అట్లతద్దోయ్ ఆరట్లోయ్...
సందర్భం- నేడు అట్లతద్దె
ఈ నోమును మొట్టమొదటిసారిగా గౌరీదేవి నారదమహాముని ప్రోద్బలంతో నోచుకుని సాక్షాత్తూ పరమేశ్వరుని పతిగా పొందిందని పురాణోక్తి. ఇందుకే ఈ నోముకు చంద్రోదయ గౌరీవ్రతమని కూడా పేరు.
‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్- ముద్దపప్పోయ్ మూడట్లోయ్...’ ‘పీటకిందా పిడికెడు బియ్యం పిల్లల్లారా జెల్లల్లారా లేచిరండోయ్.. ’ అంటూ ఆటపాటలతో, కోలాహలంగా సాగే నోము అట్లతద్దె. ఈ నోమును కన్నెపిల్లలు సలక్షణమైన భర్త కోసం ఆచరిస్తే, వివాహితలు తమ కాపురం చల్లగా సాగాలని, కడుపు పండాలనీ నోచుకుంటారు.
వ్రతవిధానం
ఈ వ్రతం చేసేవారు ఆశ్వయుజ బహుళ తదియనాడు తెల్లవారు ఝామున లేచి చద్దెన్నం, గోంగూర పచ్చడి, పొట్లకాయ కూర, నువ్వులపొడి, ఉల్లిపాయ పులుసు, గడ్డపెరుగుతో విందారగించి, తాంబూలం వేసుకోవాలి. ఆ తర్వాత ఆటలు ఆడాలి. ఊయల ఊగాలి. స్నానపానాదులు పూర్తి చేసుకుని గౌరీదేవిని పూజించాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం అయిన అనంతరం తిరిగి గౌరీ పూజ చేసి అమ్మవారికి పది అట్లు నివేదించాలి తర్వాత ఓ ముత్తయిదువకు అలంకారం చేసి, పది అట్లు, పది ఫలాలు వాయనమివ్వాలి. (ప్రాంతీయ ఆచారాలను బట్టి ఈ సంఖ్య మారవచ్చు). తర్వాత కింది కథ చెప్పుకుని అక్షతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి.
వ్రతకథ
పూర్వం పాటలీపుత్రాన్ని సుశీలుడనే రాజు పాలిస్తుండేవాడు. వారికి లేకలేక పుట్టిన కుమార్తెకు ‘సునామ’ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. సునామకు యుక్తవయస్సు రాగానే రాజదంపతులు ఆమెకు ఎన్నో సంబంధాలు చూశారు. అయితే అన్నీ ఏదో ఒక కారణంతో తప్పిపోతుండేవి. దాంతో విరక్తి చెందిన సునామ గౌరీదేవి ఆలయానికెళ్లి ఆత్మహత్యకు సిద్ధమైంది. సరిగ్గా ఆ తరుణంలో ‘‘చంద్రోదయ గౌరీవ్రతం ఆచరించినట్లయితే యోగ్యుడు, సర్వలక్షణ సంపన్నుడైన భర్త లభిస్తాడని, సంసారం సౌఖ్యంగా సాగిపోతుంద’’ని ఒక అదృశ్యవాణి పలుకుతూ, ఆ వ్రతవిధానాన్ని వివరించింది.
ఆ మాటలతో ఉత్సాహం తెచ్చుకున్న సునామ ఆశ్వయుజ బహుళ తదియనాడు పొద్దున్నే మేల్కొని, రాత్రి చంద్రోదయం అయ్యేవరకూ కఠిన ఉపవాసం ఉంది. సునామ ఎంతో సుకుమారి కావడంతో సాయంత్రానికల్లా నీరసంతో పడిపోయింది. దాంతో ఆమె సోదరులు చెల్లెలి మీద ప్రేమతో చేరువలో ఉన్న చింతచెట్టుకి ఒక అద్దాన్ని కట్టి, దానికెదురుగా గడ్డిమోపుకు నిప్పంటించి, ఆ మంట వెలుగు అద్దంలో ప్రతిబింబించేలా చేశారు. చెల్లెల్ని లేపి, ‘‘సోదరీ! అదుగో ఆ చింతచెట్టు కొమ్మల్లోంచి చంద్రుడు కానవస్తున్నాడు చూడు’’ అన్నారు. సునామ ఆ వెలుగు చంద్రుడేనని భ్రమించి ఎంగిలిపడింది.
తెలియక చేసినప్పటికీ వ్రత ఉల్లంఘన దోషం కారణంగా ఆమెకు ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో విసుగు చెందిన తల్లిదండ్రులు వయసు ముదిరిన వరులను వెదకడం ఆరంభించారు. దాంతో ఒకనాటి రాత్రి సునామ అడవిలోకి పారిపోయి ఆత్మహత్యకు సిద్ధపడింది. అప్పుడు భూలోక సంచారం చేస్తున్న పార్వతీ పరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఆమెకు ఎదురై, ఆమెని వారించారు. ఆమె అన్నలు చేసిన పని వల్ల వ్రతోల్లంఘనమయిందనీ, అందువల్లే సరైన సంబంధం కుదరడం లేదని, తిరిగి నియమ నిష్టలతో వ్రతాన్ని ఆచరించమని చెప్పి అదృశ్యమయ్యారు. ఈసారి వారు చెప్పిన విధంగా సజావుగా వ్రతాన్ని నిర్వహించింది సునామ. దాంతో ఆమెకు అతి స్వల్పకాలంలోనే అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.
ఉద్యాపన విధానం
పదిమంది ముత్తయిదువలకు ఒక్కొక్కరికి ఒక నల్లపూసల గొలుసు, లక్కజోళ్లు, రవికెల గుడ్డ, దక్షిణ, తాంబూలంతో పది అట్లు చొప్పున వాయనం ఇచ్చి, వారి ఆశీస్సులందుకోవాలి.
అట్లే ఎందుకు తినాలంటే...
నవగ్రహాలలోని కుజునికి అట్లంటే ప్రీతి కాబట్టి అట్లను నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమవడమేగాక సంసారం సాఫీగా సాగుతుంది. గర్భధారణలో సమస్యలు తలెత్తవు. అట్లను తయారు చెయ్యడానికి వాడేది మినప పిండి, బియ్యప్పిండి మిశ్రమం కదా, అందులో మినుములు రాహువుకూ, బియ్యం చంద్రునికీ సంబంధించినవి. ఈ రెండూ కలిసిన అట్లను వాయన మివ్వడం వల్ల గర్భదోషాలు తొలగి సుఖప్రసవం అవుతుందని విశ్వాసం.
సంప్రదాయమే కాదు... శాస్త్రీయ దృక్పథం కూడా..!
గౌరీదేవికి ఆటపాటలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ వ్రతంలో భాగంగా ఆడపిల్లలంతా తెల్లవారుజామున వెన్నెల్లో ఒక చోటికి చేరి బలంగా ఉన్న చెట్లకొమ్మకి ఉయ్యాలలు కట్టి తమ స్నేహితురాళ్లందరికీ వినిపించేలా చప్పట్లు చరుస్తూ పాటలు పాడతారు. అట్లతద్దిరోజు ఆటలాడటం వల్ల నడుము గట్టిపడుతుంది. తద్దెపాటలు లోకంలో బతకాల్సిన తీరు గురించి సందేశమిస్తాయి. అందుకే అట్లతద్దెకు ఆంధ్రదేశంలో అంత ప్రాధాన్యత.
- డి.వి.ఆర్