకు దూసుకుపోయింది. ఆదివారం ఇక్కడ జరిగే ఫైనల్లో పటిష్టమైన దక్షిణ కొరియాతో అమీతుమీ తేల్చుకోనుంది. 2007 చెన్నైలో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచిన భారత జట్టు ఆ తర్వాత ఘోరంగా విఫలమైంది. గతేడాది టోర్నీలో ఏడో స్థానంలో నిలిచిన భారత్‌కు ఈసారి కప్ గెలిచే సువర్ణావకాశం దక్కింది.
 
 టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియా సూపర్ ఫామ్‌లో ఉంది. అనుభవం లేకున్నా నిలకడైన ఆటతీరుతో కుర్రాళ్లు అదరగొడుతున్నారు. లీగ్ దశలోనే కొరియాపై 2-0తో గెలవడం జట్టులో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతోంది. ఈ టోర్నీలో ప్రత్యర్థులపై 21 గోల్స్ చేసిన భారత్ ఒకే ఒక్క గోల్‌ను సమర్పించుకుంది. చాలాకాలం నుంచి వేధిస్తున్న డిఫెన్స్ సమస్యకు ఈ టోర్నీలో కాస్త పరిష్కారం లభించింది. బ్యాక్‌లైన్‌లో వీఆర్ రఘునాథ్, రూపిందర్‌పాల్ సింగ్, కొతాజిత్ సింగ్, గుర్మెల్ సింగ్, బీరేంద్ర లక్రాల బృందం అడ్డుగోడలా నిలుస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. గోల్ కీపర్ శ్రీజేష్ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. డ్రాగ్‌ఫ్లిక్స్‌లో రఘునాథ్, రూపిందర్ అదనపు బాధ్యతలు తీసుకుంటున్నారు. మిడ్‌ఫీల్డ్‌లో కెప్టెన్ సర్దారాకు తోడుగా మన్‌ప్రీత్, చింగ్లెన్‌సనా, ఉతప్పలు చక్కని సహకారాన్ని అందిస్తున్నారు. యువ ఫార్వర్డ్‌లైన్‌లో మన్‌దీప్ ఆకట్టుకుంటున్నాడు.
 
  ఇప్పటికే నాలుగు గోల్స్ చేసిన అతను మరోసారి విజృంభిస్తే కొరియాకు కష్టాలు తప్పవు. నితిన్ తిమ్మయ్య, మలక్ సింగ్‌లు కూడా విశేషంగా రాణిస్తుండటం భారత్‌కు లాభిస్తోంది. అయితే జట్టులో ప్రస్తుతం నెలకొన్న ఆత్మ విశ్వాసం...అతి విశ్వాసంగా మారితే ప్రమాదకరమైన కొరియా నుంచి ముప్పు తప్పదు. ఆసియా కప్ గెలిస్తే జట్టుపై మళ్లీ నమ్మకం ఏర్పడుతుందని కెప్టెన్ సర్దారా ఆశాభావం వ్యక్తం చేశాడు.
 
 మరోవైపు కొరియా ప్రతీకారమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఏ ఒక్క అవకాశం లభించినా ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థులు జట్టులో ఉండటం అదనపు బలం. ఓ రకంగా చూస్తే భారత్‌తో పోలిస్తే అన్ని రంగాల్లో కొరియాదే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. డిఫెన్సివ్‌గా ఆడుతూ భారత్‌ను దెబ్బకొట్టాలని వ్యూహం రచిస్తోంది.  
 
 గెలిస్తే... నేరుగా
 ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే... వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. లేదంటే నవంబర్‌లో ఓసియానియా కప్ ముగిసే వరకు వేచి చూడాలి. సెమీస్‌లో మలేసియాను ఓడించిన భారత్‌కు దాదాపుగా వరల్డ్‌కప్ బెర్త్ ఖరారైనా మరికొన్ని మ్యాచ్‌ల ఫలితాలు దీనిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి గెలిస్తే నేరుగా... ఓడితే మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement