రాక్‌స్టార్‌ రవీంద్ర జడేజా | Ravindra Jadeja, the rockstar of Indian cricket | Sakshi
Sakshi News home page

రాక్‌స్టార్‌ రవీంద్ర జడేజా

Oct 20 2024 8:57 AM | Updated on Oct 20 2024 8:57 AM

Ravindra Jadeja, the rockstar of Indian cricket

భారత క్రికెట్‌ జట్టులోకి తొలిసారి అడుగు పెట్టినప్పుడు రవీంద్ర జడేజా వయసు 21 ఏళ్లు. అతని ఆట మెరుగ్గానే ఉన్నా అతని వ్యవహారశైలిపై అందరికీ సందేహాలు ఉండేవి. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకొని జట్టులోకి వచ్చిన జడేజాలోని ‘యూత్‌’ లక్షణాలు టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో చాలా మందికి కొత్తగా అనిపించాయి. కానీ పదిహేనేళ్ల అంతర్జాతీయ కెరీర్‌ తర్వాత అతను భారత అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా కనిపించసాగాడు. 

‘రాక్‌స్టార్‌’ అనే ముద్దు పేరుతో మొదలైన అతని ప్రస్థానం టీమిండియా అద్భుత విజయాలకు చుక్కానిగా నిలిచింది. కెరీర్‌ ఆరంభంలో వన్డే, టి20 ఆటగాడిగానే ముద్ర పడినా కఠోర శ్రమ, పట్టుదలతో ఎరుపు బంతిపై పట్టు సాధించిన జడేజా ఇప్పుడు టెస్టు క్రికెట్‌లో కూడా అరుదైన మైలురాయిని అందుకున్నాడు. 92 ఏళ్ల చరిత్ర ఉన్న భారత టెస్టు క్రికెట్‌లో 300కు పైగా వికెట్లు తీసిన ఏడుగురు ఆటగాళ్లలో ఒకడిగా తన పేరును లిఖించుకున్నాడు. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా 3 వేల పరుగులు సాధించి, 300 వికెట్లు తీసిన 11 మందిలో ఒకడిగా ఉన్నాడు. 

ప్రతికూలతలను అధిగమించి..
సెంచరీ లేదా హాఫ్‌ సెంచరీ సాధించినప్పుడు కత్తిసాము తరహాలో తన బ్యాట్‌ను తిప్పుతూ జడేజా చేసే విన్యాసం భారత అభిమానులందరికీ సుపరిచితమే. రాజపుత్రుల కుటుంబానికి చెందిన అతను తన సంబరాన్ని ఇలా ప్రదర్శిస్తూ ఉంటాడు. అయితే పేరుకు అలాంటి నేపథ్యం ఉన్నా జడేజా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. అవి అతనిలో పోరాట పటిమను పెంచి,  మానసికంగా దృఢంగా మార్చాయి. 

అతి సాధారణ కుటుంబం అతనిది. వాచ్‌మన్‌గా పనిచేసే తండ్రి తన కుమారుడు తొందరగా ఆర్మీలో ఒక సిపాయి ఉద్యోగంలో చేరితే చాలు.. ఆర్థికంగా గట్టెక్కుతామనే ఆలోచనతో ఉండేవాడు. కానీ జడేజా మాత్రం భిన్న మార్గాన్ని ఎంచుకున్నాడు. తనకెంతో ఇష్టమైన క్రికెట్‌లోనే ఏదైనా చేసి చూపిస్తాననే పట్టుదల కనబరచి తండ్రిని ఒప్పించగలిగాడు. అతనికి తల్లి కూడా మద్దతు పలికింది. అయితే ఆటలో జడేజా ఎదుగుతున్న సమయంలోనే ఒక ప్రమాదంలో తల్లి చనిపోయింది. అప్పుడు అతని వయసు 16 ఏళ్లు. ఆ బాధలో క్రికెట్‌కు గుడ్‌బై చెబుదామనుకున్నాడు. కానీ తండ్రి అండగా నిలవడంతో క్రికెట్‌పై మళ్లీ శ్రద్ధపెట్టాడు.  

దేశవాళీలో చెలరేగి..
యూత్‌ క్రికెట్‌లో సౌరాష్ట్ర జట్టు తరఫున చెలరేగిన జడేజా ఆట అతనికి భారత అండర్‌–19 జట్టులో చోటు కల్పించింది. 2006లో రన్నరప్‌గా నిలిచిన జట్టులో భాగంగా ఉన్న జడేజా.. 2008లో విరాట్‌ కోహ్లీ నేతృత్వంలో టైటిల్‌ నెగ్గిన టీమ్‌లో కీలక సభ్యుడిగా సత్తా చాటాడు. ఆరు మ్యాచ్‌లలో అతను తీసిన 10 వికెట్లు జట్టుకు విజయాలను అందించాయి. ఫలితంగా 2008లో జరిగిన తొలి ఐపీఎల్‌లో ప్రతిభ గల వర్ధమాన ఆటగాడిగా రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. రాజస్థాన్‌ ఐపీఎల్‌ విజేతగా నిలవడంతో జడేజాకు కూడా మంచి గుర్తింపు దక్కింది. 

ఇక్కడే షేన్‌వార్న్‌ అతనికి రాక్‌స్టార్‌ అంటూ పేరు పెట్టాడు. అయితే ఉడుకు రక్తం ఉప్పొంగే 20 ఏళ్ల వయసులో సరైన మార్గనిర్దేశనం లేకుండా అతను చేసిన తప్పుతో వివాదానికి కేంద్రంగా నిలిచాడు. ఒక జట్టుతో కాంట్రాక్ట్‌లో ఉండగానే ఎక్కువ మొత్తం కోసం మరో జట్టుతో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేయడం బీసీసీఐకి ఆగ్రహం తెప్పించింది. దాంతో ఏడాది నిషేధం విధించడంతో 2009 ఐపీఎల్‌కు అతను దూరమయ్యాడు. ఐపీఎల్‌కు రెండు నెలల ముందే కేవలం ప్రతిభ కారణంగా భారత జట్టు తరఫున తొలి వన్డే, తొలి టి20 అవకాశం రావడం అతనికి కలిగిన ఊరట. అయితే ఆ నిషేధం వ్యక్తిగా కూడా అతను మెరుగుపడే అవకాశాన్నిచ్చింది. 

2012 ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుతో చేరడం జడేజా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. చెన్నై టీమ్‌ మూల స్తంభాల్లో ఒకడిగా నిలిచాడు. టీమ్‌ తరఫున మూడు టైటిల్స్‌ విజయాల్లో భాగంగా ఉన్నాడు. దశాబ్దంన్నర కాలంలో భారత్‌ తరఫున ఆడిన 197 వన్డేలు, 74 టి20 మ్యాచ్‌లు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతని విలువను చూపించాయి. 

టెస్టుల్లో సూపర్‌ హీరోగా..
వన్డేలు, టి20లతో పోలిస్తే టెస్టు క్రికెట్‌లో జడేజా సాధించిన ఘనతలు అసాధారణమైనవి. రంజీ ట్రోఫీలో ఏకంగా మూడు ట్రిపుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడిగా అతను రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ క్రికెట్‌లో అతనికి ముందు మరో ఏడుగురు మాత్రమే ఇలాంటి ఫీట్‌ను సాధించారు. ఆ జోరులో 2012లో జడేజా భారత టెస్టు జట్టులోకి తొలిసారి ఎంపికయ్యాడు. ఈ పుష్కర కాలంలో జడేజా ఒంటి చేత్తో జట్టుకు అందించిన విజయాలు ఎన్నో. తన లెఫ్టార్మ్‌ స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేసి చకచకా వికెట్లు పడగొట్టడం.. లేదంటే లోయర్‌ ఆర్డర్‌లో తన బ్యాటింగ్‌తో కీలక పరుగులతో జట్టుకు భారీ స్కోరు అందించడం.. ఇలా ఏదో రూపంలో అతని భాగస్వామ్యం లేని టెస్టులు దాదాపుగా లేవంటే అతిశయోక్తి కాదు. 

జట్టులో మరో సహచరుడు, అగ్రశ్రేణి స్పిన్నర్‌గా అశ్విన్‌ను దాటి కూడా కొన్నిసార్లు ఏకైక స్పిన్నర్‌గా టీమ్‌లో అవకాశాన్ని దక్కించుకోగలిగాడంటే జడేజా సత్తాపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌కున్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియాపై వరుసగా రెండు సిరీస్‌లలో 24, 25 చొప్పున, దక్షిణాఫ్రికాపై 23, ఇంగ్లండ్‌పై 26.. ఇలా సొంతగడ్డపై సిరీస్‌ ఏదైనా ప్రత్యర్థిని కుప్పకూల్చడం జడేజాకు మంచినీళ్లప్రాయంలా మారింది. అనిల్‌ కుంబ్లే (1993) తర్వాత ఐసీసీ టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా తొలి భారత బౌలర్‌గా జడేజా గుర్తింపు తెచ్చుకున్నాడు.

∙మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement