ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత హాకీ జట్టు అద్భుతం చేసింది. ఈ విశ్వ క్రీడల్లో వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని భారత హాకీ జట్టు సొంతం చేసుకుంది. సెమీస్‌లో జర్మనీ చేతిలో పోరాడి ఓడిన టీమిండియా.. స్పెయిన్‌తో కాంస్య పతక పోరులో మాత్రం సత్తాచాటింది.
2-1 తేడాతో స్పెయిన్ ఓడించిన భారత జట్టు కాంస్య పతకాన్ని ముద్దాడింది. ఇక ఈ చిరస్మరణీయ విజయంతో భారత స్టార్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలికాడు. కాగా తన రిటైర్మెంట్ విషయాన్ని ఒలింపిక్స్ ఆరంభానికి ముందే శ్రీజేశ్ ప్రకటించాడు.
ఈ క్రమంలో తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన పీఆర్ శ్రీజేష్‌కు సహచర ఆటగాళ్లు ఘన వీడ్కోలు పలికారు. ఆటగాళ్లంతా శ్రీజేష్‌కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తమ భుజాలపై ఎత్తుకొని గోల్ పోస్ట్ పోల్‌పై కూర్చోబెట్టారు. తమ హాకీ స్టిక్స్‌తో జేజేలు కొట్టారు.
కాగా భారత్ కాంస్య పతకం సాధించడంలో శ్రీజేష్‌ది కీలక పాత్ర. ముఖ్యంగా బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీజేష్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కోట గోడలా నిలిచిన శ్రీజేష్ బ్రిటన్‌కు ఎక్స్‌ట్రా గోల్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు.
ఇక 2006లో సౌత్ ఆసియన్ గేమ్స్‌తో అరంగేట్రం చేసిన శ్రీజేష్.. ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. కెప్టెన్‌గా, గోల్‌కీపర్‌గా భారత్‌కు చిరస్మరణీయ విజయాలను అందించాడు. రియో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు శ్రీజేష్ సారథ్యం వహించాడు.
2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హారీ జట్టులో శ్రీజేష్ సభ్యునిగా ఉన్నాడు. ఇది శ్రేజేష్‌కు నాలుగో ఒలింపిక్స్ కావడం గమనార్హం. అతడి కెరీర్‌లో రెండు ఆసియా గేమ్స్ బంగారు పతకాలు, రెండు ఆసియా కప్ టైటిల్స్, నాలుగు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ కూడా ఉన్నాయి. 2021లో శ్రేజేష్ 2021లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు.
"నా ఆటను ముగించేందుకు ఇంతకంటే సరైన సమయం ఉండదు. మేం పతకంతో తిరిగి వెళుతున్నాం. కొందరు అభిమానులు నన్ను కొనసాగించమని కోరుతున్నారు. కానీ నా నిర్ణయంలో మార్పు లేదు. కొన్ని నిర్ణయాలు కఠినమైనవే అయినా వాటిని సరైన సమయంలో తీసుకోవడమే బాగుంటుంది. మా జట్టు సభ్యులంతా చాలా బాగా ఆడారు.
టోక్యోలో గెలిచిన కాంస్యానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఒలింపిక్స్‌లో మేం పతకం గెలవగలమనే నమ్మకాన్ని అది కల్పించిందని" తన రిటైర్మెంట్ ప్రకటనలో శ్రీజేష్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment