శుభప్రద మాసం...ఫలప్రద పున్నమి | Auspicious month and full moon | Sakshi
Sakshi News home page

శుభప్రద మాసం...ఫలప్రద పున్నమి

Published Fri, Nov 15 2013 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM

శుభప్రద మాసం...ఫలప్రద పున్నమి

శుభప్రద మాసం...ఫలప్రద పున్నమి

కారుమబ్బులు కానరాని నిర్మలమైన నీలాకాశం... ఆహ్లాదకరమైన వాతావరణం... రకరకాల సువాసనా పుష్పాలతో నిండిన పూలమొక్కలు ... ఆలయాలు ప్రతిధ్వనించేలా కేశవనామాలు, శివపంచాక్షరీ స్తుతులు... మనసును ఆనంద డోలికలలో ముంచెత్తే పూజలు, కనువిందు చేసే దీపాలు... నాసికాపుటాలకు సోకే సుగంధపరిమళాలు... గుండెలలో నిండిన ఆధ్యాత్మికతతో, అరమోడ్చిన కన్నులతో కనిపించే భక్తులు... ఈ వాతావరణం కనపడిందీ అంటే అది కచ్చితంగా కార్తిక మాసమే!
 
పౌర్ణమినాడు కృత్తికానక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి కార్తికమాసమని పేరు. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జపాలు, ఆలయ సందర్శనలు అటు హరికీ, ఇటు హరుడికీ, మరోపక్క వారిద్దరి తనయుడైన అయ్యప్పకీ  కూడా ఎంతో ప్రీతిపాత్రమైనవి. ఇక ఈ మాసంలో పున్నమినాడు శివాలయంలో జరిగే జ్వాలాతోరణ సందర్శనం చేయడం అత్యంత పుణ్యప్రదం. అంతేకాదు... తులసిపూజ, వనభోజనాలు, సమారాధనలు, ఉపవాసాలు, అభిషేకాలు, సహస్రనామ పారాయణలతో అలరారుతూ... ఎంత నాస్తికుడికైనా ఆస్తికభావనలు కలుగజే స్తుంటాయి. ఈ మాసం శుక్లపక్షంలోని పద్నాలుగు రోజులు అప్పుడే గడిచిపోయాయి. రేపే పున్నమి. కార్తికమాసంలో అత్యంత పర్వదినం కార్తిక పూర్ణిమ.
 ‘‘కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
 జలేస్థలే యే నివసంతి జీవాః
 దృష్ట్యాప్రదీపనం చ జన్మభాజనం
 భవన్తి నిత్యం శ్వపచాహివిప్రాః’’

 కార్తీక జ్వాలాదర్శనం చేసినందువలన జాతిభేదం లేకుండా
 మానవులకు, కీటకాలకు, పక్షులకు, దోమలకు జలచరాలైన
 చేపలకు మున్నగువానికే కాక వృక్షాలకు కూడా పునర్జన్మ ఉండదని పై శ్లోకార్థం.
 
 శైవ, వైష్ణవ భేదం లేని అత్యున్నత మాసమైన కార్తిక మాసంలో నిండుపౌర్ణమి ఘడియలలో సాక్షాత్తూ ఆ శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధిలో ప్రజ్వలించే జ్వాలాతోరణదర్శనంతో సర్వపాపాలు హరించబడి సద్గతి లభిస్తుందని పురాణకథనం. జ్వాలాతోరణ భస్మ, కాటుకలను ధరించడం వల్ల సర్వభయాలు వీడి, భూతప్రేత పిశాచబాధలు తొలగి, సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. త్రిపురాసుర  సంహారానంతరం పరమేశ్వరునిపై పడ్డ దృష్టిదోష పరిహారం కోసం... ఈశ్వరుని గౌరవార్థం మొట్టమొదటగా పార్వతీదేవి కార్తికపౌర్ణమి రోజున జ్వాలాతోరణోత్సవాన్ని జరిపిందని పురాణాల ద్వారా తెలుస్తోంది.
 
  కార్తికపురాణం ప్రకారం ఒక్కో తిథికి ఒక్కో విశిష్టత ఉంది. ఏ రోజున ఏమి చేస్తే ఏ ఫలం కలుగుతుందో కార్తికపురాణం స్పష్టంగా పేర్కొంది. కాబట్టి అవకాశం మేరకు ఆ విధంగా చేయగలిగితే మంచిది.
 
