అన్నార్తులను వెతుక్కుంటూ వెళ్తాడు!
ఆదర్శం
రేగిన జుట్టు, మాసిన బట్టలు, వాడిన ముఖంతో, బిక్కచూపులు చూస్తూ ఎవరైనా అనామకుడు మన ముందు చెయ్యి చాస్తే ఏం చేస్తాం? వెంటనే ముఖం తిప్పేస్తాం. అంతకీ జాలేస్తే రూపాయో, రెండు రూపాయలో చేతిలో పెడతాం. కానీ ఆ యువకుడు అలా కాదు. అతడి దగ్గరకు వచ్చి ఎవరూ చేయి చాచనక్కర్లేదు. అలాంటి వారిని పనిగట్టుకుని వెతుక్కుంటూ తానే వెళ్తాడు. వాళ్ల కడుపు నింపి వస్తాడు.
ఆకలి కడుపులు నింపడం కన్నా పుణ్యం ఏముంటుంది! కానీ అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. నోరు తెరచి అడిగితే పట్టెడన్నం పెడతారేమో కానీ, పట్టెడన్నం పెట్టడం కోసమే ఆకలితో ఉన్నవారిని వెతుక్కుంటూ వెళ్లడం అనేది అందరూ చేయగలిగేది కాదు. ఖాదర్‌బాబు లాంటి ఏ కొందరో మాత్రమే చేయగలిగే గొప్ప పని అది! కృష్ణాజిల్లా, ఎ.కొండూరు మండలం, చీమలపాడు గ్రామానికి చెందిన అతడు మానవసేవలో తరిస్తున్నాడు. మనుషుల్లోనూ మాధవుడు ఉంటాడని నిరూపిస్తున్నాడు.
ఫుట్‌పాత్‌లు, పేవ్‌మెంట్లపై ఆకలితో లుంగచుట్టుకుపోయి, ముడుచుకుని పడుకున్న వారిని లేపి, వారికి కడుపునిండా అన్నం తినిపించి, మంచినీళ్లు తాగించి వారి ఆకలి తీరితే చాలు... కోటి రూపాయలు దొరికినంతగా సంబర పడతాడు ఖాదర్‌బాబు. అతని తండ్రి అతావుల్లా ఖాదరీబాబా కూడా అంతే! రోజూ కొన్ని వేలమంది అన్నార్తులకు భోజనం పెట్టి, వాళ్లు ఆవురావురుమని తింటుంటే... సంతోషపడిపోతారు. అదే ఖాదర్‌కీ అలవడింది. అయితే తేడా ఒక్కటే. తండ్రేమో తన దగ్గర కు వెళ్లినవారి కడుపులు నింపుతాడు. తనయుడేమో ఒకడుగు ముందుకు వేసి... ఆహారం పొట్లాలు కొనుక్కుని వెళ్లి, తానే స్వయంగా తినిపించి మరీ వస్తాడు. అలా అని ఈ తండ్రీ కొడుకులు కోట్లకు పడగెత్తిన వారేమీ కారు. సాటివారికి సేవ చేయాలన్న సంకల్పం బలంగా ఉన్నవారు మాత్రమే!
బాల్యంలోనే బీజం...
ఖాదర్‌బాబు తండ్రి అతావుల్లా ఖాదరీబాబా వ్యవసాయం చేసేవారు. ఎనిమిది మంది పిల్లలు. అంటే ఇంట్లో మొత్తం పదిమంది. అందరికీ ఆయన సంపాదన ఒక్కటే ఆధారం. అయినా కూడా ఉన్నంతలో అందరికీ పెట్టే స్వభావం ఆయనది. ఇంటికెవరొచ్చినా కడుపునిండా భోజనం పెట్టి పంపడం ఆయనకు అలవాటు. అందుకు ఆయన భార్య కూడా సహకరించేది. విసుగు లేకుండా ఎంతమందికైనా వండి పెట్టేది. ఆ దంపతుల దాతృత్వం గురించి తెలిసి ఆకలితో అల్లాడుతున్న ఎంతోమంది వచ్చి చేయి చాచేవారు. వాళ్లందరికీ సుష్టుగా భోజనం లభించేది ఆ ఇంట్లో. అది ఖాదర్‌బాబులో స్ఫూర్తిని నింపింది. సేవ చేయాలన్న తపన బాల్యం నుంచే పెరిగింది. ఇంటికొచ్చినవాళ్లకి తన తండ్రి ఎలాగూ పెడుతున్నాడు కాబట్టి ఇంటిదాకా రాలేకపోతున్నవారి కోసం తానే వెళ్లాలి అనుకునేవాడు. ఓసారి అనుకోకుండా రోడ్డు పక్కన ఉన్న వృద్ధ యాచకుడికి ఆహారం తినిపించాడు ఖాదర్. కడుపు నిండిన ఆ యాచకుడి కళ్లలో ఆకలి తీరిన ఆనందం కదలాడింది. దానికితోడు అతను ఖాదర్ తలమీద చేయి వేసి... ‘నువ్వు చల్లగా ఉండాలి బాబూ’ అని దీవించడం ఎంతో తృప్తినిచ్చింది ఖాదర్‌కి. తన గమ్యం ఎటువైపో అప్పుడే అర్థమయిందతనికి!
తన ముగ్గురన్నలు, నలుగురు అక్కలతో పాటు తానూ చదువుకున్నాడు ఖాదర్. వాళ్లంతా జీవితాల్లో స్థిరపడ్డారు. ఖర్జూరాల వ్యాపారం చేసే ఖాదర్ తన సంపాదనలో అధిక భాగాన్ని అన్నార్తుల కడుపు నింపడం కోసమే కేటాయిస్తుంటాడు. అందుకు అతడి సహధర్మచారిణి సల్మా కూడా సహకరిస్తుంది. ఆమె ప్రతిరోజూ వంట చేసి, ఓ ఐదారు ఆహార పొట్లాలు తయారు చేసి భర్తకు ఇస్తుంది. వాటితో పాటు కొన్ని మంచినీళ్ల బాటిళ్లు కొనుక్కుని బ్యాగులో వేసుకుని బయలుదేరుతాడు ఖాదర్. రోడ్ల పక్కన, బస్టాపుల్లో, గుడి మెట్ల మీద... ఎక్కడ ఎవరు పట్టెడన్నం కోసం ఎదురు చూస్తున్నా వారికి తన దగ్గరున్న ఆహారాన్ని స్వయంగా తినిపించి, మంచినీళ్లు తాగించి మరీ అక్కడ్నుంచి వెళ్తాడు. ఒక్కసారి ఒకచోట ఒక వ్యక్తికి అన్నం పెడితే... అప్పట్నుంచి రోజూ పెడుతూనే ఉంటాడు.
అది మాత్రమే కాదు, చలికి అల్లాడిపోయే వారికి రగ్గులు, దుస్తులు ఇస్తుంటాడు. ఎవరైనా చింపిరి జుత్తుతో కనిపిస్తే చాలు... వెంటనే క్షురకుణ్ని తీసుకుని అక్కడ ప్రత్యక్షమైపోతాడు. శుభ్రంగా క్షవరం చేయిస్తాడు. ఆశ్రయం లేనివాళ్లని ఆశ్రమాలకి తరలిస్తుంటాడు. అయితే ఇంత చేస్తున్నా తనకి తృప్తి లేదంటాడు ఖాదర్. ఎప్పటికైనా తానే ఒక ఆశ్రమాన్ని పెట్టి, దిక్కులేని వాళ్లందరినీ అందులో ఉంచి, వాళ్లకి కడుపునిండా తిండి పెట్టి అన్నీ తానై చూసుకోవాలని ఆశిస్తున్నాడు. ఆలోచన మంచిదైనప్పుడు ఆచరణకు మార్గం తప్పక దొరుకుతుంది. అదే జరిగితే ఖాదర్ వల్ల మరెందరివో కడుపులు నిండుతాయి!
- డి.వి.ఆర్.భాస్కర్