భారత్ అదరహో...
►15 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు అర్హత
►సెమీస్‌లో షూటౌట్‌లో ఆస్ట్రేలియాపై గెలుపు
►రేపు బెల్జియంతో టైటిల్ పోరు
►జూనియర్ ప్రపంచకప్ హాకీ
సొంతగడ్డపై మూడేళ్ల క్రితం ఎదురైన నిరాశను మరిపించేలా భారత హాకీ యువ ఆటగాళ్లు మెరిశారు. జూనియర్ ప్రపంచకప్‌లో అంతిమ సమరానికి అర్హత సాధించారు. ప్రపంచ మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో షూటౌట్‌లో విజయం సాధించి ఈ మెగా ఈవెంట్‌లో 15 ఏళ్ల తర్వాత టైటిల్ పోరుకు చేరుకున్నారు. బెల్జియంతో ఆదివారం జరిగే ఫైనల్లోనూ గెలిచి 15 ఏళ్ల ప్రపంచకప్ టైటిల్ నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో ఉన్నారు.
లక్నో: జాతీయ క్రీడ మళ్లీ జిగేల్‌మంది. సొంతగడ్డపై భారత యువ ఆటగాళ్లు సత్తా చాటారు. జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌లో టైటిల్‌కు మరో విజయం దూరంలో నిలిచారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ ‘షూటౌట్’లో 4–2తో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను బోల్తా కొట్టించారు. ఆదివారం జరిగే ఫైనల్లో బెల్జియంతో భారత్ తలపడుతుంది. అంతకుముందు తొలి సెమీఫైనల్లో బెల్జియం ‘షూటౌట్’లో 4–3తో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీపై సంచలన విజయం సాధించింది. భారత్ చివరిసారి 2001లో టైటిల్‌ను సాధించింది. 2013లో స్వదేశంలోనే జరిగిన ప్రపంచకప్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది.
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. దాంతో ఫలితం తేలడానికి షూటౌట్‌ను నిర్వహించారు. షూటౌట్‌లో గోల్‌కీపర్ వికాస్ దహియా ఆస్ట్రేలియా ఆటగాళ్ల రెండు షాట్స్‌ను నిలువరించి భారత విజయాన్ని ఖాయం చేశాడు. భారత్ తరఫున హర్జీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, సుమీత్, మన్‌ప్రీత్ జూనియర్ సఫలమయ్యారు. ఆస్ట్రేలియా తరఫున బ్లేక్ గోవర్స్, జాక్ వెల్చ్ గోల్స్ చేయగా... మాథ్యూ బర్డ్, షార్ప్ లాచ్‌లన్ కొట్టిన షాట్‌లను భారత గోల్‌కీపర్ వికాస్ దహియా అడ్డుకున్నాడు. ఫలితం తేలిపోవడంతో భారత్ ఐదో షాట్‌ను తీసుకోలేదు. రెగ్యులర్ సమయంలో ఆట 14వ నిమిషంలో టామ్ క్రెయిగ్ గోల్‌తో ఆసీస్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 42వ నిమిషంలో గుర్జంత్ సింగ్ గోల్‌తో భారత్ స్కోరును సమం చేసింది. 48వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ గోల్‌తో భారత్ 2–1తో ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే 57వ నిమిషంలో షార్ప్ లాచ్‌లన్ గోల్‌తో ఆసీస్ స్కోరును 2–2తో సమం చేసింది. అనంతరం తర్వాత 13 నిమిషాల్లో రెండు జట్లు మరో గోల్ చేయడానికి తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకపోయింది.