భారత హాకీ జట్టు ప్రపంచ క్రీడారంగంలో ఓ అద్భుతం
ఒకప్పుడు రత్నాలు రాశులుగా పోసి అమ్మేవారట... రాజులనాటి ప్రాభవం గురించి చెబుతూ ఈ మాట వాడటం తరచూ వింటుంటాం.
ఒకప్పుడు భారత హాకీ జట్టు అంటే ప్రపంచ క్రీడారంగంలో ఓ అద్భుతం. ఏకంగా ఎనిమిది ఒలింపిక్ స్వర్ణ పతకాలు నెగ్గిన ఏకైక దేశం. ప్రస్తుత భారత హాకీని నాటి వైభవంతో పోలిస్తే... అంతే అబ్బురం ఇప్పుడు.
ఇతర క్రీడల జోరులో ఎదగలేక, మార్గదర్శనం కరువై మన హాకీ వెనుకబడిపోయింది. కించిత్ బాధ వెంటాడుతుంది.
అయితే... అందరికీ హాకీ ఆట దూరం కాలేదు. స్టిక్ పట్టుకుంటేనే చేతిలోకి మంత్రదండం వచ్చేసినంతగా ఉప్పొంగిపోయే కుర్రాళ్లు... భవిష్యత్తుపై భరోసా లేకపోయినా హాకీ అంటే పడిచచ్చే పిల్లలు ఇంకా ఉన్నారు. ఇలాంటి ఈతరం ఆటగాళ్లతోనే హాకీ ఇంకా మనుగడ సాగిస్తోంది.
హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ పుట్టినరోజును ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నగరంలో హాకీపై అభిమానం పెంచుకున్న చిన్నారుల గురించి...
సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో హాకీ ఆడేందుకు పెద్ద సంఖ్యలో చిన్నారులు వస్తుంటారు. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసే వారి సంఖ్య దాదాపు 50 వరకు ఉంటుంది. నగరంలో ఈ క్రీడకు ఇప్పుడు ఇదే కేంద్రం. గచ్చిబౌలి ఆస్ట్రో టర్ఫ్ స్టేడియంలో అవకాశమున్నా... అదంతా ఖరీదైన వ్యవహారం. ఇక్కడ మాత్రం పేద, పెద్ద తేడా లేకుండా ఆసక్తి ఉన్న చిన్నారులంతా హాకీ ఆడేందుకు వస్తారు. ఎక్కువగా రసూల్‌పురావారు వచ్చేవారు. గతంలో దీని వెనుక భాగంలో బేగంపేట ఆస్ట్రోటర్ఫ్ స్టేడియం ఉండేది. అక్కడి నుంచే అనేక మంది జాతీయ స్థాయిలో హాకీ ఆడారు. అయితే బేగంపేట స్టేడియం పోలీసుల అధీనంలోకి వెళ్లిపోవడంతో ఇప్పుడు వారు జింఖానా బాట పట్టాల్సి వచ్చింది.
జాతీయ స్థాయిలో...
ఇక్కడి ఆటగాళ్లకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కోచ్ శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటున్న వీరిలో పది మందికి పైగా జాతీయ స్థాయి పోటీల్లో రాణించారు. అండర్-12, అండర్-14తో పాటు ప్రతిష్టాత్మక కె.డి.సింగ్ బాబు జాతీయ చాంపియన్‌షిప్‌లో కూడా వీరు పాల్గొన్నారు. నలుగురు చిన్నారులు జాతీయ స్కూల్ గేమ్స్ సమాఖ్య పోటీ ల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
కొన్నాళ్లుగా నగరంలో సీనియర్ స్థాయి టోర్నీలు లేక పరిస్థితి ప్రోత్సాహకరంగా లేకపోయినా... తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం లేదని వారు అంటున్నారు. హాకీ అంటే కొందరికి ప్రాణమని, మరికొందరికి పిచ్చి అని... అందుకే ఇదే ఆట ఎంచుకున్నామని వారు చెబుతున్నారు. ప్రోత్సాహకాలు, ఉద్యోగాల గురించి ఇప్పుడు ఆలోచన లేదని, బాగా ఆడితే అన్నీ వాటంతట అవే వస్తాయని వీరికి బలమైన నమ్మకం.
టోర్నీలేవీ..!
ఇక్కడి చిన్నారుల్లో చాలా ప్రతిభ ఉంది. క్లే కోర్టులోనే బాగా ఆడే వీరు అవకాశం దక్కితే ఆస్ట్రో టర్ఫ్‌లోనూ సత్తా చాటగలరు. సీనియర్ స్థాయిలో టోర్నమెంట్లు నిర్వహిస్తే వీరి ప్రతిభకు తగిన న్యాయం జరుగుతుంది. వీరిలో చాలా మంది ఆర్థిక స్థోమత లేనివారు. అయినా వారి పట్టుదల ముందు ఇలాంటివేవీ కనిపించవు.
- కామేశ్వర రావు, హాకీ కోచ్