 కార్తిక బహుళ పాడ్యమి: ఈరోజు ఆకుకూర దానం చేయడం శుభదాయకం.
 విదియ: వనభోజనం చేయడం విశేష ఫలాలనిస్తుంది.
 తదియ: పండితులకు, గురువులకు తులసిమాలను సమర్పించడంవల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి.
 చవితి: పగలంతా ఉపవసించి, సాయంత్రంవేళ గణపతిని గరికతో పూజ చేసి, ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సంపదలు కలుగుతాయి.
 పంచమి: చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం తినిపించడం శుభఫలితాలనిస్తుంది.
 షష్ఠి: గ్రామదేవతలకు పూజ జరిపించడం వల్ల వారు సంతుష్టులై, ఏ కీడూ కలుగకుండా కాపాడతారు.
 సప్తమి: జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి..
 అష్టమి: కాలభైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి, కాలభైరవానికి (కుక్కకు) సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.
 నవమి: వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు.
 దశమి: నేడు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై, కోరికలు తీరతాయని పురాణోక్తి.
 ఏకాదశి: విష్ణ్వాలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణవిశేషఫలదాయకం.
 ద్వాదశి: అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించడం శుభప్రదం.
 త్రయోదశి: నవగ్రహారాధన చేయడంవల్ల గ్రహదోషాలు తొలగుతాయి.
 చతుర్దశి: ఈ మాస శివరాత్రినాడు ఈశ్వరార్చన, అభిషేకం వల్ల అపమృత్యుదోషాలు, గ్రహబాధలు తొలగి, ఆరోగ్యవంతులవుతారని పురాణోక్తి.
 
 అమావాస్య: ఈరోజు పితృదేవతల సంతృప్తి కోసం అన్నదానం చేయాలి లేదా పండితులకు, బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి. పగలు ఉపవాసం ఉండటం మంచిది. శివకేశవ ప్రీత్యర్థం దీపారాధన చేసి, నారికేళాన్ని నివేదించాలి.  
 
 మన పెద్దలు ఏది చెప్పినా ఊరికే చెప్పరు. దానివెనుక శాస్త్రీయ కారణాలెన్నో ఉంటాయి. లోతుగా ఆలోచిస్తే... పైన పదిహేను రోజులలో ఆచరించవలసిన విధులలో భూతదయకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనపడుతోంది. ఉపవాసం ఉండమనేది కూడా మన ఆరోగ్యరక్షణ కోసమే. అంతేకాదు, మనం అభోజనంగా ఉంటేనే అవతలి వారి ఆకలి బాధ తెలుస్తుంది. అప్పుడే మనకు ఆకలి విలువ తెలిసి, అవతలి వారికి అన్నం పెట్టగలం. అలాగే చన్నీటిస్నానాలు చేయమనడం లోనూ, కొన్ని రకాల పదార్థాలను తినకూడదు అనడంలోనూ, ఫలానావి తినాలని చెప్పడంలోనూ ఆరోగ్యసూత్రాలెన్నో ఇమిడి వున్నాయి. ఇక ఈ మాసంలో వనభోజనాలకు పెద్దపీట వేయడం ఎందుకంటే... పత్రహరితంతోనే మానవాళి మనుగడ ముడి వేసుకుంటుందని చెప్పడం కార్తికవనభోజనాల అంతస్సూత్రం. ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఉసిరికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ సంగతిని జనావళికి గుర్తుచేసేందుకే ఉసిరి చెట్లకింద పనస ఆకుల విస్తట్లో జరిగే విందులు. ఇవే పర్యావరణ ప్రాధాన్యతను తెలియజేసేందుకు సిసలైన మార్గాలు. ఏవీ కూడా ఇలా చేయండి అంటే ఎవరూ చేయరు. అది లోకరీతి. అదే భగవంతుని పేరు చెబితే... భక్తితో కాకబోయినా భయంతో అయినా చేస్తారనే పెద్దలు, పౌరాణికులు, అనుభవజ్ఞులు కొన్నింటికి దేవుణ్ణి, మరికొన్నింటికి పాపపుణ్యాల ప్రసక్తి తెచ్చి మరీ చెప్పారు. అది అర్థం చేసుకుంటే నాస్తికులు కూడా ఆస్తికులే అవుతారు! ఆ రకంగా చూస్తే ఇది శుభప్రద మాసమే కదా మరి!
 
 - డి.వి.ఆర్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement