Right to Walk.. ఇంకెప్పుడు..? | Footpaths are less than 10 percent of the length of roads: telangana | Sakshi
Sakshi News home page

Right to Walk.. ఇంకెప్పుడు..?

Published Sat, Jul 6 2024 5:15 AM | Last Updated on Sat, Jul 6 2024 5:15 AM

Footpaths are less than 10 percent of the length of roads: telangana

మహానగరంలో పాదచారులకు అవస్థలెన్నో..

రోడ్ల నిడివితో పోల్చుకుంటే 10% కూడా లేని ఫుట్‌పాత్‌లు

ఉన్న ఫుట్‌పాత్‌లపై చాలాచోట్ల వ్యాపారాలు, వాహనాల పార్కింగ్‌

రోడ్డు దాటాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే..!

ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు ఉన్నా చాలా వరకు నిరుపయోగంగానే..

పెలికాన్‌ సిగ్నల్స్‌దీ అదే పరిస్థితి.. నిర్వహణ లోపం..ప్రజల్లోనూ నిర్లక్ష్యం 

బిజీ రోడ్లలో ప్రమాదాలు..ఏటా పెరుగుతున్న మరణాలు

గ్రేటర్‌ సిటీని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటున్న పాలకులు నగరం మధ్యలో ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ వంటి పనులపై దృష్టి పెడుతున్నా, కాలినడకన వెళ్లే వారికి అవసరమైన మేరకు ఫుట్‌పాత్‌లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఎఫ్‌ఓబీ)ల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు ప్రధాన రహదారుల్లో సాఫీగా కొద్ది దూరం కూడా  నడవలేక.. ఒకవైపు నుంచి మరో వైపు రోడ్డు దాటలేక పాదచారులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. 

చాలాచోట్ల ఫుట్‌పాత్‌లు లేక, ఉన్న ఫుట్‌పాత్‌లు చాలా ప్రాంతాల్లో ఆక్రమణకు గురికావడంతో పాదచారులు విధిలేని పరిస్థితు ల్లో రోడ్లపైనే నడుస్తూ  ప్రమాదాలకు గురవుతు­న్నారు. కిక్కిరిసిన జంక్షన్ల వద్ద రోడ్డు దాటేందుకు ప్రయత్నించేవారు కూడా రయ్‌ మంటూ దూసుకుపోయే వాహనాల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ఎఫ్‌ఓబీలు ఉన్నా చాలాచోట్ల లిఫ్ట్‌ల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో నిరుపయోగంగా ఉంటున్నాయి.

ఈ కారణంగా పాదచారులు ఎఫ్‌ఓబీలు ఉపయోగించకుండా ట్రాఫిక్‌ మధ్యలోనే రోడ్లు దాటేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. గత ఏడాది నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 123 మంది మృత్యువాత పడగా అనేకమంది గాయాల పాలవడం గమనార్హం. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 9,013 కి.మీ పొడవైన రోడ్లు ఉండగా ఫుట్‌పాత్‌లు కేవలం 817 కిలోమీటర్లకే పరిమితం కావడం పరిస్థితిని స్పష్టం చేస్తోంది.

10% కూడా లేని ఫుట్‌పాత్‌లు
జీహెచ్‌ఎంసీ పరిధిలో బీటీ, సీసీ, ఇతరత్రా రోడ్లన్నీ కలిపి మొత్తం  9,013 కిలోమీటర్ల రహదారులుండగా, వాటిల్లో ఫుట్‌పాత్‌లు లేదా వాక్‌వేలు కలిపి కనీసం 10 శాతం కూడా లేవు. ఉన్న ఫుట్‌పాత్‌లు దుకాణదారులు తమ అమ్మకపు సామగ్రిని ఉంచడానికి, వాహనాల పార్కింగ్‌కు, టీకొట్లు, తోçపుడు బండ్లు, ఇతరత్రా చిన్న వ్యాపారాల నిర్వహణకు పనికి వస్తున్నాయే తప్ప ప్రజలు నడవడానికి అనువుగా ఉండటం లేదు. ప్రభుత్వ సంస్థలు సైతం పబ్లిక్‌ టాయ్‌లెట్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, రూ.5 భోజన కేంద్రాలు వంటివి ఫుట్‌పాత్‌లపైనే ఏర్పాటు చేయడం గమనార్హం. కాగా కొందరు ఇసుక, ఇటుక, కంకర వంటి వాటిని సైతం ఫుట్‌పాత్‌లపైనే ఉంచి వ్యాపారాలు చేస్తున్నారు.  

అన్ని రోడ్లకు ఫుట్‌పాత్‌లుండాలి
అన్ని రహదారుల వెంబడి ఫుట్‌పాత్‌లను నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే ఇప్పటికే ఉన్న ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించి, అవి  ప్రజలు నడిచేందుకు మాత్రమే ఉపయోగపడేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జీహెచ్‌ఎంసీలో ఈవీడీఎం విభాగం ప్రారంభమైన తొలినాళ్లలో ఆరేళ్ల క్రితం ‘రైట్‌ టూ వాక్‌’ పేరిట 20 వేలకు పైగా ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించింది. చిన్నాచితకా వ్యాపారులను వాటిపై నుంచి తరలించారు. తొలగింపు సమయంలో ఫుట్‌పాత్‌లు దెబ్బతిన్న ప్రాంతాల్లో కొత్తగా నిర్మిస్తామని పేర్కొన్నారు. కానీ కొత్తగా నిర్మించలేదు సరికదా.. కొన్నాళ్లకే ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో మళ్లీ వ్యాపారాలు వెలిశాయి.

జీహెచ్‌ఎంసీలో రోడ్లు.. పుట్‌పాత్‌లు ఇలా (కి.మీ.లలో)
మొత్తం రోడ్లు 9,013
⇒  సీసీ రోడ్లు 6,167
⇒  బీటీరోడ్లు  2,846
⇒ ఫుట్‌పాత్‌లు 817

ఫుట్‌పాత్‌ల పరిస్థితి అలా ఉంచితే.. ఒక వైపు నుంచి మరో వైపు రోడ్డు దాటి వెళ్లాలంటే  పట్టపగలే చుక్కలు కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా బిజీ రోడ్లలో ఆగకుండా దూసుకొచ్చే వాహనాలతో ఒక్క అడుగు ముందుకు వేయడం కూడా కష్టంగా ఉంటుంది. బిక్కుబిక్కుమంటూ వచ్చే వాహనాల వైపు చేతిని అడ్డంగా పెడుతూ బతుకుజీవుడా అనుకుంటూ రోడ్లు దాటుతున్నవారు నిత్యం కనిపిస్తుంటారు. ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారి పరిస్థితి చెప్పనక్కర్లేదు.

ఎవరో ఒకరు తోడులేందే వారు రోడ్డు దాటలేని పరిస్థితి ఉంటోంది. పాదచారులు రోడ్లు దాటేందుకు  ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జీలు, పెలికాన్‌ సిగ్నల్స్‌ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కోట్ల రూపాయలు ఖర్చవడం తప్ప అవి ప్రజలకు ఉపయోగపడటం లేదు. నగరంలో ఉన్న అనేక ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జీలు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా ఉంటున్నాయి. పాదచారుల నిర్లక్ష్యం కూడా ఇందుకు కొంత తోడవుతోంది. చాలాచోట్ల లిఫ్ట్‌లు పని చేయడం లేదు. కొన్నిచోట్ల పనిచేస్తున్నా పాదచారులు వాటిని ఉపయోగించడం లేదు. అధికార యంత్రాంగం మాత్రం ప్రజలకు ఉపయోగపడుతున్నదీ, లేనిదీ పరిశీలించకుండానే కొత్తవి నిర్మించేందుకు పూనుకుంటోంది. ఉన్నవి ఉపయోగపడేలా చేసే దిశగా చర్యలు చేపట్టడం లేదు.

