భువనేశ్వర్: వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించిన భారత హాకీ జట్టుకు తమ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహకారం కొనసాగిస్తుందని... 2036 వరకు భారత హాకీ జట్టుకు ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్‌గా కొనసాగుతుందని ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రకటించారు.
బుధవారం భువనేశ్వర్‌లో భారత జట్టు సభ్యులకు ఒడిశా ప్రభుత్వం సన్మానించింది. పారిస్ క్రీడల్లో కాంస్యం నెగ్గిన భారత జట్టులో కీలక సభ్యుడైన ఒడిశాకు చెందిన డిఫెండర్ అమిత్ రోహిదాస్‌కు రూ. 4 కోట్ల నజరానాను చెక్ రూపంలో అందించింది.
జట్టులోని ఇతర ఆటగాళ్లకు తలా రూ. 15 లక్షల, సహాయక సిబ్బదికి రూ. 10 లక్షల నగదు బహుమతి అందజేసింది. 2018 నుంచి భారత హాకీ జట్లకు ఒడిశా ప్రభుత్వం అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.
ఈ సందర్భంగా భారత సారథి హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. ‘జర్మనీతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో విజయానికి చేరువగా వచ్చాం. చాలా అవకాశాలు సృష్టించుకున్నాం. అయితే అది మా రోజు కాదు. అయినా కాంస్య పతక పోరులో తిరిగి సత్తాచాటాం. స్వర్ణం సాధించడమే లక్ష్యంగా పారిస్‌కు వెళ్లాం.
కానీ అది సాధ్యపడలేదు. వరసగా రెండు విశ్వక్రీడల్లో పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఒడిశా ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు మరవలేనివని.. ఇక్కడ హాకీకి కావాల్సిన సకల సదుపాయాలు ఉన్నాయి’ అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment