
సందీప్ సింగ్‌పై బాలీవుడ్ చిత్రం
న్యూఢిల్లీ: దిగ్గజ మహిళా బాక్సర్ మేరీ కోమ్‌పై రూపొందించిన చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మరో క్రీడాకారుడిపై ఇదే రీతిన సినిమా తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్‌పై బాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందనుంది.
నటి చిత్రాంగద సింగ్ నిర్మాతగా వ్యవహరించనుంది. 2006లో జర్మనీలో జరిగిన ప్రపంచకప్ కోసం జట్టుతో చేరేందుకు వస్తున్న సందీప్ సింగ్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అనుకోకుండా బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపుగా పక్షవాతానికి గురై రెండేళ్ల పాటు చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. అయితే ఈ స్థితి నుంచి బయటపడడమే కాకుండా తిరిగి మైదానంలో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మరోవైపు ఈ సినిమాలో తన పాత్రను రణబీర్ కపూర్ పోషించాలని సందీప్ కోరుకుంటున్నాడు.