అమ్మాయిలు భేష్... అబ్బాయిలు తుస్!
'గత కాలం మేలు వచ్చు కాలం కంటెన్'... చందంగా తయారైంది భారత్ జాతీయ క్రీడ హాకీ పరిస్థితి. గతంలో సువర్ణ కాంతులు వెదజల్లిన హాకీ ఆట ఇప్పుడు వెలవెలబోతోంది. పతకాలు మాట పక్కనపెడితే అర్హత సాధించడానికే ఆపసోపాలు పడుతోంది. తాజాగా ముగిసిన వరల్డ్ కప్ సెమీఫైనల్స్ హాకీ టోర్నమెంట్ లో ఇండియా టీమ్ నాలుగో స్థానంలో నిలిచింది. కనీసం కాంస్య పతకం కూడా సాధించలేక ఉత్తి చేతులతో తిరిగొచ్చింది. లీగ్, క్వార్టర్ పోరులో స్థాయికి తగిన ఆటతీరు కనబరిచిన భారత ఆటగాళ్లు సిసలు సమరంలో చేతులెత్తేశారు. రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ఒక్కటే ఊరట.
ఘనమైన చరిత్ర ఉన్న మన హాకీ టీమ్ ప్రాభవం చాలా కాలంగా తగ్గుతూ వస్తోంది. ఒక దశలో పతనావస్థకు చేరుకున్న హాకీ క్రీడ ఇటీవల కాలంలో కాస్త మెరుగైనట్టు కనబడుతోంది. లీగ్ దశను దాటి నాకౌట్ వరకు చేరుకోవడంలో సఫలీకృతమవుతున్న భారత జట్టు టైటిల్ ను ఒడిసిపట్టడంలో తడబడుతోంది. చివరి మెట్టుపై బోల్తా పడే అలవాటు నుంచి బయటపడితే ఇండియా హాకీకి పూర్వ వైభవం ఖాయం.
ఒలింపిక్స్ లో సత్తా చాటాలంటే భారత్ హాకీ టీమ్ చాలా శ్రమించాల్సివుందని వరల్డ్ కప్ హాకీ లీగ్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఫార్వర్ట్స్, రక్షణ పంక్తిని పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టాల్సివుంది. ప్రత్యర్థి జట్టు డిఫెన్స్ ను కకావికలం చేసే సమర్థ దాడులకు స్ట్రయికర్లు రాటుదేలాలి. పెనాల్టీ కార్నర్లను గోల్స్ గా మలచడంలో డ్రాగ్ ఫ్లికర్లు పట్టుసాధించాలి. అన్నింటికీ మించి కీలక టోర్నీలకు ముందు స్టార్ ఆటగాళ్లు గాయాలు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రతికూలతలను అధిగమించి రియో ఒలింపిక్స్ కు భారత అమ్మాయిలు అర్హత సాధించడం విశేషం. 5-6 స్థానాల కోసం జపాన్ తో జరిగిన వర్గీకరణ మ్యాచ్ లో మన అమ్మాయిలు అసమాన ఆటతీరుతో విజయకేతనం ఎగురవేసి 35 ఏళ్ల ఒలింపిక్స్ నిరీక్షణకు తెర దించారు. ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ద్వారా భారత్ లో మళ్లీ మహిళల హాకీకి మంచిరోజులు వస్తాయని ఆశిస్తున్నారు. భారత్ హాకీ తలరాత మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.