ఎన్ని ఉన్నా ఏం లాభం?
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, నేషనల్‌ హైవే, టీజీఐఐసీ సంస్థలు ఏర్పాటు చేసిన ఎఫ్‌ఓబీలు పాతవి 23 ఉండగా, కొత్తగా పనులు చేపట్టిన వాటిల్లో 12 పూర్తయ్యాయి. మరో ఐదు పురోగతిలో ఉన్నాయి. ఎఫ్‌ఓబీలు ఎక్కువ ఎత్తులో ఉండటంతో చాలామంది వాటిని వినియోగించుకోవడం లేదు. వయోవృద్ధులు శారీరక సమస్యలున్న వారు అసలు ఎక్కలేక పోతు­న్నారు. ఎక్కగలిగే శక్తి ఉన్నవారు సైతం వాటిని ఎక్కి నడిచి దిగే కంటే ఎలాగోలా రోడ్డు దాటేయొచ్చని భావిస్తున్నారు. ఈ నేప­థ్యంలో అన్ని ప్రాంతాల్లోనూ లిఫ్టులు, ఎస్క­లే­టర్లు వంటివి ఏర్పాటు చేయాలనే అభిప్రా­యాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని ఏర్పాటు చేయడంతో ఊరుకోకుండా ప్రజలు వాటిని వినియోగించేలా చూడాలని, ఎలా విని­యో­గించాలో తెలియని వారి కోసం నిర్వహణ సిబ్బందిని నియమించాలని అంటున్నారు.

ఫుట్‌పాత్‌లు ఉండాల్సింది ఇలా (మీటర్లలో..)
⇒  దుకాణాల ముందు 3.5  4.5
⇒  బస్టాప్‌లు 3.00
⇒ వాణిజ్య ప్రాంతాల్లో..  4.00
⇒ ఇతర ప్రాంతాల్లో.. 2.5
(నగరంలో 0.60 మీటర్ల నుంచి 3 మీటర్ల లోపే ఉన్నాయి. ఎక్కువగా మీటరు నుంచి మీటరున్నర వరకే ఉన్నాయి)  

రోడ్డుపైకి వెళ్లకుండా గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలి
కోట్లాది రూపాయల ప్రజాధనంతో  నిర్మించిన ఎఫ్‌ఓబీలను ప్రజలు వినియోగించుకోవాలి. కొందరు రోడ్డు పైనుంచే వెళ్తూ ప్రమా దకరమైనప్పటికీ సెంట్రల్‌ మీడియన్లను సైతం ఎక్కి దిగుతున్నారు. ఈ పరిస్థితి నివారణకు బ్రిడ్జికి అటూ ఇటూ  కనీసం వంద మీటర్ల వరకు ప్రజలు రోడ్డు మీదకు వెళ్లేందుకు వీల్లేకుండా గ్రిల్స్‌ ఏర్పాటు చేయాలి. – ఆర్‌. శ్రీధర్, స్ట్రక్చరల్‌ ఇంజనీర్, రిటైర్డ్‌ ఈఎన్‌సీ, జీహెచ్‌ఎంసీ

ఆ వ్యవస్థతో బ్రిడ్జీలు ఏర్పాటు చేయొచ్చు
ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఫుట్‌పాత్‌లు లేని ప్రాంతాల్లో రోడ్డు చివరి లైన్‌లో టూ టయర్‌ సిస్టమ్‌తో బ్రిడ్జిలాంటి ఏర్పాటు చేయవచ్చు. 2 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేసే ఈ బ్రిడ్జి పైనుంచి పాదచారులు వెళ్లేలా, టూ, త్రీవీలర్లు కిందనుంచి వెళ్లేలా నిర్మాణాలు చేయొచ్చు. అలాగే రోడ్డు దాటేందుకు జాకింగ్‌ కాన్సెప్ట్‌తో మీటర్‌ రేడియస్‌తో టన్నెల్‌ లాంటి నిర్మాణం చేయొచ్చు. గతంలో ఓ పోలీసు ఉన్నతాధికారి హయాంలో ఇలాంటి ఆలోచనలు జరిగాయి. ఆయన మారడంతో అది అటకెక్కింది.   – ప్రొఫెసర్‌ లక్ష్మణరావు, జేఎన్‌టీయూ

ఎక్కువ ఎత్తు అవసరం లేదు
నగరంలో ఏర్పాటు చేసిన ఎఫ్‌ఓబీలు చాలా ఎత్తులో ఉన్నందువల్ల ఎవరూ ఎక్కడం లేదు. కాబట్టి ఎత్తు కాస్త తగ్గించాలి. మెట్రో స్టేషన్లలో మాదిరిగా లిఫ్టులు, ఎక్సలేటర్లు ఉంటే అవసరమైన వారు వినియోగిస్తారు. ఎల్‌వీ ప్రసాద్‌ ఆస్పత్రి వద్ద ఎఫ్‌ఓబీ ఉన్నప్పటికీ లిఫ్టు పనిచేయక ఎక్కడం లేదు. పాదచారులు ఎక్కువగా  రోడ్లు  దాటే ప్రాంతాలను గుర్తించి అక్కడ రోడ్‌క్రాసింగ్‌కు వీలుగా సిగ్నల్‌ లైట్లు పెట్టడం మాత్రమే కాకుండా వాహనాలు కచ్చితంగా ఆగేలా చూడాలి. పాదచారుల క్రాసింగ్‌ ఏరియా అని తెలిసేలా ప్రత్యేక లైటింగ్‌ ఏర్పాటు చేయాలి. పాదచారులకు సహాయకులుగా పోలీ­సు­లు లేదా ఇతర సిబ్బందిని నియమించాలి. దీనివల్ల కొందరికి ఉపాధి కూడా లభిస్తుంది.   – డా. దొంతి నరసింహారెడ్డి, సామాజికవేత్త

పేరుకే పెలికాన్‌ సిగ్నల్స్‌
బిజీ రోడ్డును దాటాలనుకునే పాదచారుల కోసం నగరంలోని 70కి పైగా ప్రాంతాల్లో పెలికాన్‌ సిగ్నల్స్‌ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పాదచారి ఎవరైనా రోడ్డు దాటాలనుకున్నప్పుడు పక్కనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాలో ఉండే స్విచ్‌ను నొక్కాల్సి ఉంటుంది. అప్పుడు రెడ్‌ సిగ్నల్‌ పడి కొన్ని సెకన్ల తర్వాత రోడ్డుకిరువైపులా రాకపోకలు సాగించే వాహనాలు నిర్ణీత సమయం ఆగిపోతాయి. అప్పుడు పాదచారులు రోడ్డు దాటాల్సి ఉంటుంది.

ఒక్కసారి బటన్‌ నొక్కిన తర్వాత.. పదే పదే నొక్కినా పని చేయకుండా కొంత గ్యాప్‌ ఉంటుంది. అంటే ఎవరైనా కూడా వెంట వెంటనే నొక్కడానికి అవకాశం ఉండదన్న మాట. అయితే బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రి వద్ద, ట్యాంక్‌బండ్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న ఈ పెలికాన్‌ సిగ్నల్స్‌ కేవలం అలంకారంగానే ఉన్నాయి. ఎప్పుడో ఏర్పాటు చేసిన ఈ సిగ్నల్స్‌ కొన్ని ప్రాంతాల్లో పనిచేయడం లేదు. అసలు వీటిని ఎలా వినియోగించాలో కూడా ప్రజలకు తెలియదని, అధికారులు ఈ విషయంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

లిఫ్ట్‌ ఉన్నా వేస్ట్‌ 
ఎర్రగడ్డ ప్రధాన రహదారిలోని మోడల్‌ కాలనీ కమాన్‌ వద్ద ఉన్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని సరిగా నిర్వహించడం లేదు. లిఫ్ట్‌ సౌకర్యం ఉన్నా అది ఎప్పుడు పని చేస్తుందో, ఎప్పుడు పని చేయదో తెలియదు. నాలాంటి సీనియర్‌ సిటిజన్లు మెట్లు ఎక్కి  వెళ్లలేకపోతున్నాం. ఎఫ్‌ఓబీ సమీపంలో చెత్తాచెదారం నిండి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.  –జేఎస్‌టీ శాయి, మోడల్‌ కాలనీ, సనత్‌నగర్‌.

నిబంధనల పాటింపు తప్పనిసరి చేయాలి
పాదచారులకు సైతం కొన్ని నిబంధనలు ఉన్నాయి. వీటి ప్రకారం పెడస్ట్రియన్‌ క్రాసింగ్స్‌లో, నిర్దేశించిన విధంగానే రోడ్డు దాటాలి. అలా చేయకపో­వడం ఉల్లంఘన కిందికే వస్తుంది.  నేను గతంలో చెన్నై వెళ్లిన ప్పుడు ఓ విషయం గమనించా. అప్పట్లో అక్కడి సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ట్రాఫిక్‌ చాలా ఎక్కువగా ఉండేది. దీంతో పాదచారులు రోడ్డు దాటడానికి వీలుగా అండర్‌ పాస్‌ ఏర్పాటు చేశారు.

అయితే తొలినాళ్లలో దీన్ని  వినియోగించకుండా రోడ్డు పైనుంచే దాటుతుండ టంతో ప్రమాదాలు కొన సాగాయి. దీంతో ఆ అండర్‌ పాస్‌ వద్ద ఓ కాని స్టేబుల్‌ను ఏర్పాటు చేశారు. ఎవరైనా అండర్‌ పాస్‌ కాకుండా రోడ్డు పైనుంచి క్రాస్‌ చేస్తే కానిస్టేబుల్‌ పట్టుకునేవారు. అక్కడి కక్కడే రూ.5 జరిమానా విధించి వసూలు చేసే వారు. దీంతో పాటు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతో అండర్‌ పాస్‌ వినియోగం పెరిగింది. ఇలాంటి విధానాలు హైదారాబాద్‌లోనూ అమల్లోకి తీసుకురావాలి. – కేవీకే రెడ్డి, ట్రాఫిక్‌ నిపుణుడు

నగరంలో ఎఫ్‌ఓబీలున్న ప్రాంతాలు
పాతవి: అనుటెక్స్‌ (సైనిక్‌పురి), హెచ్‌పీ పెట్రోల్‌బంక్‌ (రామంతాపూర్‌), నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (రాజేంద్రనగర్‌), గగన్‌పహాడ్, మహవీర్‌ హాస్పిటల్, ఎన్‌ఎండీసీ (మాసాబ్‌ట్యాంక్‌), ఎన్టీఆర్‌ మార్గ్‌ (ట్యాంక్‌బండ్‌), గ్రీన్‌ల్యాండ్స్‌ గెస్ట్‌హౌస్, ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి, ముఫకంజా కాలేజ్‌ (బంజారాహిల్స్‌), భారతీయ విద్యాభవన్‌ స్కూల్‌ (ఫిల్మ్‌నగర్‌), వెల్స్‌ ఫార్గో (ఖాజాగూడ), ఐఎస్‌బీ, ఐటీసీ కోహినూర్, మియాపూర్‌ క్రాస్‌రోడ్స్, ఆల్విన్‌ క్రాస్‌రోడ్స్‌ (మదీనగూడ), మలేసియన్‌ టౌన్‌షిప్, కేపీహెచ్‌బీ–4 ఫేజ్, కళామందిర్‌ (కేపీహెచ్‌బీ కాలనీ), ఐడీపీఎల్, మెట్టుగూడ, రైల్‌నిలయం, హైదరాబాద్‌ పబ్లిక్‌స్కూల్‌ (బేగంపేట).

కొత్తవి: బాలానగర్, చెన్నెయ్‌ షాపింగ్‌ మాల్‌ (మదీనగూడ), మియాపూర్, ఈఎస్‌ఐ హాస్పిటల్‌(ఎర్రగడ్డ), హైదరాబాద్‌ సెంట్రల్‌ మాల్, నేరేడ్‌మెట్‌ బస్టాప్, సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌(సికింద్రాబాద్‌), తార్నాక, స్వప్న థియేటర్‌ (రాజేంద్రనగర్‌), ఒమర్‌ హోటల్,  రంగభుజంగ థియేటర్, మూసాపేట క్రాస్‌రోడ్స్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement